Chandrababu: బాబు అరెస్ట్ పై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు.. నియోజకవర్గాల వారిగా టీడీపీ కార్యకర్తల ఆందోళన 

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రమేయం ఉందని భావించిన సీఐడీ అరెస్ట్ చేసి విచారణకు ఆదేశించింది. ఆయనను విజయవాడకు తరలించే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలు చేపట్టారు టీడీపీ కార్యకర్తలు. ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2023 | 02:26 PMLast Updated on: Sep 09, 2023 | 2:26 PM

Protests Are Raging Across The State Over Chandrababus Arrest

చంద్రబాబు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రాస్తారోకోలు చేపట్టారు. అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కీలక నాయకులను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్ చేసినప్పటికీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. వీరిని నిలువరించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు సిద్దమైమయ్యారు. టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలు మాత్రమే కాకుండా వైసీపీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో కూడా అల్లర్లు, ఘర్షణతో కూడిన వాతావరణం నెలకొంది.

చిత్తూరు..

చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈరోజు ఉదయం అరెస్ట చేయడాన్ని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. తిరుపతి, పీలేరు, కుప్పం నియోజకవర్గాల్లో కార్యకర్తలతో పాటూ పార్టీ శ్రేణులు రోడ్లపై బైటాయించారు. ప్రభుత్వం చేస్తున్న చర్యలపై దుయ్యబట్టారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఇలాంటి పరిస్థితి చిత్తూరుకు మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి.

తిరుపతిలోనూ ఇదే పరిస్థితి..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రమేయం లేదని టీడీపీ కార్యకర్తలు వాదిస్తున్నారు. దీనికి నిరసనగా రోడ్లపైకి వచ్చి ర్యాలీ చేపట్టారు. పోలీసులు తీరుపై మండిపడ్డారు. సుగుణమ్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ప్రభుత్వంన్ని విమర్శించారు. రాజ్యంగ స్పూర్థికి విఘాతం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును విడుదల చేయకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆందోళన చేపట్టిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా పరిస్థితి సర్థుమణగలేదు.

అనంతపురం..

చంద్రబాబు అరెస్ట్ పై అనంతపురంలోని రాప్తాడు, హిందూపురంలో అల్లర్లు తారాస్థాయికి చేరాయి. పరిటాల సునీత ప్రతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. పరిటాల సునీతను పోలీసులు తమ వ్యాన్లో ఎక్కించి స్టేషన్ కి తరలించడం పై తెలుగుదేశం శ్రేణులు వ్యతిరేకించారు. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పోలీసులకు అడ్డం వచ్చిన వారిని కూడా స్టేషన్ కి తరలించారు. చంద్రబాబు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేఖమన్నారు. వెంటనే విడుదల చేయాలని లేకుంటా ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామన్నారు.

ప్రకాశం జిల్లా..

రాయలసీమ జిల్లాలతో పాటూ అటు ప్రకాశం లోనూ టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట చేయడం పై తీవ్రంగా ఖండించారు. అవినీతి ఎక్కడ జరిగిందో చూపించాలని పట్టుబట్టారు. ప్రభుత్వం కేవలం టీడీపీ పై కక్ష్యపూరింతంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వైసీపీ నేతలే అధిక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. దీంతో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం లో నిరసన చేపట్టారు.

గోదావరి జిలాల్లో పరిస్థితి..

చంద్రబాబుకు, టీడీపీకి కొంత ఎక్కువగా ప్రజాధారణ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. ఇక్కడ అనేక మంది సీనియర్ నాయకులు పోటీ చేసిన పరిస్థితి ఉంది. గతంలో చాలా మంది కీలక పదవులు కూడా అధిరోహించారు. అలాంటి గోదావరి జిల్లాల్లో మహిళా కార్యకర్తలు రోడ్డుపై కి వచ్చి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పైగా లోకేశ్ పాదయాత్ర గోదావరి జిల్లాల్లో చేరుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. యువగళం పేరుతో అతని వెంట నడిచే అనుచరులు కూడా చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తమ నిరసనను తెలిపారు. నారా లోకేష్ తన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి ప్రజాస్వామాయన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు.

తుని లో పరిస్థితి..

ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన యనమల రామకృష్ణుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. ప్రజాస్వామ్యానికి ఇది విరుద్దమన్నారు. పరిపాలనా చేతకాక ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. స్వచ్ఛందంగా తెలుగుదేశం కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. వెంటనే సీఐడీ అధికారులు చంద్రబాబును విడిచిపెట్టాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కృష్ణా జిల్లా..

విజయవాడ కేంద్రంగా తెలుగుదేశం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నాయకులు పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. దీనిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేశారు. దీంతో పోలీసులు కార్యకర్తలను, ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉదృతంగా మారింది. పోలీసులకు, కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. డౌన్ డౌన్ జగన్ అంటూ నినాదాలు చేశారు.

గుంటూరు..

గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో తెలుగుదేశం అభిమానులు, పార్టీ శ్రేణులు కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రయాత్నించారు. విజయవాడకు తరలిస్తున్న చంద్రబాబు ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిరసన గళాన్ని వినిపించారు. రోడ్లపై టైర్లు కాల్చి ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కల్గించారు. విష‍యం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కాన్వాయ్ ని విజయవాడకు పంపించారు. ఆందోళనలు చేపట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవే కాకుండా హిందూపురం, రాజోలు, అమరావతి, టెక్కలి, శ్రీకాకుళం, గాజువాక, విజయనగరంలోనూ పరిస్థితి ఉదృతంగా మారింది. దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.

T.V.SRIKAR