President Of India: ఎన్నికల వేళ 12 రాష్ట్రాల గవర్నర్ ల బదిలీలు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ.. మరికొందరిని ఉన్న చోటనుంచి బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అయోధ్య రామమందిరం తీర్పును వెలువరించిన ఐదుగురు సభ్యుల బెంచ్ లో ఈయన ఒకరుగా ఉన్నారు. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీచేశారు.
అనేక కీలక నిర్ణయాలు:
ఈయన 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండునెలల తరువాత బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఈయన గవర్నర్ గా కొనసాగారు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక కీలక నిర్ణయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తూ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకూడా గతంలో అనేక ఆరోపణలు చేసింది. గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ అనేక సార్లు అభ్యంతరం తెలిపింది. గతంలో బిశ్వభూషణ్ హరిచందన్‌ను గవర్నర్ గా కొనసాగుతున్న సమయంలోనే టిడిపి నాయకులపై జరుగుతున్న దాడులు, పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై అనేకమార్లు ఫిర్యాదు చేసినా గవర్నర్ పట్టించుకోలేదని తెలిపింది. కేంద్రానికి కూడా బిశ్వభూషన్ వ్యవహారశైలిపై అనేకసార్లు లేఖలు పంపింది. ఎన్ని ఆరోపణలు వచ్చినా నాలుగేళ్లపాటూ గవర్నర్ గా బాధ్యతల్లో కొనసాగారు. మరో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయన్న తరుణంలో గవర్నర్ ల బదిలీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కొత్త సాంప్రదాయం:
ఇదివరకూ పార్టీలకు సంబంధించిన వారిని కాంగ్రెస్ గవర్నర్ లు గా నియమించగా.. ప్రస్తుతం బీజేపీ కూడా పలు రాష్ట్రాలకు గవర్నర్ లుగా నియమించింది. కానీ ఇప్పుడు న్యాయమూర్తులను నియమించడం విశేషంగా మారింది. కొత్తగా నియమించిన గవర్నర్ ఏవిధంగా తన బాధ్యతలను ఏవిధంగా నిర్వర్తిస్తారు.. ప్రభుత్వంతో ఎలా మెలుగుతారు అన్నదానిపై కూడా అనేక సందేహాలు వెలువడుతున్నాయి. రేపు విజయవాడలోని రాజ్ భవన్ నుంచి గవర్నర్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది.
నూతన గవర్నర్లుగా నియామకం:
ఇంకా పలురాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్ ను నియమించగా సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ను నియమించింది. జార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్ కు బాధ్యతలు అప్పగించింది. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా అదేవిధంగా అసోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మణిపూర్ గవర్నర్‌గా అనసూయ ను నాగాలాండ్ గవర్నర్‌గా గణేషన్ కు రాష్ట్రపతి భవన్ ఆమోదముద్ర వేసింది. మేఘాలయ గవర్నర్‌గా చౌహాన్ నియమించగా బీహార్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ కు బాధ్యతలు అప్పజెప్పింది. గతంలో మహారష్ట్ర గవర్నర్ గా ఉన్న కొశ్యారీ ఛత్రపతి శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగింది. దీని కారణంగా కౌశ్యారీని తొలగించి రమేశ్ బైస్ ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. లడఖ్ గవర్నర్‌గా బి.డి. మిశ్రా బాధ్యతలు చేపట్టనున్నారు.
త్వరలో మరికొన్ని రాష్ట్రాలో బదిలీలు:
ఇప్పటి వరకూ కొన్నిరాష్ట్రాల గవర్నర్ లనే కేంద్రప్రభుత్వం మార్పులు చేసింది. త్వరలో మరి కొన్ని రాష్ట్రాలకు ఈ మార్పుల పరంపర కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను మార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని తెలుస్తుంది.