రికార్డులు, వివాదాలు, వ్యసనాలు.. కాంబ్లీ కెరీర్ ఓ గుణపాఠం
మనం ఎలా నడుచుకుంటామో అదే మన లైఫ్ ను డిసైడ్ చేస్తుంది. ఆటల్లో టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు.. దానికి తగ్గ కృషి , పట్టుదల.. అన్నింటికీ మించి క్రమశిక్షణ చాలా ముఖ్యం... అది లేకుంటే ఎవ్వరూ కూడా కెరీర్ లో ఎదగలేరు..
మనం ఎలా నడుచుకుంటామో అదే మన లైఫ్ ను డిసైడ్ చేస్తుంది. ఆటల్లో టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు.. దానికి తగ్గ కృషి , పట్టుదల.. అన్నింటికీ మించి క్రమశిక్షణ చాలా ముఖ్యం… అది లేకుంటే ఎవ్వరూ కూడా కెరీర్ లో ఎదగలేరు.. భారత క్రికెట్ లో వినోద్ కాంబ్లీ కెరీర్ ప్రతీ ఒక్కరికీ గుణపాఠంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. చిన్నవయసులోనే వచ్చిన పేరు, డబ్బు, లగ్జరీ లైఫ్ ను సరిగ్గా హ్యాండిల్ చేయకుంటే కెరీర్ ముగిసిపోతుందనడానికి కాంబ్లీ అసలైన ఉదాహరణ.. స్టార్‌డమ్ సంపాదించుకోవడం ఎంత కష్టమో, దాన్ని కాపాడుకోవడం కూడా అంతే కష్టం. ఇది తెలియకనే ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షా వంటి క్రికెటర్లు, కెరీర్‌ని నాశనం చేసుకున్నారు. స్టార్‌గా ఓ వెలుగు వెలిగి, కెరీర్‌ని నాశనం చేసుకున్నవారి టాపిక్ వస్తే.. వినోద్ కాంబ్లీ గురించి తప్పక ప్రస్తావించాల్సిందే.
సుదర్శనం విద్యామందిర్ స్కూల్‌లో చదివిన సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ కలిసి స్కూల్ క్రికెట్ టోర్నీలో 664 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 25 ఏళ్ల వరకూ ఇదే స్కూల్ క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం… 664 పరుగుల భాగస్వామ్యంలో వినోద్ కాంబ్లీ 349 పరుగులు చేయగా, సచిన్ టెండూల్కర్ 326 పరుగులే చేశాడు. రంజీ ట్రోఫీలో ఆడిన మొదటి బంతికే సిక్సర్ బాదిన వినోద్ కాంబ్లీ, 1991లో వన్డే ఆరంగ్రేటం, తర్వాతి ఏడాది టెస్టు ఆరంగ్రేటం చేశాడు…ఒకప్పుడు కాంబ్లి సచిన్ ను మించిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్ తో అద్భుతాలు చేశాడు.
సచిన్ టెండూల్కర్‌తో కలిసి అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన వినోద్ కాంబ్లీ, చేజేతులా కెరీర్‌ని నాశనం చేసుకున్నాడు. 14 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు చేసి, అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. వినోద్ కాంబ్లీ… బుల్లెట్ స్పీడ్‌తో కెరీర్‌ని మొదలెట్టాడు.. తన కెరీర్‌లో మూడో టెస్టులో తొలి డబుల్ సెంచరీ చేసిన వినోద్ కాంబ్లీ, ఆ తర్వాతి టెస్టులో 227 పరుగులు చేశాడు. శ్రీలంకపై మరో 2 సెంచరీలు చేశాడు. వరుసగా 3 టెస్టుల్లో మూడు దేశాలపై మూడు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా వినోద్ కాంబ్లీ రికార్డు ఇంకా చెక్కు చెదరలేదు. బ్రాడ్ మాన్ తర్వాత టెస్టుల్లో మొదటి వెయ్యి పరుగులు సాధించేందుకు అతని యావరేజ్ భారత్ తరపున ఇప్పటికీ అత్యుత్తమమే.
అయితే ఆ తర్వాత వినోద్ కాంబ్లీ, కెరీర్ పతనం అవుతూ వచ్చింది. వ్యసనాలకు బానిసైన వినోద్ కాంబ్లీ, క్రికెట్ ఆటపై ఫోకస్ కోల్పోయాడు. వరుసగా ఫెయిల్ అవుతూ రావడంతో జట్టులో చోటు కోల్పోయాడు… మొదటి 8 టెస్టుల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 1000 పరుగులు చేసిన వినోద్ కాంబ్లీ, ఆ తర్వాత 9 టెస్టుల్లో కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయాడు. వ్యసనం అతడి కెరీర్ ను నాశనం చేసింది. మద్యానికి బానిసవ్వడంతో కాంబ్లి క్రికెట్ లో కనుమరుగయ్యాడని క్రీడా విశ్లేషకులు చెప్తుంటారు. వ్యక్తిగత జీవితంలోనూ పలు వివాదాలను అతన్ని మరింత పాతాళానికి నెట్టాయి. చాలా యంగ్ ఏజ్ లోనే వచ్చిన పేరు,ప్రఖ్యాతలు, డబ్బు , స్టేటస్ ను కాంబ్లీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. ఫలితంగా ఆటపై ఏకగ్రాత తగ్గింది.. వ్యసనాలపై వైపు ఎట్రాక్ట్ అయ్యాడు. పలువురు కాంబ్లీని హెచ్చరించినా అతను పట్టించుకోలేదు. దీంతో 2000లో అతని కెరీర్ ముగిసింది.
క్రికెట్‌కి దూరమయ్యాక అనారోగ్యంతో గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఆర్థికంగానూ అతడి పరిస్థితి బాగాలేదని సమాచారం. బీసీసీఐ ఇచ్చే పింఛనుతో నెట్టుకొస్తున్నాడు. 2012 నుంచి ఆరోగ్య సమస్యలు అతడ్ని చుట్టుముట్టాయి. 2013లో గుండెపోటుకు గురవ్వడంతో డాక్టర్లు సర్జరీ చేశారు. యాంజియోస్లాస్టీ తర్వాత కోలుకున్నప్పటికీ మునుపటిలా నడవలేకపోతున్నాడు. సచిన్ పలు సందర్భాల్లో అతనికి సాయం చేసినా కాంబ్లీ మాత్రం తన కెరీర్ ను తానే చేజేతులా నాశనం చేసుకున్నాడు. వ్యసనాలకు బానిసైన వినోద్ కాంబ్లీని సచిన్ కూడా పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. సచిన్ ఆటపై ఫోకస్ పెట్టి అంతర్జాతీయ క్రికెట్ లో ఆకాశమంత ఎదిగితే… వివాదాలు, వ్యసనాలతో చేజేతులా కెరీర్ ను పాడుచేసుకున్న కాంబ్లీ అధపాతాళానికి పడిపోయాడు. కాంబ్లీ కెరీర్ నాశనం కావడానికి ఎవ్వరూ కారణం కాదు.. తనకు తానే కారణం…ఇప్పటికే క్రమశిక్షణ లేకుంటే కెరీర్ ఎలా ముగిసిపోతుందన్న దానికి కాంబ్లీ జీవితాన్నే చాలా మంది యువ ఆటగాళ్ళకు గుర్తు చేస్తుంటారు.