ఇజ్రాయెల్ పై ఇరాన్ బాంబుల వర్షం.. ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం ?

మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా ? ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య మొదలైన యుద్ధం...క్రమంగా విస్తరిస్తోందా ? మొదట గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్...ఆ తర్వాత లెబనాన్ పై వరుస బాంబు దాడులు చేసింది. హెజ్ బోల్లా కీలక స్థావరాలను నాశనం చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 2, 2024 | 07:39 PMLast Updated on: Oct 02, 2024 | 7:39 PM

Rain Of Irans Bombs On Israel World War 3 Looming

మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా ? ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య మొదలైన యుద్ధం…క్రమంగా విస్తరిస్తోందా ? మొదట గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్…ఆ తర్వాత లెబనాన్ పై వరుస బాంబు దాడులు చేసింది. హెజ్ బోల్లా కీలక స్థావరాలను నాశనం చేస్తోంది. ఇరాన్ మద్దతు ఇస్తున్న మిలిటెంట్ సంస్థ హెజ్ బొల్లాను ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బకొట్టింది. హెజ్ బొల్లా అధినేత హసన్ నస్రల్లాను మట్టుబెట్టింది. హసన్ తో పాటు పలువురు కీలక కమాండర్లను సైతం హతమార్చినట్లు.. ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నస్రల్లా లక్ష్యంగా లెబనాన్ లోని దాహియాలో నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్ బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఈ దాడుల్లో హసన్ నస్రల్లా మరణించారు. అటు హెజ్ బొల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కితో పాటు అదనపు కమాండర్లు మరణించారు. హెజ్ బొల్లా అధినేత నస్రల్లాతో పాటు టాప్ కమాండర్లను కొల్పోయింది. ఆ తర్వాత హెజ్‌బొల్లా నం.2 ఇబ్రహీం అకీల్​​ ను మట్టుబెట్టింది. దీంతో ఆ సంస్థ…ఇజ్రాయెల్ పై ప్రతీకారంతో రగిలిపోతోంది.

ఇజ్రాయెల్ తో సుదీర్ఘ యుద్దానికి ప్రకటించిన కొన్ని గంటల్లోనే యాక్షన్ లోకి దిగింది ఇరాన్. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రత్యక్ష యుద్దానికి దిగింది. 100 క్షిపణిలతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. క్షిపణి దాడులను తిప్పికొట్టేందుకు ఐరన్ డోమ్ రంగంలోకి దిగింది. మరోవైపు ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య మొదలైన వార్…క్రమంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. గాజాను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్…ఆ తర్వాత లెబనాన్ పై దాడులకు తెగబడింది. లెబనాన్ లోని హెజ్ బోల్లా కీలక స్థావరాలపై బాంబులతో వణికిస్తోంది. అమెరికా హెచ్చరించినట్లు…క్షిపణులతో ఇజ్రాయెల్ లోని కీలక నగరాలపై అటాక్ చేసింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినా…ఇరాన్ పట్టించుకోలేదు. శత్రుదేశంపై ఎదురుదాడికి దిగింది. ఇజ్రాయెల్‌ సైన్యంలో అత్యంత శక్తిమంతమైన డివిజన్‌ 98 పారా ట్రూపర్‌ కమాండోలు…దక్షిణ లెబనాన్‌లోకి రావడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోయింది. సైలెంట్ గా ఉంటే…ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోతుందన్న అంచనాతోనే క్షిపణులతో ఎదురుదాడి మొదలు పెట్టటింది.

హెజ్ బొల్లా అగ్ర నేతల మరణాన్ని జీర్ణించుకోలేని ఇరాన్…ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడులతో అమెరికా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌కు అండగా నిలిచేందుకు, పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ జాతీయ భద్రత బృందంతో సమీక్ష జరిపారు. ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగితే…పశ్చిమాసియాలోని ముస్లిం దేశాలన్నీ ఏకమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ కు చైనా, రష్యా, దక్షిణ కొరియా దేశాలు మద్దతిచ్చే అవకాశం ఉంది. యుద్ధ సామాగ్రితో పాటు క్షిపణులను సమకూర్చే అవకాశాలు లేకపోలేదు. ఇరాన్ విషయంలో అమెరికా తీసుకునే నిర్ణయాన్ని బట్టి రష్యా, చైనా అడుగులు వేయనున్నాయి. అటు అమెరికా మిత్రదేశాలు…ఇటు చైనా, రష్యా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగితే…మూడో ప్రపంచ యుద్ధమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ వార్…రెండేళ్లపైగా సాగుతూనే ఉంది. ఇప్పుడు పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో ఊహించడం కష్టమే.

ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో లెబనాన్‌ వీడుతున్న పౌరుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. లెబనాన్ సరిహద్దులు దాటి…లక్షల మంది సిరియాకు వెళ్లిపోతున్నారు. సరిహద్దు దాటుతున్న వారిలో లెబనాన్‌ ప్రజలతోపాటు.. సిరియా జాతీయులూ ఉన్నారు. సిరియాలో చెలరేగిన అంతర్యుద్ధం కారణంగా చాలా మంది…ఆ దేశం నుంచి వచ్చి లెబనాన్‌లో తలదాచుకున్నారు. ఇప్పుడు వీరంతా మళ్లీ స్వదేశానికి తరలి వెళ్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 జూలై 28 నుంచి 1918 నవంబరు 11 వరకు జరిగింది. ఇది చరిత్రలో జరిగిన అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. 6 కోట్ల మంది యూరోపియన్లతో సహా మొత్తం 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షల మంది సైనికులు, 70 లక్షల మంది పౌరులూ మరణించారు. యుగోస్లేవియా జాతీయవాది గవ్రిలో ప్రిన్సిప్ హత్యతో సంక్షోభం తలెత్తింది. దీంతో ఆస్ట్రియా…హంగరీ సెర్బియాకు అల్టిమేటం ఇచ్చింది. సెర్బియా ఇచ్చిన సమాధానం నచ్చక…ఆస్ట్రియా యుద్ధం ప్రారంభించింది. రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల మధ్య జరిగింది. ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారమే రెండో ప్రపంచయుద్ధం. ఈ యుద్ధంలో పది కోట్ల మంది సైనికులు పాల్గొన్నారు. సుమారుగా ఆరు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.