Kokapet Neopolis land: నియో పోలిస్‌లో ఫ్రీ లాంచ్ దందా..! కొన్న భూములకు డబ్బులు కట్టడానికి…!
కోకాపేట నియోపోలిస్‌లో ఒక్క ఎకరా వంద కోట్లు పలికింది. మరి కంపెనీలు అంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తున్నాయి..? నిజంగా అంత డబ్బు వాటి దగ్గరుందా..? ఆ డబ్బుల కోసమే ప్రీలాంచ్ దందా మొదలుపెట్టారా..? ఈ ప్రీలాంచ్‌ను నమ్మొచ్చా..?
వంద కోట్లు.. ఇటీవల హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో ఒక్క ఎకరాకు పలికిన ధర. ఆ ప్రాంతంలో అన్ని భూములు వంద కోట్లు పలకకపోయినా కాస్త అటూ ఇటుగా అదే ధరకు అమ్ముడయ్యాయి. కొంత భూమి ఎకరా 70-80 కోట్ల రూపాయలు కూడా పలికింది. ఎంత పెద్ద కంపెనీ అయినా ఈ స్థాయి రేట్లతో రెండు, మూడు ఎకరాలు కొంటే కనీసం 2వందల కోట్ల వరకు కట్టాల్సి ఉంటుంది. అందుకు ఉండే సమయం కూడా తక్కువ. మరి కంపెనీలు అంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నియోపోలిస్‌లో భూములు కొన్న కంపెనీలు ఇప్పుడు ఆ డబ్బుల కోసమే ప్రీలాంచ్ దందాకు తెరలేపాయి. ఆ డబ్బునే ప్రభుత్వానికి చెల్లించి భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చూస్తున్నాయి.
ఏంటీ ప్రీ లాంచ్..!
ప్రీలాంచ్ అంటే ఇంకా నిర్మాణం మొదలు కాకముందే తక్కువ ధరకు ఫ్లాట్లను అమ్మేయడం. నిర్మాణం మొదలయ్యాక చదరపు అడుగు 10వేలు ఉంది అంటే ప్రీలాంచ్ పేరిట ఐదారు వేలకే ఇచ్చేస్తారు. ఇది వినడానికి బాగానే ఉంటుంది. కానీ ఆ డబ్బులు ఇచ్చాక మన జుట్టు బిల్డర్ల చేతిలో ఇరుక్కుపోయినట్లే. బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలు కూడా పెట్టకముందే పూర్తి డబ్బు లేదా 70శాతం మన దగ్గర వసూలు చేసేస్తారు. పరిచయాలను బట్టి పూర్తి మొత్తమా లేక విడతల వారీగా చెల్లించడమా అన్నది ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత రెండేళ్లకో, మూడేళ్లకో నిర్మాణం పూర్తవుతుంది. ఈలోపు ఏమైనా సమస్యలొస్తే మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయినట్లే. చట్టప్రకారం ప్రీలాంచ్ విక్రయాలు నేరం. కానీ బిల్డర్లు డబ్బుల కోసం ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తుంటారు. తక్కువ ధరకు అనేసరికి జనం ఆశపడి ముందే డబ్బు కట్టేస్తారు. కానీ ఆ తర్వాత అవి పూర్తికాక, ఫ్లాటు లేదా ప్లాటు చేతికి రాక ఇబ్బందులు పడుతుంటారు. సాహితి సహా పలు సంస్థలు ఇలానే మోసం చేశాయి. అనుకున్న సమయానికి పూర్తి చేయడం కాదు గడువు పూర్తైనా అసలు నిర్మాణాలే మొదలుపెట్టని సంస్థలు చాలానే ఉన్నాయి.
రియల్టర్లకు ఏంటి లాభం..?
ప్రీలాంచ్‌తో రియల్టర్లకు మంచి లాభం ఉంటుంది. ముందే అమ్మేయడం వల్ల ఆ డబ్బుతో పనులు మొదలు పెట్టుకోవచ్చు. బయట 4-5 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి వాటిని కట్టడం కంటే ఇలా ప్రీలాంచ్ పేరిట వసూలు చేసి దాంతో కట్టడం సుఖమనుకుంటున్నారు. అంటే వడ్డీలు కట్టాల్సిన పనిలేదు. ఇలా కొన్ని ప్లాట్లను ప్రీలాంచ్ పేరుతో అమ్మి మిగతా వాటీని నిర్మాణం పూర్తయ్యాక ఎక్కువ ధరకు అమ్మేస్తారు. దానివల్ల వారి లాభానికి ఎలాంటి ఢోకా ఉండదు.
కోకాపేటలో ఏం జరుగుతోంది..?
కోకాపేటలో భూములు కొన్న కొన్ని సంస్థలు ఆ భూమి ఇంకా తమ పేరు మీద రాకముందే ప్రీలాంచ్ దందా మొదలుపెట్టేశాయి. నియోపోలిస్ లాంటి ప్రాంతంలో చదరపు అడుగు కనీసం 12 నుంచి 15 వేలు పలుకుతుంది. కానీ దాన్ని 6 నుంచి 8వేలకే ప్రీలాంచ్ పేరిట ఇస్తామని భూములు కొన్న సంస్థలు చెబుతున్నాయి. ఆ ప్రాంతంలో ఎకరా కొన్నా హైరైజ్ అపార్ట్‌మెంట్‌లు కట్టుకోవచ్చు. కనీసం 50 అంతస్తులు కట్టొచ్చు. ఇప్పుడు ప్రీలాంచ్ పేరిట 20శాతం ఫ్లాట్లనైనా అమ్మాలని సంస్థలు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. దీనివల్ల కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. ప్రీలాంచ్‌లో చదరపు అడుగు 8వేలు కింద అమ్మినా ఒక్క ఫ్లాటు కనీసం 1800చదరపు అడుగులు వేసుకున్నా కోటిన్నర వస్తుంది. అలా 30ప్లాట్లు అమ్మినా 40 నుంచి 50కోట్లు వస్తాయి. ఆ డబ్బును ప్రభుత్వానికి చెల్లించి భూమిని అధీనంలోకి తీసుకుంటారు.
ప్రీలాంచ్‌లో కొనొచ్చా..!
భూమి బిల్డర్ల చేతిలో ఉండగా ప్రీలాంచ్ ఆఫర్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అసలు భూమి వారి అధీనంలోకి ఇంకా రాలేదు. కానీ అప్పుడే ప్రీలాంచ్ మోసాన్ని ప్రయోగించారు. అంటే ఆ డబ్బుతోనే భూమిని కొనబోతున్నారు. 70కోట్లు పెట్టి భూమి కొన్న ఓ సంస్థ ఇప్పటికే దాదాపు 60ప్లాట్లను అమ్మినట్లు తెలుస్తోంది. ఈ ప్లాట్లకు ఎలాంటి గ్యారెంటీ లేదు. డబ్బులు చెల్లిస్తే కంపెనీ అగ్రిమెంట్ చేసిస్తుంది. దీనికి ఎలాంటి గ్యారెంటీ లేదు. కేవలం నమ్మకం మీద కొనడమే. రేపు ఆ భూమి ఏదో ఓ కారణంతో రాకపోతే ఏంటన్నది పెద్ద ప్రశ్నే. నమ్మకంపై గుడ్డిగా నమ్మకం ఉంచడం కూడా సరికాదు. ఒకవేళ భూమి తమ చేతికి వచ్చినా దాన్ని సరిచేసి, ప్లాన్ రెడీ చేసి ఆ తర్వాత పనులు మొదలు పెట్టాలి. నిర్మాణం పూర్తయ్యేసరికి కనీసం మూడు, నాలుగేళ్లు పడుతుంది. అప్పటికి ప్రీలాంచ్ పేరిట మనం కట్టిన డబ్బు, అప్పటి ఆఫర్ ధరతో కాస్త అటూ ఇటూగా ఉంటుంది. మరికొన్ని సంస్థలు కూడా ఇలాగే ప్రీలాంచ్ ఆఫర్లను కస్టమర్లకు ఎర వేస్తున్నాయి.
ప్రీలాంచ్ అన్నది ఓ వలయం లాంటిది. పూర్తైతే పర్లేదు. ఎంతో కొంత లాభం ఉంటుంది. కానీ ఏ మాత్రం తేడా వచ్చినా బిల్డర్ల చుట్టూ తిరగాలి. తేడా వస్తే కోర్టులను నమ్ముకోవాలి. ప్రస్తుతానికైతే ప్రీలాంచ్ అన్నది కాస్త రిస్కీ వ్యవహారమే. వందల కోట్లు పలుకుతున్న కోకాపేట విషయంలో అయితే అది మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. సో బీకేర్‌ఫుల్.