Rajasthan Politics: ఈసారి రాజస్థాన్ లో రాజపీఠం ఎవరికి వరిస్తుంది..?
రాజస్థాన్ లో ఈ సారి ఆనవాయితీ కొనసాగుతుందా..? ఐదేళ్లకొకసారి అధికారం మారే తీరుకు ఓటర్లు స్వస్తి పలకనున్నారా..? రాజస్థాన్ పూర్తి రాజకీయ ముఖచిత్రాన్ని ఇప్పుడు చూద్దాం.

Rajasthan will win the 2023 assembly elections this time.. Who is positive in BJP and Congress
కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎలక్షన్ షెడ్యూల్ ని ప్రకటించింది. అందులో రాజస్థాన్ కూడా ఉంది. రాజస్థాన్ అనగానే పింక్ సిటీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఎత్తైన కోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. తాజాగా ఈ రాష్ట్ర రాజకీయం మరింత మందికి ఆసక్తిని కలిగిస్తోంది. ఈ రాష్ట్రంలో 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 98, బీజేపీ 73 స్థానాలు గెలుచుకుంది. అయితే ఆరు మంది బీఎస్పీ, ఇద్దరు సీపీఎం ఎమ్మెల్యేల మద్దతుతో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇక్కడ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన సచిన్ పైలట్ ను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. అధికారం చేపట్టిన రోజు నుంచి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లకు పొసగడం లేదు. దీంతో 2020లో కాంగ్రెస్ లో కొనసాగుతూనే సొంత పార్టీపై తిరుగుబాటుకు దిగారు సచిన్. దీంతో ఉప ముఖ్యమంత్రి పదవి కోల్పోవల్సి వచ్చింది. ఆ తరువాత తన పార్టీలోని కీలక నేతల మద్దతును కూడబెట్టడంలో కాస్త సఫలం అయ్యారు గెహ్లాట్. దీంతో ప్రభుత్వాన్ని సాఫీగా సాగిస్తూ వస్తున్నారు.
సంక్షేమంలో పురోగతి..
ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే సంక్షేమంపై కాస్త దృష్టి పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని తీసుకువావడం, భగ్గుమన్న గ్యాస్ ధరలను నియంత్రించి రూ. 500 కే సామాన్యులకు అందించడం, 100 యూనిట్ల వరకూ కరెంట్ వినియోగించిన వారికి ఉచితంగా కరెంట్ సరఫరా, కుటుంబ ఆరోగ్య బీమాను రూ. 10 నుంచి రూ. 25 లక్షలకు పెంచడం. వృద్దులకు, వికలాంగులకు పింఛన్ ను రూ. 1000 కి పెంచడం వంటివి అమలు చేశారు. అయితే మహిళలపై అఘాయిత్యాలు, ప్రభుత్వ నియామకాల ప్రశ్నాపత్రాల లీకేజీ, కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాట కాస్త ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. తాజాగా కులగణన చేస్తామని దాని ద్వారా సీట్లను కేటాయిస్తామని ఎన్నికల కంటే ముందే హామీ ఇచ్చింది కాంగ్రెస్. దీంతో బీజేపీ ఇక్కడ కాస్త ఇరుకున పడ్డట్లు అయింది.
జోన్ల విభజనే తలనొప్పి..
ఇక బీజేపీ విషయానికొస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని అడుగు దూరంలో కోల్పోవల్సి వచ్చింది. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలకు గానూ 24 గెలుచుకొని తనదైన ముద్రను వేసింది. ఇప్పుడు అదే విజయాన్ని శాశన సభ ఎన్నికల్లో కూడా చూపి అధికారాన్ని సాధించుకోవాలని చూస్తోంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ఈ రాష్ట్రాలన్ని ఏడు జోన్లుగా విభజించి పాలిస్తోంది. విభజించిన ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల కీలక నేతలను ఇంచార్జులుగా నియమించింది. దీంతో ఈ జోన్లలోని కొందరు సొంత పార్టీ నాయకులతో పడటంలేదని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజె, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న గజేంద్ర సింగ్ షెకావత్, ప్రస్తుత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా లకు పొసగడం లేదని కొందరు చెవి కొరుక్కుంటున్నారు. పైగా కాంగ్రెస్ నుంచి వచ్చిన సచిన్ పై కూడా ఓ వర్గం గుర్రున ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ప్రభావం బీజేపీ పై తప్పకుండా పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. దీంతో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమే అనే భావన కలుగుతోంది.
లోపాలు సరిచేసుకుంటే కాంగ్రెస్సే..
రాజస్థాన్ రాజకీయాలు 1993 నుంచి పరిశీలించినట్లయితే రెండు సార్లు నిర్విరామంగా ఒకే ప్రభుత్వం అధికారం సాధించలేదు. ఐదేళ్లు ఒకరు పాలిస్తే మరో ఐదేళ్లు ఇంకో పార్టీ పాలనాపగ్గాలు చేపడుతూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఈ ఆనవాయితి పునరావృతం కాదేమో అనిపిస్తోంది. దీనికి కారణాలు బీజేపీలో నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్లో పాలనా పరమైన లోపాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ దశాబ్ధం కాలం పాటూ కేంద్రంలో కొనసాగి గతంలో ఐదేళ్లు అధికారంలో ఉండి చేసిందేమీ లేదు అనే భావన కూడా ప్రజల్లో బాగా ఉంది. పైగా కాంగ్రెస్ కాస్త తన ఉనికిని విస్తరించుకున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. సరైన ఫలితం రావాలంటే డిశంబర్ వరకూ వేచి చూడక తప్పదు.
T.V.SRIKAR