East Godavari: పెరూ కోడితో కాసుల వర్షం
గోదారి జిల్లాలు అంటే కొబ్బరి నీళ్లకు, పచ్చటి పంటకు, పాడి పరిశ్రమకు, పందెం కోళ్ల కు ప్రసిద్ది. ఇది ఒకప్పటి మాట కానీ ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయంటున్నాడు ఒక యువకుడు. ఇతని కథేంటో ఇప్పుడు చూసేద్దాం.
కలిసి రాని కరోనా
ఇతని పేరు రామరాజు వయసు 32 సంవత్సరాలు. బీటెక్ పూర్తి చేసి అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. కరోనాతో పరిస్థితులు మారిపోయాయి. తన తండ్రి వేంకటేశ్వరరాజు కూడా కరోనా కారణంగానే మరణించారు. ఇతనిది ఉమ్మడి కుటుంబం. అది కాస్త విడిపోయింది. దీంతో అతనికి రావల్సిన కొబ్బరి తోట వాటా 15 ఎకరాలు వచ్చింది. దీనిని నమ్ముకొని కొంత కాలం వ్యాపారం చేశాడు. ఆశించినంత స్థాయిలో ఫలితం రావడం లేదు. దీనిని గమనించి మరో వ్యాపారం ఏదైనా చేయాలని సంకల్పించాడు. గోదావరి జిల్లాల్లో దేశవాళీ కోడిపుంజులను పెంచి సంక్రాంతి పండుగకు అమ్మడం మొదలు పెట్టాడు. ఇది కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
పెరూతో సరికొత్త ప్రయోగం
ఈసారి సరికొత్తగా ఆలోచింది పెరూ జాతి కోడిపుంజును తన ఇంటికి తెప్పించుకున్నాడు. పెరూ అనగానే ఉత్తినే వచ్చేయదు మరె. దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ. 1.40 నుంచి రూ. 2.50లక్షల వరకూ ఉంటుంది. ఇందులో రకాన్ని బట్టి ధర ఉంటుంది. రామరాజు మొదటి రకం పుంజును 2020లో కొనుగోలు చేశాడు. దీనికి అయిన ఖర్చు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక నిర్వహణ బాధ్యతలు చూస్తే ఆశ్చర్యపోకతప్పదు. పెరూ నుంచి కొనుగోలు చేసిన కోడిపుంజును ప్రత్యేక విసాతో ఫ్లైట్ లో ప్రయాణానికి ప్రత్యేకంగా టికెట్ కొనుగోలుచేయాల్సి ఉంటుంది. ఇతను అమెరికా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు పూర్తిస్తాయి అనుమతులతో దిగుమతి చేసుకున్నారు. శంషాబాద్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఏసీ కార్లో తన గ్రామానికి చేర్చాడు. దీనంతటికీ కలిపి రూ. 2.85 లక్షలు ఖర్చయింది.
క్రాసింగ్ బ్రీడ్ ను రూ. 10వేలు మాత్రమే
ఈ పెరూ జాతి పుంజును కొబ్బరి తోటలో శీతల వాతావరణంలో ఉంచి రాజభోగాలతో పెంచి పోషిస్తున్నారు. మేలు రకం అయిన దేశవాళీ పెట్టలతో క్రాసింగ్ జరిపి దీని సంతానోత్పత్తిని విపరీతంగా పెంచుతున్నారు. పిల్లలను మూడు నెలల వయసు వచ్చే వరకూ పెంచి ఆతరువాత రూ. 10 వేలకు విక్రయిస్తున్నారు. ఇలా అమ్మడం వల్ల గత రెండేళ్ళలో దాదాపు రూ. 41 లక్షలకు పైగా సంపాదించగా వీటి మెయింటెనెన్స్ కు రూ. 5 నుంచి రూ. 6 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపారు. ఈ ఖర్చులన్నీ పోయినప్పటికీ నాకు రూ. 35 లక్షలు మిగిలిందంటున్నాడు. ఈ జాతి కోళ్లు పందెంలో బాగా రాణించడంతో దీనికి డిమాండ్ కొంచం పెరిగిందని వ్యాపార సూత్రాన్ని వంటపట్టించుకున్నాడు ఈ యువకుడు.
T.V.SRIKAR