AP Rajya Sabha Elections : తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ రచ్చ…

దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు (Rajya Sabha Elections) నగారా మోగింది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలున్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరిరోజు. ఫిబ్రవరి 27న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2024 | 09:08 AMLast Updated on: Jan 30, 2024 | 9:21 AM

Rajya Sabha Ruckus In Telugu States

ఏపీలో రాజ్యసభ ఎన్నికల హీట్‌..

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జనరల్‌ ఎలక్షన్స్‌ను (General Elections) మించిపోయాయి. మూడు సీట్లు తమ ఖాతాలో పడేలా వైసీపీ, అధికార పార్టీకి ఝలక్‌ ఇచ్చేందుకు టీడీపీ.. పావులు కదుపుతుండటంతో ఏం జరగబోతుందోనన్న టెన్షన్ నెలకొంది.

దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు (Rajya Sabha Elections) నగారా మోగింది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలున్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరిరోజు. ఫిబ్రవరి 27న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌, ఏపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పదవీకాలం ముగుస్తోంది.

అధికార వైసీపీ మూడు సీట్లూ గెలుస్తుందా…?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP General Elections) కంటే ముందే రాజ్యసభ ఎన్నికల హీట్‌ రగిలింది. అటు అధికార వైసీపీ(YCP), ఇటు ప్రతిపక్ష టీడీపీలు పోటాపోటీగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సంఖ్యాబలం ప్రకారం మూడు సీట్లూ వైసీపీ ఖాతాలోకే వెళ్లాల్సి ఉన్నా.. టీడీపీ కూడా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో నలుగురు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేల ఓట్లు కీలకం కావడంతో వారిపై వేటు పడకుండా టీడీపీ ప్రయత్నిస్తోంది. ఓవైపు వివరణకు గడువు పెంచాలని స్పీకర్‌ను కోరుతూనే… దురుద్దేశపూర్వకంగా తమకు నోటీసులు ఇచ్చారంటూ కోర్టును ఆశ్రయించారు నలుగురు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు. అయితే గతంలో స్పీకర్‌ నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. ఉన్నా వాటిని స్పీకర్‌ పట్టించుకోలేదు. మరి ఈ నలుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిని రేపుతోంది.

టీడీపీ వ్యూహాలు ఫలించి ఆ ఒక్క సీటు నెగ్గుతుందా..?

ఏపీలో రాజ్యసభ సీటు (AP Rajya Sabha) గెలవాలంటే దాదాపు 44మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. వైసీపీకి 151మంది ఎమ్మెల్యేలతో పాటు నలుగురు టీడీపీ రెబల్స్‌, ఓ జనసేన ఎమ్మెల్యే మద్దతు కూడా ఉంది. లెక్కప్రకారం అయితే గెలుపు వైసీపీకి నల్లేరుపై నడకే. కానీ టికెట్లు దక్కని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తుండటం పోటీని రసవత్తరంగా మార్చింది. అసెంబ్లీలో లెక్కప్రకారం టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో నలుగురు ఎప్పుడో వైసీపీలోకి జంపైపోయారు. దీంతో టీడీపీ బలం 19కి తగ్గింది. ఆ నలుగురు వైసీపీ రెబల్స్‌పై కత్తి వేలాడుతుండటంతో వారు ఓటింగ్‌లో పాల్గొనడం డౌటే. అంటే టీడీపీకి ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే కనీసం మరో 25మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు 50మంది వరకు తమకు టచ్‌లో ఉన్నారని టీడీపీ అంటోంది. వారి మద్దతుతో రాజ్యసభ సీటును నెగ్గి వైసీపీ ఝలక్‌ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. కానీ అంతమందిని తమవైపు తిప్పుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. టీడీపీ నుంచి వర్ల రామయ్య, కోనేరు సురేష్‌ పేరు ప్రచారంలో ఉంది.

టీడీపీతో టచ్‌లో ఉన్న వైసీపీ అసంతృప్తులెందరు…?
సీటు దక్కని ఎమ్మెల్యేలను వైసీపీ ఎలా దారికి తెస్తుంది…?

వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో గేమ్‌ప్లాన్‌ ప్రకారం వెళుతోంది. నలుగురు వైసీపీ రెబల్స్‌పై వేటు ద్వారా టీడీపీ బలాన్ని సాధ్యమైనంతగా తగ్గిస్తోంది. దీంతోపాటు అసంతృప్త ఎమ్మెల్యేలు టీడీపీవైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటివరకు వైసీపీ నాలుగు జాబితాలు ప్రకటించింది. అందులో 31మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించారు. వీరిలో పది మంది వరకు ఆ పార్టీకి టచ్‌లో లేకుండాపోయారు. మరికొందరు కూడా ఏం చేయాలన్న ఆలోచనలో పడ్డారు. మరి వీరందరూ ఏం చేస్తారు… వాళ్లను పార్టీ ఎలా కంట్రోల్ లోకి తెచ్చుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. వీరిని బుజ్జగించే బాధ్యతను సీనియర్లకు అప్పగించినట్లు సమాచారం. భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు కల్పిస్తామని కూడా భరోసా ఇస్తోంది. వైసీపీ నుంచి సీనియర్‌ నేత వైవీ.సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పోటీ చేసే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ వ్యూహాన్ని అంచనా వేయలేక దెబ్బతిన్న వైసీపీ ఈసారి మాత్రం రాజ్యసభ ఎన్నికలను లైట్‌ తీసుకోవడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీకి అవకాశం ఇవ్వకూడదని గట్టి పట్టుదలతో ఉంది.