Phone Tapping Case: నా ఫోన్ ట్యాప్ చేశారు.. కేసీఆర్, హరీష్ రావుపై రఘునందన్ రావు ఫిర్యాదు

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్‌పై డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌తోపాటు కుటుంబ సభ్యుల ఫోన్లు, కొందరు ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2024 | 07:59 PMLast Updated on: Mar 27, 2024 | 7:59 PM

Raghunandan Rao Complaints To Dgp On Kcr And Ktr Regarding Phone Tapping Case

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈ అంశంలో బీఆర్ఎస్‌‌పై కాంగ్రెస్, బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వెనుక.. కేసీఆర్, కేటీఆర్ హస్తం ఉండొచ్చని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్‌పై డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు.

AP BJP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే.. పది మందితో లిస్టు విడుదల

తన ఫోన్‌తోపాటు కుటుంబ సభ్యుల ఫోన్లు, కొందరు ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు. దుబ్బాక బై ఎలక్షన్ టైంలో, సిద్ధిపేటలోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి తన ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంలో ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు లేకుండా.. ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తే లేదని, అందువల్ల కేసీఆర్‌తోపాటు, దుబ్బాక ఉప ఎన్నిక ఇంచార్జిగా ఉన్న అప్పటి మంత్రి హరీష్ రావును, సిద్ధిపేట కలెక్టర్‌గా ఉన్న పి.వెంకటరామి రెడ్డిని కూడా నిందితులుగా చేర్చాలని రఘునందన్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ డివైజ్‌లను ఎవరు కొనుగోలు చేశారు.. ఎవరి ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారు.. వంటి అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని రఘునందన్ కోరారు.

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి, కర్ణాటకలో కుమార స్వామికి లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని రఘునందన్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆరోపించారు. రాజకీయ నేతల ఫోన్లు మాత్రమే కాకుండా కొందరు హీరోయిన్లు, ఇతర సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. కేసీఆర్, కేటీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది.