ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభ తేదీ ఖరారు కాగానే ఫ్రాంచైజీలు కూడా అలెర్ట్ అయ్యాయి. తమ జట్ల కూర్పుపై ఫోకస్ పెట్టాయి. ఊహించినట్టుగానే పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్ ను తమ సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. గత సీజన్‌లో సారథిగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ట్రోఫీని అందించిన శ్రేయస్ అయ్యర్‌ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. వేలంలో కొనుగోలు చేసినప్పుడే అతనికే కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించగా.. ఇప్పుడు అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది. 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్ గా మంచి రికార్డే ఉంది. మొదట దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన శ్రేయాస్ 2018 సీజన్ మధ్యలో ఆ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. వరుసగా మూడు సీజన్ల పాటు ఆ జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఆ తర్వాత కేకేఆర్ జట్టులోకి మారిపోయాడు. గత సీజన్ లో కోల్ కత్తాను ఛాంపియన్ గా నిలపడంలో బ్యాటర్ గానూ అదరగొట్టాడు. అయితే కోల్ కత్తా నైట్ రైడర్స్ మాత్రం అతన్ని వేలంలోకి వదిలేసింది. అదే సమయంలో కొత్త కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ శ్రేయాస్ ను భారీ ధరకే దక్కించుకుంది. గత సీజన్ వరకూ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహించగా.. ఈ మెగా వేలానికి ముందు అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో ఎక్కవ మంది కెప్టెన్లు మారిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఆ జట్టుకు 17 మంది సారథులు వచ్చారు. వీరిలో యువరాజ్ సింగ్, సంగక్కర, జయవర్దనే, గిల్ క్రిస్ట్, డేవిడ్ హస్సీ, బెయిలీ, సెహ్వాగ్, మిల్లర్, మురళీ విజయ్, మ్యాక్స్ వెల్, రవిచంద్రన్ అశ్విన్, KL రాహుల్, మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, సామ్ కరన్, జితేశ్ శర్మ ఉన్నారు. కానీ ఆ టీమ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. 2008 ఆరంభ సీజన్ లో సెమీఫైనల్ కు చేరిన పంజాబ్ కింగ్స్ కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరింది. 2014 సీజన్ లో ఫైనల్ కు చేరినా కోల్ కత్తా చేతిలో పరాజయం పాలై రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిగిలిన అన్ని సీజన్లలోనూ లీగ్ స్టేజ్ కే పరిమిమైంది. ఈసారైనా పంజాబ్ రాతను శ్రేయాస్ అయ్యర్ మారుస్తాడేమో చూడాలి.మరోవైపు ఐపీఎల్ 18వ సీజన్ పై బీసీసీఐ ప్రకటన చేసింది. మార్చి 21 నుంచి ధనాధన్ లీగ్ మొదలు కానుండగా.. మే 25న ఫైనల్ జరగనుంది. క ప్లేఆఫ్స్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌లకు హైదరాబాద్ వేదిక ఉండనుంది. ఐపీఎల్ పూర్తి షెడ్యూలు ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 2025 ఐపీఎల్ సీజన్‌లో 74 మ్యాచ్‌ల ఉంటాయి.[embed]https://www.youtube.com/watch?v=MlCpvIoPuZ8[/embed]