కోహ్లీ వల్లే రాయుడి కెరీర్ నాశనం, ఊతప్ప సంచలన వ్యాఖ్యలు
భారత క్రికెట్ లో అంబటి రాయుడు పడిలేచిన కెరటం.. అంతర్జాతీయ క్రికెట్ లో మరింత కాలం కొనసాగే సత్తా ఉన్నప్పటకీ కొన్ని రాజకీయాలతో వెనుకబడిపోయాడు. రంజీ కెరీర్ నుంచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పాలిటిక్స్ అతని కెరీర్ ను దెబ్బతీశాయి.
భారత క్రికెట్ లో అంబటి రాయుడు పడిలేచిన కెరటం.. అంతర్జాతీయ క్రికెట్ లో మరింత కాలం కొనసాగే సత్తా ఉన్నప్పటకీ కొన్ని రాజకీయాలతో వెనుకబడిపోయాడు. రంజీ కెరీర్ నుంచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పాలిటిక్స్ అతని కెరీర్ ను దెబ్బతీశాయి. తర్వాత పుంజుకుని జాతీయ జట్టులోకి వచ్చి తనేంటో నిరూపించుకున్నాడు. కానీ 2019 ప్రపంచకప్ సమయంలో రాయుడికి తీవ్ర అన్యాయం జరిగింది. దాదాపు ప్లేస్ ఖాయమనుకున్న దశలో అనూహ్యంగా తమిళనాడు ప్లేయర్ విజయ్ శంకర్ ను సెలక్టర్లు ఎంపిక చేసి షాకిచ్చారు. దీనికి వారు చెప్పిన త్రీడీ లాజిక్ కూడా అప్పట్లో తెగ వైరలయింది. తాజాగా అంబటి రాయుడికి అప్పటి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడం వెనుక మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన విషయాలు వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో రాయుడికి చోటు దక్కకపోవడానికి అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమని వ్యాఖ్యానించాడు. కోహ్లీకి రాయుడంటే.. ఇష్టం లేదని, అందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ కోహ్లీకి ఎవరైనా నచ్చకపోతే.. వెంటనే అతడిని పక్కన పెట్టేస్తాడనీ, ఆ ప్లేయర్ మళ్లీ అవకాశాలు ఇవ్వడనీ ఊతప్ప ఆరోపించాడు. అందుకు అంబటి రాయుడు అంశమే మంచి ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరికీ అభిప్రాయాలు ఉంటాయనీ, కానీ ఇతరులకు అవకాశాలే లేకుండా చేయడం కరెక్టు కాదన్నాడు. వాస్తవానికి అంబటి రాయుడుకు వన్డే ప్రపంచకప్ 2019 జెర్సీలు,. కిట్ కూడా ఇచ్చారని ఊతప్ప చెప్పాడు. రాయుడు కూడా మానసికంగా సిద్ధమయ్యాడని, కానీ, విరాట్ కోహ్లీ ఆ అవకాశాన్ని ఆపేశాడనీ ఆరోపించాడు. ఇది తనకు ఏమాత్రం కరెక్టు అనిపించలేదంటూ ఊతప్ప ఓ ఇంటర్యూలో వెల్లడించాడు.
2019 ప్రపంచకప్ జట్టులో రాయుడుకి ఖచ్చితంగా ప్లేస్ ఉంటుందని చాలా మంది భావించారు. చివరి నిమిషం వరకూ రాయుడే ముందంజలో ఉన్నాడు. కానీ అనూహ్యంగా విజయ్ శంకర్ ను సెలక్ట్ చేయడం పెద్ద దుమారాన్నే రేపింది. దీనికి సెలక్టర్లు ఇచ్చిన వివరణ కూడా విమర్శలకు దారితీసింది. రాయుడిని కావాలనే ఎంపిక చేయలేదన్న అభిప్రాయాలు కూడా గట్టిగానే వినిపించాయి. ఇదిలా ఉంటే అంబటి రాయుడు స్థానంలో ఎంపికైన విజయ్ శంకర్ వరల్డ్ కప్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైరయ్యారు.ఫామ్ లో ఉన్న ఆటగాడిని వదిలేసి పనికిమాలిన ఆటగాడిని ఎంపిక చేశారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొత్తం మీద కోహ్లీ కారణంగానే రాయుడి కెరీర్ నాశనమైందంటూ ఊతప్ప చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా 2013లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన రాయుడు 55 వన్డేలు, 6 టీ ట్వంటీలు ఆడాడు. 2023లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్ లో కొనసాగుతున్నాడు.