Rbi QR Code Coin Vending Machine: స్కాన్ కొట్టు – చిల్లర పట్టు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 8, 2023 | 12:37 PMLast Updated on: Feb 13, 2023 | 12:53 PM

Rbi Qr Code Coin Vending Machine

మన దేశంలో క్యూఆర్ కోడ్ శకం ప్రారంభమైంది. ప్రస్తుతం ఎటుచూసినా క్యూఆర్ కోడ్ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరి జేబులో నగదు అనేది లేకుండా పోయింది. దీనికి కారణం పెద్దనోట్ల రద్దు అనే చెప్పాలి. పెద్ద నోట్ల రద్దుకంటే ముందు ఈ స్కానర్లు, యూపీఐ లావాదేవీలు పెద్దగా కనిపించేవి కావు. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్త నోట్ల కొరతను అధిగమించేందుకు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ఆన్ లైన్ యాప్ ల ద్వారా నగదు రహిత లావాదేవీలను జరిపేందుకు అత్యాధునిక సాంకేతిక ఒరవడికి బీజం పడింది.

మరో కొత్త ప్రయోగం:
పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ నుంచి మల్టీప్లక్స్ సినిమా థియేటర్స్ వరకూ… చిన్న కూరగాయలన తోపుడు బండ్ల నుంచి రోడ్డు పక్కన సిగరేట్ కొట్టు వరకూ ఎటు చూసినా ఈ క్యూ ఆర్ కోడ్ బోర్డ్ కనిపిస్తుంది. షాపుల్లో దేవుని ఫోటో లేకున్నా ఈ స్కానర్ మాత్రం తప్పని సరిగా ఉంచుకుంటున్నారు. అందులో కొందరు అయితే ఎంత డబ్బులు వచ్చాయో తెలుసుకునేందుకు ది పేటిఎం పేమెంట్ ఆఫ్ రూపీస్ అనే స్వరాన్ని అనుకనిస్తూ కూడా స్పీకర్లను ఏర్పాటు చేసుకున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో మంచి నీరు కావాలంటే స్కాన్ చేసి నీటిని నింపుకునేంతగా అభివృద్ది చెందింది.  ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం యాచకుల వద్ద చిల్లర లేదంటే స్కాన్ చేయమని అడిగేంతలా ఇది విస్తరించింది. ఒకప్పుడు ఏటీఎం అంటేనే వింతగా చూసేవాళ్లం. ఒక చిన్న అరచేతి వేళ్ల పరిమాణంలో ఉన్న కార్డు పెడితే మనకు కావస్సిన డబ్బులు మిషీన్ లో నుంచి వస్తాయా అని. అలాంటిది రోజుకో టెక్నాలజీ జీవం పోసుకుంటూ వచ్చేస్తుంది. అలా వచ్చిన మరో అద్భుతమైన ప్రయోగమే కాయిన్ వెండింగ్ మిషేన్ లు.

వీటి ప్రాసెస్ ఎలా?
వీటిని ఎలా ఉపయోగించాలి అనే అనుమానం అందరిలో ఇప్పటికే కలిగి ఉంటుంది. మన మొబైల్ ఫోన్ లోని ఏదో ఒక యూపీఐ యాప్ ను ఓపెన్ చేస్తే అందులో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేందుకు ఒక ఆప్షన్ ఉంటుంది. దానిని టచ్ చేసిన వెంటనే మీకు దగ్గరగా ఉన్న క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయమని డిస్ ప్లే లో కనిపిస్తుంది. అలా స్కాన్ చేసిన వెంటనే మనం ప్రస్తుతం చేసే నగదు లావాదేవీ లాగా ఎంత కాయిన్స్ కావాలో అంత అమౌంట్ ను నమోదు చేయాలి. ప్రాసెస్ విజయవంతంగా ముగిసిన వెంటనే మనం ఎంత మొత్తానికి చిల్లర కావాలనుకొని డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామో అంతమొత్తంలో చిల్లర మిషన్ నుంచి బయటకు వస్తుంది. కేవలం క్యూఆర్ కోడ్ ద్వారానే కాకుండా ఏటీఎం కార్డును ఉపయోగించి కూడా వీటిని పొందవచ్చు.

ఆర్బీఐ గవర్నర్ ప్రకటన:
క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నాణేలను తీసుకునేందుకు వీలుగా కాయిన్ వెండింగ్‌ మెషిన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) ఈ సందర్భంగా వెల్లడించారు. నాణేలు కావాలనుకునేవారి కోసం కాయిన్‌ వెండింగ్‌ మెషిన్లను (Coin vending machine) తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మొదటగా దేశంలోని 12 ప్రదాన నగరాల్లో ఈ వెండింగ్‌ మెషిన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నట్లు ద్వైమాసిక పరపతి విధాన సమీక్షా నిర్ణయాల్లో భాగంగా ఈ విషయం వెల్లడించారు.

12 రాష్ట్రాల్లో.. 19 చోట్ల ఏర్పాటు:
తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా ఈ క్యూసీవీఎంలను (క్యూఆర్‌ కోడ్‌బేస్డ్‌ కాయిన్‌ వెండింగ్‌ మెషిన్‌) 19 చోట్ల ఏర్పాటు చేస్తారు. రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి ముఖ్యమైన ప్రజావాహిని ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అందుబాటులో ఉంచుతారు. ఇది సత్ఫలితాలు ఇస్తే దాని ఆధారంగా క్యూసీవీఎంల ద్వారా నాణేలను అందుబాటులో ఉంచాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా దేశం మొత్తం యూపీఐ సేవలను మరింత విస్తృతం చేస్తూ ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జీ20 దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో చెల్లింపులు చేసేందుకు యూపీఐ సేవలను అందించనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు.