బెడిసికొట్టిన వ్యూహం ఇక వర్షమే కాపాడాలి

బెంగళూరు వేదికగా మొదలైన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహం బెడిసికొట్టింది. వర్షం తడిచి పేస్ కు అనుకూలించే పిచ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ద్వారా భారత్ మూల్యం చెల్లించుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 17, 2024 | 07:04 PMLast Updated on: Oct 17, 2024 | 7:04 PM

Rain Should Be Saved In Bengaluru Test

బెంగళూరు వేదికగా మొదలైన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహం బెడిసికొట్టింది. వర్షం తడిచి పేస్ కు అనుకూలించే పిచ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ద్వారా భారత్ మూల్యం చెల్లించుకుంది. ఓవర్ కాన్ఫిడెన్సో లేక కివీస్ బౌలింగ్ ను తక్కువ అంచనా వేసారో తెలీదు కానీ తొలి ఇన్నింగ్స్ లో కనీసం 50 రన్స్ కూడా చేయలేకపోయింది. ఇటీవల బంగ్లాదేశ్ పై కాన్పూర్ లో వచ్చిన విజయంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా అనిపిస్తోంది. అయితే ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసినట్టా లేక సవాల్ ను ఎదుర్కొనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ తీసుకున్నాడా అనేది తెలీదు. కానీ జరగాల్సిన నష్టం తొలి ఇన్నింగ్స్ లో భారీగానే జరిగింది. స్వదేశంలో అత్యల్ప స్కోరుకు భారత్ పరిమితమైంది. జట్టులో ఐదుగురు బ్యాటర్లు ఖాతానే తెరవలేదు. అనుభవం ఉన్న రోహిత్ , కోహ్లీ, రాహుల్ సైతం చేతులెత్తేశారు.

భారత్ ఇన్నింగ్స్ లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. పంత్ 20 , జైశ్వాల్ 13 పరుగులు చేయగా… మిగిలిన వారిలో ఐదుగురు డౌకట్, మరో నలుగురు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అయితే ఇది బ్యాటర్ల వైఫల్యం కాదన్నది కొందరి వాదన. పేస్‌కు అనూకూలిస్తున్న పిచ్‌పై న్యూజిలాండ్ బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మేఘూవృతమైన వాతావరణం మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది. కవర్లతో పిచ్‌ను గత కొన్ని రోజులుగా కప్పి ఉంచడం, పిచ్‌పై కాస్త ఉన్న తేమతో.. తొలి సెషన్‌లో బౌలర్లదే పైచేయిగా ఉంటుంది. కానీ కోచ్ గౌతమ్ గంభీర్ సలహాతో బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ నిర్ణయం బెడిసికొట్టింది. ఆసీస్ తో సిరీస్ ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా ఇలాంటి వ్యూహంతో బరిలోకి దిగిందా అన్న అనుమానమూ ఉంది. తొలుత భారీ స్కోరు సాధించి మ్యాచ్ ఫలితాన్ని రాబట్టడం ద్వారా వచ్చే నెలలో ఆస్ట్రేలియా సిరీస్‌కు సన్నద్ధమయ్యేలా రోహిత్ ఆలోచించి ఉండొచ్చు. కానీ బలమైన న్యూజిలాండ్ పేస్ దళం ముందు మన బ్యాటర్లు చేతులెత్తేశారు.

నిజానికి భారత్ పిచ్ లపై నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం పెద్ద సవాల్. అయితే ఇక్కడ వర్షం పడడంతో పిచ్ స్వరూపం మారిపోయింది. ఈ విషయం రోహిత్ , గంభీర్ లకు తెలియంది కాదు. అయినా కూడా సాహసోపేతంగా బ్యాటింగ్ ఎంచుకున్న హిట్ మ్యాన్ వ్యూహానికి తగ్గట్టు భారత్ ఆడలేకపోయింది. కివీస్ బౌలర్లలో కేవలం ముగ్గురు పేసర్లతో భారత్ కథ ముగిసింది. మ్యాట్ హెన్రీ 5 , విలియమ్ ఒరూర్కే 4 వికెట్లతో భారత్ ను కోలుకోలేని దెబ్బకొట్టారు. ఇదే పిచ్ పై మనపేస్ ఎటాక్ ను ఎదుర్కోవడం కివీస్ కు సవాల్ గానే చెబుతున్నా భారత్ మాత్రం ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఇప్పుడు తొలి ఇన్నింగ్స్ లో కివీస్ దే పైచేయి సాధించడం ఖాయమని తేలిపోగా… రెండో ఇన్నింగ్స్ లో మన బ్యాటర్లు ఎంతవరకూ పోరాడతారనేది చూడాలి. అదే సమయంలో వరుణుడే టీమిండియాను ఓటమి నుంచి కాపాడాలి.