ఆ క్రికెటర్లకు టాటా చేయూత గుర్తుచేసుకున్న మాజీలు

పారిశ్రామిక దిగ్గ‌జం, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా కేవలం వ్యాపారరంగంలోనే కాదు ఇతర రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయనకు క్రీడలంటే అందులోనూ క్రికెట్ అంటే అమిత‌మైన‌ ఇష్టం. ఆ ఇష్టంతోనే కొంద‌రు క్రికెట‌ర్ల‌కు ఆయ‌న అండ‌గా నిలిచారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 11, 2024 | 10:47 AMLast Updated on: Oct 11, 2024 | 10:47 AM

Ratan Tata Support Cricketers

పారిశ్రామిక దిగ్గ‌జం, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా కేవలం వ్యాపారరంగంలోనే కాదు ఇతర రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయనకు క్రీడలంటే అందులోనూ క్రికెట్ అంటే అమిత‌మైన‌ ఇష్టం. ఆ ఇష్టంతోనే కొంద‌రు క్రికెట‌ర్ల‌కు ఆయ‌న అండ‌గా నిలిచారు. భారత క్రికెట్‌లో అనేక మంది ఆటగాళ్లకు టాటా గ్రూప్ మద్దతుగా నిలిచింది. క్రికెట్‌లో వారి కెరీర్‌కు టాటా ట్ర‌స్టు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ వ‌స్తోంది. మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్‌కు టాటా మోటార్స్ తోడ్పాటు అందించింది. అలాగే సంజయ్ మంజ్రేకర్, అజిత్ అగార్కర్, శ్రీనాథ్, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్, రాబిన్ ఉతప్ప, కైఫ్‌కు టాటా ట్ర‌స్టు ఆర్థికంగా అండ‌గా నిలిచింది. వీరితో పాటు శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్ కూడా టాటా గ్రూప్‌ నుంచి సాయం పొందారు.

అలాగే టాటా గ్రూప్‌లోని పలు కంపెనీలు మన క్రికెటర్లకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. అలాగే వారి ప్రొఫెషనల్ కెరీర్‌కు ఆర్థికంగానూ టాటా గ్రూప్ కంపెనీలు మద్దతుగా నిలిచాయి. అలా టాటా గ్రూప్ నుంచి సాయం పొందిన‌ పలువురు క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. భార‌త జ‌ట్టుకు ఎన్నో విజ‌యాలు అందించారు.
టాటా స్టీల్స్, టాటా పవర్స్, ఎయిర్‌వేస్ విభాగాల్లో టాటా గ్రూప్ ఆయా క్రికెటర్లకు ఉద్యోగాలు కల్పించింది. దీంతోపాటు వారికి స్పాన్సర్‌ చేస్తూ అండ‌గా ఉండి ప్రోత్స‌హించింది.

క్రికెటర్లకు వ్యక్తిగతంగా అండగా నిలవడమే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ ఐపీఎల్‌కు టాటా స్పాన్సర్‌షిప్ చేస్తోంది. వివోతో బీసీసీఐ వివాదం నేపథ్యంలో స్పాన్సర్‌గా ఎవరు వస్తారని చూస్తున్నవేళ.. టాటా ముందుకొచ్చింది. స్వదేశీ కంపెనీలే స్పాన్సర్ గా ఉండాలంటూ అభిప్రాయాలు వెల్లువెత్తిన వేళ ఐపీఎల్ స్పాన్సర్ షిప్ ను కైవసం చేసుకుంది. టైటిల్ స్పాన్సర్‌గా 4ఏళ్ల కాలానికి 2,500 కోట్లతో డీల్ చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధికం. మహిళల ప్రీమియర్‌లీగ్‌నూ టాటానే స్పాన్సర్‌ చేస్తోంది. అంతకుముందు 1996లో టైటాన్ కప్, 2000లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ సమయంలో భారత జట్టుకు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు టాటా గ్రూప్ అండగా నిలిచింది.