కూతకు రెడీనా ? హైదరాబాద్ లో ప్రో కబడ్డీ
గ్రామీణ క్రీడను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్ది అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ కొత్త సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. గత 10 సీజన్ల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రో కబడ్డీ 11వ సీజన్ హైదరాబాద్ వేదికగా మొదలవబోతోంది.
గ్రామీణ క్రీడను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్ది అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ కొత్త సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. గత 10 సీజన్ల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రో కబడ్డీ 11వ సీజన్ హైదరాబాద్ వేదికగా మొదలవబోతోంది. గచ్చిబౌలీ స్టేడియం వేదికగా అక్టోబర్ 18న జరిగే తొలి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ , బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. అదే రోజు జరిగే రెండో మ్యాచ్‌లో యూ ముంబాతో దబాంగ్ ఢిల్లీ ఆడనుంది. ఈ సారి ప్రోకబడ్డీ లీగ్‌ను మూడు నగరాలకు మాత్రమే పరిమితం చేశారు. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్, గచ్చిబౌలిలోని స్టేడియంలోనూ , నోయిడాలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు, పుణే వేదికగా డిసెంబర్ 3 నుంచి 24 వరకు ప్రో కబడ్డీ సీజన్ జరగనుంది.
ఈ సీజన్ కబడ్డీ అభిమానుల అంచనాలను అందుకుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన వేలం కూడా పూర్తయింది. స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు కురిపించాయి. లీగ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 8 మంది కబడ్డీ ఆటగాళ్లు కోట్లకు అమ్ముడయ్యారు.
స్టార్ ప్లేయర్ పవన్ సెహ్రావత్‌ను మరోసారి తెలుగు టైటాన్స్ వేలంలో కొనుగోలు చేసింది. కోటి డెబ్బై లక్షల ఇరవై ఐదు వేలకు పవన్ సెహ్రావత్‌ను తెలుగు టైటాన్స్ దక్కించుకుంది. గత సీజన్ తో పోలిస్తే తెలుగు టైటాన్స్ టీమ్ ఈ సారి చాలా వరకూ మారిపోయింది. అంచనాలకు తగ్గట్టు రాణించని పలవురు ప్లేయర్స్ ను తెలుగు టైటాన్స్ వేలంలోకి వదిలేసింది. గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపర్చిన తెలుగు టైటాన్స్.. ఈసారి జట్టును బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. వేలంలో పలువురు యువ ఆటగాళ్లను కోనుగోలు చేసింది.
డిఫెండర్లు క్రిషన్, మిలాద్ జబ్బారి, మహమ్మద్ మలాక్ తో పాటు ఆల్‌రౌండర్లు విజయ్ మలిక్, అమిత్ కుమార్ లను కూడా తెలుగు టైటాన్స్ జట్టులో ఉన్నారు. , రైడర్లు మంజీత్, ఆశీష్ నర్వాల్ ను టైటాన్స్ కొనుగోలు చేసింది. కొత్త కోచ్ క్రిషన్ కుమార్ హుడా ఆధ్వర్యంలో పవన్ సెహ్రావత్ జట్టును ఎలా నడిపిస్తాడనేది చూడాలి. గత నాలుగు సీజన్లలోనూ తెలుగు టైటాన్స్ అత్యంతప పేలవ ప్రదర్శన కనబరిచింది. దీంతో వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆ ఫ్రాంచైజీ ఈ సారి మంచి ప్రదర్శనతో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.