Telugu States Ministers : తెలుగు రాష్ట్రాల నుంచి.. ఆ ఐదుగురు
ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) కొత్త కేబినెట్ (New Central Cabinet) లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. ఇందులో టీడీపీ (TDP) నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు కేబినెట్ లో జాయిన్ అవ్వబోతున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) కొత్త కేబినెట్ (New Central Cabinet) లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. ఇందులో టీడీపీ (TDP) నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ముగ్గురు కేబినెట్ లో జాయిన్ అవ్వబోతున్నారు. ఏపీలో టీడీపీ ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం దక్కింది. అలాగే బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఇటు తెలంగాణలో కిషన్ రెడ్డి (Kishan Reddy) తో పాటు ఈసారి బండి సంజయ్ (Bandi Sanjay) కి అవకాశం ఇచ్చారు ప్రధాని మోడీ. కేబినెట్ పై ఆశలు పెట్టుకున్న పురంధేశ్వరికి నిరాశే మిగిలింది. ఆమెను లోక్ సభ స్పీకర్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. ఈ కేబినెట్ లో జనసేన (Janasena) కు అవకాశం ఇవ్వలేదు. కేబినెట్ విస్తరణలో ఛాన్స్ ఇస్తారని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. ఏపీ నుంచి టీడీపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) కి ఛాన్స్ దక్కింది. ఆయన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు గతంలో 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పార్టీకి విధేయత, బీసీ వర్గాల నాయకుడు కావడంతో కింజారపుని రికమండ్ చేశారు చంద్రబాబు. అలాగే టీడీపీ ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కేబినెట్ లో బెర్త్ దక్కింది. గుంటూరు పార్లమెంట్ సభ్యుడైన ఆయన… మొదటిసారి టీడీపీ ఎంపీగా గెలిచారు. ఎంబీబీఎస్ డాక్టర్, అమెరికాలో పీజీ పూర్తి చేసుకున్నారు. NRI అయిన పెమ్మసాని… వైద్య విద్య, ఫిజిషియన్ రంగాల్లో నిపుణులు. పెమ్మసాని ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. NRI పారిశ్రామికవేత్తగా తనకున్న అనుభవంతో ఏపీకి పెట్టుబడులు తీసుకొస్తారని చంద్రబాబు భావించారు.
ఏపీ బీజేపీ నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మకు మోడీ కేబినెట్ లో చేరే అవకాశం కలిగింది. నరసాపురం పార్లమెంట్ సభ్యుడైన ఆయన… మొదటిసారి బీజేపీ ఎంపీగా గెలిచారు. 30యేళ్ళుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారు. నరసాపురం ఎంపీ టిక్కెట్ కోసం రఘురామ కృష్ణరాజు ఎంతగా ప్రయత్నించినా… సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కష్టపడుతున్న భూపతి రాజుకే ఛాన్స్ ఇచ్చింది బీజేపీ. ఇప్పుడు కూడా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని కాదని… ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది. మోడీ 3.0 కేబినెట్ లో పురంధేశ్వరిని లోక్ సభ స్పీకర్ చేస్తారని ఆమె అనుచరులు చెబుతున్నారు.
తెలంగాణ నుంచి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కు అవకాశం కల్పించారు. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచారు. 2019, 2024లో బీజేపీ ఎంపీగా అక్కడి నుంచే విజయం సాధించారు. గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ కి మోడీ కేబినెట్ లో చోటు దక్కింది. 2019, 2024లో బీజేపీ ఎంపీగా అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. కిషన్ రెడ్డి కంటే ముందు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్…తెలంగాణాలో పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటంలో ముందున్నారు. కార్పొరేటర్ నుంచి ఎంపీగా ఎదిగిన బండి సంజయ్… దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని పనిచేశారు. అందుకే విధేయతకు అవకాశం ఇచ్చారు నరేంద్రమోడీ.