Drugs Case: డ్రగ్స్ కేసులో రజనీకాంత్ ప్రొడ్యూసర్ అరెస్ట్..
సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. సరిగ్గా ఐదేళ్ల కింద డ్రగ్స్ కేసు రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎక్కడో స్కూల్‌లో డ్రగ్స్ దొరకడం.. కూపీ లాగితే డొంక బ్యాంకాక్‌లో కదలడం.. ఈ కేసులో సినీ తారల పాత్ర ఉందని తెలియడం.. దాదాపు 12మంది స్టార్లకు అప్పట్లో సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది.
ఈ ఘటన అప్పట్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి ఆ కేసు ఏమైంది అన్న సంగతి పక్కనపెడితే.. డ్రగ్స్ వ్యవహారం ఇప్పటికీ టాలీవుడ్‌ను వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి కేసులోనే ఇప్పుడో నిర్మాత అరెస్ట్ అయ్యాడు. రజనీకాంత్ కబాలి చిత్ర నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కొకైన్ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
కేపీ చౌదరి నుంచి 82.75 గ్రాముల కొకైన్, కారు, 2 లక్షల నగదు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కృష్ణ ప్రసాద్ చౌదరిది ఖమ్మం జిల్లా బోనకల్. బీటెక్ చదివి పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన ఆయన.. 2016 నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. రజనీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమా తెలుగు వర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణప్రసాద్ చౌదరి పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గానూ పనిచేశారు.
సర్దార్ గబ్బర్‌సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, అర్జున్ సురవరం తదితర సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీని తాకినట్లు అయింది. ఇక అటు చౌదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయ్.. అతని నుంచి డ్రగ్స్ ఎవరు కొనుగోలు చేస్తున్నారు. ఈ దందా అంతా ఎలా సాగుతోందని ఆరా తీసే పనిలో ఉన్నారు.