Rain Alert: మూడు రోజులు భారీ వర్షాలు

వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయ్. రుతుపవనాలకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తోడుకావడంతో.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయ్. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 12, 2023 | 05:46 PMLast Updated on: Jul 12, 2023 | 5:46 PM

Rain Forecast For Telugu States Under The Influence Of Low Pressure Trough Formed In Southwest Bay Of Bengal

తెలంగాణలో రాబోయే ఐదు రోజులు, ఏపీలో మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు పడతాయని వివరించారు. తెలంగాణకు ఐఎండీ.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

తెలంగాణాలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని.. వర్షాలు కురిసే సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉత్తమం అని అధికారులు సూచిస్తున్నారు.