భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టుకు కౌంట్ డౌన్ మొదలైంది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి డే అండ్ నైట్ టెస్ట్ ప్రారంభం కాబోతోంది. ఈ పింక్ బాల్ ఛాలెంజ్ కు టీమిండియా రెడీగా ఉంది. గత పర్యటనలో పింక్ బాల్ టెస్ట్ భారత జట్టుకు చేదుజ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆసీస్ పేసర్ల ధాటికి కేవలం 36 పరుగులకే కుప్పకూలి ఘోరపరాభవాన్ని చవిచూసింది. అప్పటి ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా తుది జట్టు విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. అందరూ ఊహించినట్టుగానే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. జట్టు కోసం మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో తానే స్వయంగా వెల్లడించాడు. ఓపెనింగ్ జోడీగా జైశ్వాల్, రాహుల్ నే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. వ్యక్తిగతంగా మిడిలార్డర్ లో ఆడడం తనకు ఇబ్బందే అయినప్పటకీ జట్టు కోసం నిర్ణయం తీసుకున్నానని రోహిత్ చెప్పాడు. పెర్త్ టెస్టులో రోహిత్ లేకపోవడంతో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించగా.. యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం బాదాడు. మరోవైపు.. కేఎల్ రాహుల్ సైతం మెరుగ్గా రాణించాడు. దీంతో ఓపెనర్లుగా వీరిని మార్చొద్దన్న అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో మ్యాచ్ లోనూ రోహిత్ మిడిలార్డర్ బ్యాటింగ్ చేశాడు. ఇదే బ్యాటింగ్ ఆర్డర్ తో రెండో టెస్టులో దిగబోతున్నట్టు హిట్ మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. విదేశీ పిచ్ లపై కేఎల్ రాహుల్‌కు మంచి రికార్డ్ ఉందన్న రోహిత్ జట్టులో కొనసాగేందుకు అతను పూర్తి అర్హుడని చెప్పాడు. పెర్త్ వంటి వికెట్‌పై నిలకడగా ఆడటం సులువైన పనికాదనీ వ్యాఖ్యానించాడు. టీమ్ కాంబినేషన్‌ను మార్చాల్సిన అవసరం లేదనిపించిందనీ, కెప్టెన్‌గా నిర్ణయం తీసుకున్నా అది జట్టు విజయానికి ఉపయోగపడాలని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే తుది జట్టులోకి రోహిత్ , గిల్ రావడంతో జురెల్, పడిక్కల్ పై వేటు పడనుంది. అటు స్పిన్ ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్, అశ్విన్ లలో ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. ముగ్గురు పేసర్లుగా బూమ్రా, సిరాజ్ తో పాటు హర్షిణ్ రాణా,ఆకాశ్ దీప్ లలో ఒకరికి చోటు దక్కనుంది. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారీ విజయంతో ఘనంగా ఆరంభించిన టీమిండియాకు రెండో టెస్టులో పింక్ బాల్ నుంచి గట్టి సవాల్ ఎదురుకానుంది. [embed]https://www.youtube.com/watch?v=sCOOABWnNqA[/embed]