Rahul Gandhi: పొమన్నవాళ్లే రా రమ్మని పిలిచారు.. బంగ్లా ఇజ్ బ్యాక్.. రాహుల్ గాంధీ అంటే అట్లుంటది మరి!
మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం.. ఎంపీగా రాహుల్‌పై అనర్హత వేటు పడడం.. గత ఏప్రిల్‌లో ఆయన తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయించడం.. నాలుగు నెలలు తిరిగేలోపే మళ్లీ తన బంగ్లా రాహుల్‌కి తిరిగిరావడం చకచకా జరిగిపోయాయి.
ఎన్ని అవమానాలు ఎదురైనా తట్టుకోని.. పోరాడి నిలిచిన వాడికే ప్రపంచం జేజేలు కొడుతుంది. అవమాన భారం పడ్డ చోట కుంగిపోకుండా.. పైకి లేచి పరిగెత్తినవాడే నిజమైన యోధుడు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురించి ప్రస్తుతం హస్తం కార్యకర్తలు ఇలానే గొప్పలు చెప్పుకుంటున్నారు. దీన్నే డబ్బా కొట్టుకోవడమని బీజేపీ కార్యకర్తలు కౌంటర్లు వేస్తున్నారు. ఇదంతా రాహుల్‌గాంధీ బంగ్లా గురించి జరుగుతున్న తంతు! లోక్‌సభ సభ్యుడిగా తిరిగి ఎన్నికైన రాహుల్ గాంధీకి ఇండియా గేట్ సమీపంలోని తుగ్లక్ లేన్‌లోని 12వ నెంబర్ ప్రభుత్వ బంగ్లాను తిరిగి కేటాయించారు. మోదీ ఇంటిపేరు పరువునష్టం కేసులో రాహుల్‌ని దోషిగా కోర్టు తీర్పునిచ్చిన తర్వాత కమిటీ ఆయనకు నోటీసులు పంపడంతో గత ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ ఇంటిని ఖాళీ చేశారు.
2004లో ఎంపీ అయినప్పటి నుంచి రాహుల్ నివసిస్తున్న బంగ్లా అది. ఈ ఏడాది మార్చి 24న రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడింది. మరుసటి రోజే ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. నిజానికి ఇలాంటి నోటిసులు మిగిలిన ఎంపీలకు చాలా లేట్‌గా వచ్చాయట. అంటే ఏ ఎంపీదైనా పదవి కాలం ముగిస్తే.. ఆ తర్వాత ఎప్పటికోకానీ నోటిసులు ఇవ్వరట. ఇదంతా రాహుల్ వర్గం చెబుతున్న మాట. 2022లో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేసిన గులాం నబీ ఆజాద్ లాంటి వారు ఇప్పటికీ తమ అధికారిక బంగ్లాను కలిగి ఉన్నారు కూడా. రాహుల్‌కి మాత్రం కోర్టు తీర్పునిచ్చిన వెంటనే నోటిసులు పంపడంపై అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి.
పరువునష్టం కేసులో గత మార్చి 23న సూరత్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక నాలుగు రోజుల క్రితం రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్‌కు వెళ్లేలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. రాహుల్ గాంధీకి జైలు శిక్ష కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నిజానికి ఆ తీర్పుపై స్టే ఇవ్వడానికి గుజరాత్ హైకోర్టు కూడా నిరాకరించడంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ రాహుల్‌కి అనుకూలంగా తీర్పురావడం… 137 రోజుల తర్వాత రాహుల్ ఎంపీగా తన సభ్యత్వాన్ని తిరిగి పొందడం.. ఇప్పుడు ఆయనకు తన పాత బంగ్లానే తిరిగి కేటాయించడం చకచకా జరిగిపోగా..ఈ పరిణమాలన్ని కాంగ్రెస్ కార్యకర్తల ఆనందాన్ని మరింత పెంచేలా చేసింది.