Krishna Prasad Chowdary: డ్రగ్స్ విక్రయిస్తుండగా కబాలీ తెలుగు సినిమా నిర్మాత అరెస్ట్.. ప్రవేట్ ఉద్యోగం మొదలు డ్రగ్స్ విక్రయం వరకూ చాలా ట్విస్ట్ లు

హైదరాబాద్ లో రోజురోజుకూ డ్రగ్ కల్చర్ పెరిగిపోతుంది. దీనికి ప్రదానమైన వేదిక పబ్బులు అనే చెప్పాలి. కొన్ని పబ్బులో ఇలాంటి మాదకద్రవ్యాల వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతూనే ఉంటుంది. తాజాగా తెలుగు కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కృష్ణ ప్రసాద్ చౌదరిని మాదకద్రవ్యాల విక్రయం కేసులో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. కేపీ చౌదరీ కొకైన్ అమ్ముతుండగానే పట్టుకున్నట్లు తెలిపారు. ఇతని వద్ద నుంచి సుమారు 82.75 గ్రాముల కొకైన్ తో పాటూ ఒక కారు, 2 లక్షలకు పైగా నగదు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 14, 2023 | 07:45 PMLast Updated on: Jun 14, 2023 | 7:45 PM

Rajinikanths Kabali Telugu Film Producer Kp Chaudhary Arrested By Cyberabad Police For Selling Drugs

ఇదిలా ఉంటే నిందితుడు కృష్ణ ప్రసాద్ ఖమ్మం జిల్లా బోనకల్ ప్రాంతానికి చెందినవాడు. బీటెక్ పూర్తిచేసి మహారాష్ట్రలోని ఐఐఏఈఐటీ లో కొంత కాలం ఆపరేషనల్ డైరెక్టర్ గా పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి సినిమలపై ఉన్న ఆసక్తితో కొందరిని పరిచయం చేసుకున్నాడు. డిస్టిబ్యూటర్ అవతారం కూడా ఎత్తాడు. అలా సినిమా ప్రయాణం సాగిస్తున్న క్రమంలో కబాలి తమిళ సినిమా తీసిన దర్శకుడు తన్ను పరిచయం అయ్యాడు. అతని సహాయంతో 2016లో కబాలి తెలుగు సినిమాకు నిర్మాతగా మారి సినీరంగ ప్రవేశం చేశాడు. గతంలో కొన్ని తమిళ, తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు. దాదాపు మూడు నుంచి నాలుగేళ్ళ వరకూ సినీప్రయాణం సాఫీగా సాగింది. పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్, మహేష్, వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, నిఖిల్ అర్జున్ సురవరం ఇలా పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.

కృష్ణ ప్రసాద్ చౌదరికి కబాలి తరువాత భారీ నష్టం రావడంతో 2021లో గోవాకి వెళ్ళాడు. అక్కడి వాతావరణాన్ని చూసుకొని పబ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా ఓహెచ్ఎం అనే పేరుతో ఒక పబ్బును నడిపాడు. హైదరాబాద్ తో పాటూ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే స్నేహితులకు, సినీ సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేసేవాడు. కొద్దికాలానికి గోవాలోని అధికారులు ఈ పబ్ అక్రమ నిర్మాణంగా గుర్తించి కూల్చేశారు. ఇలా పబ్ ఏర్పాటు చేయడానికి ముందుగానే నైజీరియన్ పేటిట్ ఎజుబర్ అనే వ్యక్తి ఇతనికి పరిచయం అయ్యాడు. ఇదే ఇక్కడ గమనించవలసిన ప్రదానమైన అంశం.

ఇతని పరిచయంతోనే కేపీ చౌదరి తన డ్రగ్స్ వ్యాపారాన్ని క్రమక్రమంగా విస్తరించుకుంటూ వచ్చాడు. ఏప్రిల్ లో నైజీరియన్ నుంచి లక్షల విలువ చేసే 100 గ్రాముల కొకైన్ ను తీసుకొని హైదరాబాద్ కి వచ్చినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. ఇలా తీసుకువచ్చిన డ్రగ్ ను తాజాగా కస్మత్ పూర్ వద్ద విక్రయిస్తుండగా ఇతనిని పట్టుకున్నటు పోలీసులు మీడియాకు తెలిపారు. ఇలా ఎవరెవరికి ఎంతకాలంగా విక్రయిస్తున్నాడన్నది తెలియాల్సి ఉందని, మరిన్ని వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరించారు.

 

T.V.SRIKAR