పంజాబ్ వ్యూహం అదిరిందిగా రిటైన్ చేసుకునేది వీరినే

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌‌ను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ రూల్స్ ప్రకారం ఆరుగురు ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే అవకాశాన్ని కల్పించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 10, 2024 | 02:24 PMLast Updated on: Oct 10, 2024 | 2:24 PM

Punjab Will Retain Them In Next Ipl

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌‌ను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ రూల్స్ ప్రకారం ఆరుగురు ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే అవకాశాన్ని కల్పించింది. రిటెన్షన్ పాలసీ ప్రకారం నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా దక్కించుకోవచ్చు. అక్టోబర్ 31వ తేదీలోపు తమ రిటెన్షన్ లిస్ట్‌ను అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి 18 కోట్లు, 14 కోట్లు చెల్లించాలి. ఈ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే నిర్ణయాన్ని ఫ్రాంచైజీలకే బీసీసీఐ వదిలేసింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం కనీసం 4 కోట్లుగా నిర్ణయించింది.

అయితే కేవలం రిటెన్షన్‌ను మాత్రమే ఉపయోగిస్తే పర్స్ వ్యాల్యూలోని 120 కోట్లలో ఎక్కువ మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్ వేలం కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది. అదే సమయంలో రిటైన్ జాబితా విషయంలోనూ పక్కా ప్లాన్ ఫాలో అవుతోంది. ఈ సారి జట్టు కూర్పును చాలా వరకూ మార్చాలని పంజాబ్ నిర్ణయించింది. పంజాబ్ రిటైన్ జాబితాలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ఉంటాడని చెప్పొచ్చు. టీ ట్వంటీ ప్రపంచకప్ విజయంలో అర్షదీప్ కీలకపాత్ర పోషించాడు. గత సీజన్ లోనూ పంజాబ్ తరపున అర్షదీప్ అద్భుతంగా రాణించాడు.

అలాగే ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ను కూడా పంజాబ్ కొనసాగించుకోవడం ఖాయమే. గత సీజన్ లో ధావన్ గాయంతో తప్పుకున్న తర్వాత సామ్ కరన్ జట్టును సమర్థవంతంగా నడిపించాడు. అంతేకాదు ఆల్ రౌండర్ గా తనదైన ముద్ర వేశాడు. ఇక మరో ఇంగ్లాండ్ ప్లేయర్ లివింగ్ స్టోన్ ను కూడా పంజాబ్ రిటైన్ చేసుకోనుంది. ఇటీవల ఆసీస్ టూర్ లో అదరగొట్టిన లివింగ్ స్టోన్ జట్టు ఫినిషర్ గా సెట్ అవుతాడన్నది పంజాబ్ వ్యూహం. ఇక పేస్ బౌలర్ కగిసో రబాడను కూడా పంజాబ్ తమతో పాటే కొనసాగించుకోవడం ఖాయం. పవర్ ప్లేలో రబాడ కీలకం కానున్నాడని పంజాబ్ అంచనా వేస్తోంది. అలాగే మాథ్యూ షార్ట్ ను సైతం కంటిన్యూ చేసుకోనుంది. అటు అన్ క్యాప్డ్ కేటిగిరీలో నాలుగు కోట్లకు అశుతోష్ శర్మను రిటైన్ చేసుకోవాలని పంజాబ్ భావిస్తోంది.