ఆసీస్ తో సిరీస్ కు పుజారా, కొత్త రోల్ లో వెటరన్ క్రికెటర్

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అంటే గత దశాబ్ద కాలంగా మనకు గుర్తొచ్చే కొన్ని పేర్లలో చటేశ్వర పుజారా ఒకటి... ద్రావిడ్ తర్వాత టెస్ట్ జట్టులో ఆ స్థానంలో ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా మారిన బ్యాటర్ పుజారానే... క్రీజులో పాతుకుపోయాడంటే ప్రత్యర్థి బౌలర్లు తలపట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 18, 2024 | 05:34 PMLast Updated on: Nov 18, 2024 | 5:34 PM

Pujara To Series With Aussies Veteran Cricketer In New Role

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అంటే గత దశాబ్ద కాలంగా మనకు గుర్తొచ్చే కొన్ని పేర్లలో చటేశ్వర పుజారా ఒకటి… ద్రావిడ్ తర్వాత టెస్ట్ జట్టులో ఆ స్థానంలో ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా మారిన బ్యాటర్ పుజారానే… క్రీజులో పాతుకుపోయాడంటే ప్రత్యర్థి బౌలర్లు తలపట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలకు కంగారు పుట్టించిన పుజారా గత రెండు పర్యాయాలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అలాంటి పుజారా ఫామ్ కోల్పోవడంతో టెస్ట్ జట్టుకు దూరమయ్యాడు. రంజీల్లో మళ్ళీ డబుల్ సెంచరీ చేసినా సెలక్టర్లు మాత్రం పుజారాను పట్టించుకోలేదు. ఆసీస్ లాంటి పిచ్ లపై పుజారా అవసరం ఖచ్చితంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడినా కూడా సెలక్టర్లు జట్టులోకి తీసుకోలేదు. దీంతో పుజారా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్త రోల్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగం కానున్నాడు.

పుజారా కామెంటేటర్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు. ఈ వెటరన్ క్రికెటర్ భారత్ , ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం స్టార్ స్పోర్ట్స్ హిందీ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన పుజారా.. ఇప్పుడు తన వ్యాఖ్యానంతో అభిమానులను ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. భారత్, ఆసీస్ టెస్ట్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఇక భారత్ లో అయితే ఫ్యాన్స్ టెస్ట్ మ్యాచ్ లే అయినప్పటకీ క్రేజీగానే ఫాలో అవుతుంటారు. దీంతో ప్రాంతీయ భాషల్లోనూ కామెంట్రీకి మంచి రెస్పాన్స్ ఉంటుంది. దీంతో పుజారా లాంటి స్టార్ ప్లేయర్స్ తో భారత్,ఆసీస్ సిరీస్ కు కామెంట్రీ చెబితే అభిమానులకు మరింత జోష్ ఉంటుంది. అందుకే స్టార్ స్టోర్ట్స్ పుజారాతో డీల్ కుదుర్చుకుంది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21లో పుజారా పరుగుల వరద పారించాడు. ఈ సీజన్ లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు 2018 సమయంలోనూ ఈ వెటరన్ బ్యాటర్ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఏకంగా 521 పరుగులతో అదరగొట్టాడు. చివరిసారిగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆడిన పుజారా తర్వాత పేలవ ఫామ్‌తో జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో రాణించినా.. కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటినా భారత సెలెక్టర్లు పట్టించుకోలేదు. కుర్రాళ్ళవైపే బీసీసీఐ సెలక్టర్లు మొగ్గుచూపడంతో పుజారా, రహానేలకు నిరాశే మిగిలింది. కాగా 2010లో ఆస్ట్రేలియాపైనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పుజారా.. ఇప్పటి వరకు 103 టెస్ట్‌లు ఆడి 7195 పరుగులు చేశాడు. దీనిలో 19 శతకాలు, 35 హాఫ్ సెంచరీలున్నాయి. ద్రావిడ్ తర్వాత టీమిండియా నయా వాల్ గా గుర్తింపు పొందిన పుజారా ఇప్పుడు కామెంటేటర్ గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.