Biden: బైడెన్ అడ్డంగా దొరికిపోయాడుగా..!! Americans angry over Jo Biden |

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2023 | 06:44 AMLast Updated on: Feb 07, 2023 | 6:45 AM

Problems For American President Jo Biden

దుమ్మురేపాం… చైనా(china) కు వార్నింగ్ ఇచ్చాం.. డ్రాగన్ బెలూన్ ను కూల్చేశాం.. దాని అంతు తేలుస్తాం… ఇవీ బైడెన్ (Biden) లేటెస్ట్ కామెంట్స్… అమెరికా (America) గగనతలంలో చైనా బెలూన్ కారణంగా నెలకొన్న గందరగోళానికి ఓ ముగింపు వచ్చింది. నిఘాకు పాల్పడుతోందన్న అనుమానంతో ఫైటర్ జెట్ సాయంతో దాన్ని కూల్చేసిన బైడెన్ సర్కార్ దాన్నో ఘనకార్యంగా చెప్పుకుంది. అంతేనా అమెరికన్ల జోలికొస్తే ఊరుకునేది లేదంటూ రొటీన్ డైలాగ్ నే మరింత రొటీన్ గా చెప్పేశారు… శభాష్ అంటూ తమ జబ్బలు చరుచుకున్నారు బైడెన్… కానీ అమెరికన్లు మాత్రం బైడెన్ బాబాయిపై కారాలు మిరియాలు సారీ సారీ పెప్పర్లు, చిల్లీ ఫ్లేక్స్ నూరుతున్నారు.

అమెరికాపై నిఘా పెట్టేందుకు చైనా ఈ బెలూన్లను ప్రయోగించిందన్నది అనుమానం. దీన్ని కూల్చడం అమెరికన్లకు ఆనందం కలిగించాలి కానీ కోపమెందుకు అంటే కారణముంది. వారి ఆవేశమల్లా బైడెన్ సర్కార్ దాన్ని కూల్చినందుకు కాదు… ఆలస్యంగా స్పందించినందుకు… అమెరికా అణ్వాయుధ కేంద్రాలపై చైనా బెలూన్ (China Balloon) దాదాపు పదిరోజులు ఎగిరింది. ఏం ఫోటోలు తీసిందో, ఏం సమాచారం చైనాకు పంపించిందో ఎవరికీ తెలియదు… అన్ని రోజులు అది తమ గగనతలంలో ఎగురుతున్నా దాన్నేమీ చేయకపోవడం అమెరికన్లకు మింగుడు పడటం లేదు. అసలే అమెరికన్లు సెన్సెటివ్… అక్కడెక్కడో కాల్పులు జరిగాయంటే ఇక్కడ భయంతో వణికిపోతారు. అలాంటిది తమ నెత్తిన నిఘా నేత్రం ఉందన్న వార్త వారిని కలవరపెట్టింది. అమెరికా గ్రేట్ అని తాము జబ్బలు చరుచుకుంటుంటే బైడెన్ సర్కార్ మాత్రం దాన్ని కూల్చడంలో మీనమేషాలు లెక్కించింది. కనిపించగానే కూల్చాల్సింది పోయి తాత్సారం చేయడంపైనే అమెరికన్లు గుర్రుగా ఉన్నారు.

china-balloon_downed

china-balloon_downed

అసలది తమ భూభాగంలోకి ఎలా వచ్చిందో అమెరికన్లకు అర్థం కావడం లేదు. ఎక్కడో సిరియాలోనో, ఇరాక్ లోనో రెబల్స్ కదలికలను ఇక్కడుంచి పసిగట్టే తమ నిఘా వర్గాలు ఆ పెద్ద బెలూన్ ను ఎలా గుర్తించలేదో అమెరికన్ పౌరులకు అర్థం కావడం లేదు. అంతేకాదు అసలది తమ గగనతలంలోకి ఎలా వచ్చిందో కూడా తెలియదని చెప్పడం వారి ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఇప్పుడు రిపబ్లికన్లు ఇదే అంశంపై బైడెన్ ను ఏకి పారేస్తున్నారు. ఎందుకింత ఆలస్యం చేశారని నిలదీస్తున్నారు. జనావాసాలపై కూలుతుందన్న భయంతోనే దాన్ని కూల్చలేదన్న బైడెన్ సర్కార్ వాదనను వారు ఒప్పుకోవడం లేదు. దాన్ని దారి మళ్లించే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదన్నది వారి వాదన. చైనా శుభ్రంగా బెలూన్ సాయంతో తమ నిఘాను కొనసాగిస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చున్నారని బైడెన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక్కడ మరికొన్ని అనుమానాలు కూడా అమెరికన్లకు ఉన్నాయి. హువాయే కంపెనీ టెక్నాలజీని ఉపయోగించి చైనా నిఘాకు పాల్పడుతోందన్న అనుమానాలు అమెరికాకు ఉన్నాయి. దాంతో ఆ కంపెనీ టెక్నాలజీని వాడటం మానేసారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చవకగా దొరికే ఈ హువాయే టెక్నాలజీనే వాడుతున్నారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ ఎక్కువగా వాడుతున్న ప్రాంతాలపైనే ఈ చైనా బెలూన్ తిరిగింది. దీంతో ఆ టెక్నాలజీ ఏమైనా నిఘాకు ఉపయోగపడిందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.

ఈ వ్యవహారంలో చైనా ప్రవర్తించిన తీరు కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. కేవలం వాతావరణ పరిశోధన కోసమే దాన్ని ప్రయోగించామని చెబుతోంది. అది అదుపు తప్పి అమెరికా భూభాగంలోకి ప్రవేశించిందన్నది డ్రాగన్ వాదన. చెప్పడానికి బాగానే ఉన్నా దాన్ని అమెరికా కూల్చేయడానికి ప్రయత్నించడం చైనాను కలవరపెట్టింది. దారితప్పిన బెలూన్ ను కూల్చేస్తే తమకు వచ్చే నష్టమేంటో చైనా చెప్పలేదు. పైగా ఇది తమపై దాడిగానే పరిగణిస్తామంటూ వార్నింగ్స్ ఇచ్చింది. ఇదంతా అమెరికన్ల అనుమానాలను మరింత పెంచింది.

americans angry

americans angry

ఈ బెలూన్ జనవరి 28న అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని అనుమానిస్తున్నారు. అలస్కా (Alaska) మీదుగా జర్నీ చేసింది. ఆ తర్వాత కెనడా (Canada) లోకి ఎంట్రీ అయ్యి తర్వాత మళ్లీ అమెరికాలో ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పట్నుంచి దీనిపై రచ్చ మొదలైంది. ప్రస్తుతం దీన్ని కూల్చేశారు. దీని శకలాలు సముద్రంలో 47 అడుగుల లోతున పడ్డాయి. వాటిని సేకరించే పనిలో అమెరికా సైన్యం, FBI ఉన్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే వాటిని సేకరించి విశ్లేషించే పని ప్రారంభమవుతుంది. ఆ తర్వాతే అసలు దానిపై పూర్తి క్లారిటీ వస్తుంది. అది నిజంగా నిఘా కోసం వినియోగించిన బెలూనేనా లేకపోతే చైనా చెబుతున్నట్లు వాతావరణ అధ్యయనం కోసం ప్రయోగించిన బెలూనా అన్నది తేలుతుంది. ఒకవేళ నిఘా కోసమే అయితే అది ఎంత సమాచారం, ఎలాంటి సమాచారం సేకరించి ఉంటుందన్నది విశ్లేషించాల్సి ఉంటుంది.

గోల్ చేయాల్సిన సమయంలో చేయాలి… ఆట ముగిశాక, ఓడిపోయాక గోల్ పోస్ట్ లోకి ఎన్నిసార్లు బాల్ పంపినా ఉపయోగం ఉండదు. బైడెన్ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. స్పందించాల్సిన సమయంలో తాత్సారం చేసి ఆ తర్వాత యాక్షన్ లోకి దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం బైడెన్ ఈ పరిస్థితుల్లోనే ఉన్నారు. ముందే స్పందించి ఉంటే బైడెన్ కు ఫుల్ క్రెడిట్ దక్కేది. కానీ ఇప్పుడు క్రెడిట్ సంగతి ఆ దేవుడెరుగు… మొత్తానికే మోసం వచ్చేలా కనిపిస్తోంది.

బైడెన్ పై ఇప్పటికే అమెరికాలో వ్యతిరేకత నెమ్మదిగా పెరుగుతోంది. అనారోగ్య సమస్యలు, మతిమరుపు, నెమ్మదిగా స్పందించడం, మాంద్యం పరిస్థితులు, నిరుద్యోగం బైడెన్ కు చుక్కలు చూపిస్తున్నాయి. దానికి తోడు ఆయన ఇంట్లో రహస్య పత్రాలు దొరకడం కూడా వివాదాస్పదమైంది. ఇన్ని సమస్యల మధ్య బైడెన్ కు ఇప్పుడు చైనా రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది. ఈ సవాల్ నుంచి బైడెన్ ఎలా బయటపడతారో చూడాలి…. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ట్రంప్ దీన్ని ఎలా వాడుకుంటారో అన్నది కూడా ఆసక్తిని రేపేదే…

(KK)