Heavy Rains: 3 రోజులు వానలే వానలు..
వర్షాకాలం వచ్చి నెల దాటుతున్నా.. గట్టి వాన కురవలేదు ఇప్పటివరకు! వరుణుడి రాక కోసం రైతులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వానదేవుడు దయ చూపించబోతున్నాడు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. జూలై 7 వరకు తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు .. ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కోన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా పిడుగులు సంభవించే అవకాశముంది. రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాలలోని సముద్ర మట్టంపై సగటు 4.5 కిలో మీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఈదురుగాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.