పృథ్వీ షాకు గోల్డెన్ ఛాన్స్, ధోనీ అవకాశమిస్తాడా ?
ఐపీఎల్ మెగావేలంలో ముంబై క్రికెటర్ పృథ్వీ షా అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. తన ఆట కంటే వివాదాలు, ఇతర అంశాలతో వార్తల్లో నిలిచిన పృథ్వీ షా కెరీర్ ముగిసినట్టేనని చాలా మంది అనుకున్నారు.

ఐపీఎల్ మెగావేలంలో ముంబై క్రికెటర్ పృథ్వీ షా అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. తన ఆట కంటే వివాదాలు, ఇతర అంశాలతో వార్తల్లో నిలిచిన పృథ్వీ షా కెరీర్ ముగిసినట్టేనని చాలా మంది అనుకున్నారు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటకీ సరైన క్రమశిక్షణ లేక తన కెరీర్ ను తానే పాడు చేసుకున్నాడంటూ పలువురు సానుభూతి కూడా చూపించారు. కానీ పృథ్వీ షా మాత్రం దేశవాళీ క్రికెట్ లో కంటిన్యూ అవుతున్నాడు. జాతీయ జట్టులో రీఎంట్రీ అసాధ్యమని తేలిపోగా.. ఇప్పుడు దేశవాళీ క్రికెట్ లోనే సత్తా చాటేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పృథ్వీ షాకు ఐపీఎల్ ఆడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గాయంతో సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. అతని స్థానంలో ధోనీ జట్టు పగ్గాలు అందుకోగా.. బ్యాటర్ గా రుతురాజ్ ప్లేస్ ను భర్తీ చేయాల్సి ఉంది.
ఈ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో సీఎస్కే జట్టుకు గైక్వాడ్ స్థానంలో టాప్ ఆర్డర్ లో ఆడగల బ్యాటర్ అవసరం. గత సంవత్సరం మెగా వేలంలో అమ్ముడుపోకుండా నిలిచిన యువ ఆటగాడు పృథ్వీ షా జట్టులో ఈ లోటును భర్తీ చేయగలడు. పృథ్వీషా సీఎస్కే జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇవ్వడమే కాకుండా.. తన బ్యాటింగ్‌తో జట్టులోని ఇతర ఆటగాళ్లపై ఒత్తిడిని కూడా తగ్గించగలడని అంచనా వేస్తున్నారు.. ఇది జరిగితే పృథ్వీ షా సీఎస్కే జట్టుకు కొత్త లైఫ్ లైన్ అవుతాడని చెబుతున్నారు. 25 ఏళ్ల ముంబై ఓపెనర్ 2018 నుంచి 2024 వరకు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన పృథ్వీ షా.. 79 మ్యాచ్‌ల్లో 23.95 సగటుతో, 147.47 స్ట్రైక్ రేట్‌తో 1892 పరుగులు చేశాడు. ఈ కాలంలో పృథ్వీ షా బ్యాట్ నుంచి 14 అర్థ సెంచరీలు వచ్చాయి.
గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 9 మ్యాచ్ లు ఆడిన షా 197 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్ టోర్నీ రాయల్ వన్డే కప్ లోనూ రాణించాడు. 8 ఇన్నింగ్స్ లలో 3 హాఫ్ సెంచరీలతో 343 రన్స్ చేశాడు. అయితే, పృథ్వీ షా ఫిట్ నెస్ సమస్యతో బాధపడుతున్నాడు. ధోని కెప్టెన్సీలో అతడు ఆ సమస్యను అధిగమించగలడని భావిస్తున్నారు. ఇదే జరిగితే పృథ్వీ షా పాడైపోయిన కెరీర్ మళ్లీ గాడిన పడే అవకాశం ఉంది. కానీ పృథ్వీ షాకు గట్టిపోటీ ఇచ్చే మరో ఇద్దరి క్రికెటర్ల పేర్లు కూడా రుతురాజ్ రీప్లేస్ మెంట్ గా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరిలో భారత యువ క్రికెటర్ ఆయుష్ మాత్రే రేసులో ముందున్నాడు. సీజన్ మధ్యలో చెన్నై ఫ్రాంచైజీ ట్రయల్స్ కోసం మాత్రేని పిలిచి అతని బ్యాటింగ్ ను పరిశీలించింది. 17 ఏళ్ల మాత్రే ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోకున్నా దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్నాడు. నవీ ముంబై టీ 20 టోర్నమెంట్ లోనూ, విజయ్ హజారే ట్రోఫీలోనూ మాత్రే ఆకట్టుకున్నాడు. విజయ్ హజారేలో ఈ యువ క్రికెటర్ 7 ఇన్నింగ్స్ లో 65కు పైగా యావరేజ్ తో 458 పరుగులు చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక ఫారిన్ ప్లేయర్ ప్లేస్ కూడా మిగిలి ఉంది. దీంతో రుతురాజ్ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ ను కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన బ్రెవిస్, సౌతాఫ్రికా టీ20 లీగ్ లో అదరగొట్టాడు.