రాహుల్,నితీష్ ఫ్లాప్ షో ఆకట్టుకున్న జురెల్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆసీస్ గడ్డపై యువ ఆటగాళ్ళు తేలిపోతున్నారు. ఆసీస్ ఏ తో జరుగుతున్న అనధికార టెస్ట్ సిరీస్ లో తమ పేలవ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. తొలి టెస్ట్ తరహాలోనే రెండో మ్యాచ్ లోనూ కీలక ఆటగాళ్ళందరూ ఫ్లాపయ్యారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆసీస్ గడ్డపై యువ ఆటగాళ్ళు తేలిపోతున్నారు. ఆసీస్ ఏ తో జరుగుతున్న అనధికార టెస్ట్ సిరీస్ లో తమ పేలవ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. తొలి టెస్ట్ తరహాలోనే రెండో మ్యాచ్ లోనూ కీలక ఆటగాళ్ళందరూ ఫ్లాపయ్యారు. రెండో మ్యాచ్ కోసం సెలక్టర్లు ఎంపిక చేసిన కెఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశపరిచాడు. రాహుల్ 4 పరుగులకే ఔటవగా… అభిమన్యు ఈశ్వరన్ , సాయిసుదర్శన్ డకౌటయ్యారు. పేస్ ఆల్‌రౌండర్‌గా భారీ అంచనాలతో ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన తెలుగు తేజం, నితీష్ కుమార్ రెడ్డి కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. 35 బంతుల్లో 16 పరుగులే చేసి కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. భారత్-ఏ తరఫున నితీష్ కుమార్ రెడ్డి సత్తా చాటితే ప్రధాన జట్టులోకి తీసుకోవాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడు. కానీ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం తొలి అనధికారిక టెస్ట్‌తో పాటు తాజా మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.
అయితే యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం ఆకట్టుకున్నాడు. కీలక ఆటగాళ్ళు విఫలమైనా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ పేసర్లను సమర్థంగా ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80 రన్స్ చేశాడు. పడిక్కల్ 26 రన్స్ తో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కాగా.. మరో నలుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా-ఏ బౌలర్లలో మైకేల్ నెసెర్ నాలుగు వికెట్లు తీయగా..వెబ్‌స్టర్ మూడు వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్, కోరీ, నాథన్ మెక్‌స్వామీ తలో వికెట్ తీసారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఏ మొదటి రోజు ఆటముగిసే సరికి 2 వికెట్లకు 53 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
కేఎల్ రాహుల్ వైఫల్యం టీమిండియా అభిమానులతో పాటు మేనేజ్‌మెంట్ ఆందోళనకు గురి చేస్తోంది. పేలవ బ్యాటింగ్‌తోనే తుది జట్టులో చోటు కోల్పోయిన రాహుల్‌కు ఆసీస్ పర్యటనలో ఓపెనర్‌గా అవకాశమివ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. తొలి టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాహుల్ అందరి కన్నా ముందే ఆస్ట్రేలియా పంపించి.. భారత్-ఏ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దించింది. కానీ అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా రాహుల్ విఫలమైతే.. భారత జట్టులో అతనికి చోటు దక్కడం కష్టమే. ఇప్పటికే సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్‌కు గురైన టీమిండియా.. ఆసీస్ టూర్ లో సిరీస్ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. పైగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ ఐదు టెస్టుల సిరీస్ లో నాలుగింటిలోనైనా గెలవాల్సి ఉంది. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా మొదలుకానుంది.