Rahul Gandhi: మోదీకి రాహుల్ శుభాకాంక్షలు
భారత ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా పలు అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రారంభించబోతున్నారు.

Rahul Gandhi Wishes To Narendhra Modi
ప్రధాని మోదీ 73వ పుట్టిన రోజును బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ జన్మదినం సందర్భంగా ఆదివారం నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు సేవా పక్షోత్సవాలను బీజేపీ నిర్వహిస్తోంది. ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన దూరదృష్టి, బలమైన నాయకత్వంతో ప్రతి రంగంలో దేశ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరుకుంటున్నాను అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బీజేపీ నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. మోదీ వర్సెస్ రాహుల్ మధ్య ఈ మధ్య జరుగుతున్న పోరాటం అంతా ఇంతా కాదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈ యుద్ధం మరింత పీక్స్‌కు చేరింది. ఐతే రాహుల్ బర్త్‌డే విషెస్ చెప్తూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక అటు దీపక్ బిస్వాల్ అనే కళాకారుడు దీపం నుంచి వచ్చే పొగతో మోదీ చిత్రాన్ని రూపొందించి అభిమానం చాటుకున్నారు. దీనిలో ప్రధాని చిత్రం వెనుక కోణ్కార్ చక్రాన్ని ఆకర్షణీయంగా చిత్రీకరించారు. ఇక అటు బర్త్‌డే రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు మోదీ. విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతివృత్తుల వారి కోసం 13 వేల కోట్లతో పీఎం విశ్వకర్మ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఢిల్లీలో 73వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ యశోభూమిని ప్రారంభించనున్నారు.