Mukesh Ambani: రిలయన్స్.. ఫార్మా రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు..
రిలయన్స్ అనే పదం పలికితేనే ఒక రకమైన వైబ్రేషన్స్ వెలువడుతాయి. ఇక ఆ కంపెనీ ఏదైనా బిజినెస్ లో అడుగుపెడితే సెన్సేషన్ అవుతుందని చెప్పాలి. పెట్రోల్, డీజల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్, సూపర్ మార్కెట్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఓటీటీ ఇలా ఒక్కటా రెండా ప్రతి ఒక్క వ్యాపారంలో తనదైన బిజినెస్ స్ట్రాటజీతో దూసుకుపోతుంది. తన ప్రత్యర్థి వ్యాపారులకు వెన్నులో ఒణుకుపుట్టిస్తూ కస్టమర్లను తన వైపుకు తిప్పుకుంటుంది. ఈ సంస్థ అధినేత అంబానీ తాజాగా ఫార్మా రంగంలోకి అడుగుపెట్టేందుకు పావులు కదుపుతున్నారు.
ముఖేష్ అంబానీ వాల్ గ్రీన్స్ అనే యూకే కి చెందిన సంస్థతో డీల్ కుదుర్చుకునేందుకు సిద్దమయ్యారు. ఈ వాల్ గ్రీన్స్ అలయన్స్ అనేది చాలా పెద్ద పెద్ద సంస్థలతో కలిసి బిజినెస్ డీల్స్ జరిపే మల్టీ బిలియన్ డాలర్ సంస్థ. ప్రస్తుతం ఇది నష్టాల్లో కొనసాగుతోంది. దీనిని టార్గెట్ చేసి ఎలాగైనా తన చేతిలోకి తీసుకోవాలని పట్టుబట్టారు అంబానీ. దీనిని కొనుగోలు చేసి మెడికల్ షాపులు, ఫార్మా బిజినెస్ మన దేశానికి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వాల్ గ్రీన్స్ బూట్స్ అలయన్స్ తో ఒప్పందాలు చేసుకొని ఇంటర్నేషనల్ మెడికల్ స్టోర్స్ ని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మార్కెట్ ఎత్తుగడలను వండివారుస్తోంది. ఆ కంపెనీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారీ మొత్తంలో ఫండ్స్ ఇచ్చేందుకు సన్నద్దమైనట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది.
ఇదిలా ఉంటే ప్రముఖ బిజినెస్ పత్రికలైన ఔట్ లుక్, ఎకనామిక్స్ టైమ్స్ మాత్రం కన్సార్టియం ఏర్పాటు చేసేందుకు అంబానీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు ప్రచురించాయి. కన్సార్టియం అంటే ఒకే రకమైన వ్యాపార సంస్థలతో మైత్రిని కొనసాగిస్తూ వ్యాపారం చేయడం. ఇప్పుడు ఫార్మా రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్దమైన అంబానీ బ్రిటన్, యూఎస్ లోని ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ తో సత్సంబంధాలు కొనసాగించుకునే పనిలో ఉన్నారు. తద్వారా ఆయా కంపెనీల పీఆర్ పెంచుకొని వాటి అనుసంధానమైన అన్ని కంపెనీల మెడికల్ స్టోర్స్ ని కొనుగోలు చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. యూఎస్ బేస్డ్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలోతో పాటూ గ్లోబల్ మేనేజ్మెంట్ ఐఎన్సీ ఇరు సంస్థలతో ఈ రకమైన మైత్రిని కొనసాగించనున్నట్లు ఈ పత్రికల సారాంశం.
ఇక వాల్ గ్రీన్స్ సంస్థ మొత్తం విలువ సుమారు 6.5 బిలియన్ డాలర్లు ఉన్నట్లు అంచనా వేశారు. అంటే మనదేశ కరెన్సీతో లెక్కగడితే ఇంచుమించు 53 వేల కోట్ల రూపాలయలకు పైగానే ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన చిన్న అంశం ఒకటి ఉంది. వాల్ గ్రీన్స్ ఈ ఫార్మా వ్యాపారాన్ని ఆన్లైన్ మార్కెట్లోకి విస్తరించినప్పటి నుంచి నష్టాల బారిన పడుతూ వచ్చింది. ఇక ఈ నష్టాల నుంచి గట్టెక్కాలంటే అంబానీతో చేతులు కలుపక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల రిలయన్స్ తన వాటాను వాల్ గ్రీన్స్ లో పెంచుకునే పరిస్థితులు అధికంగా ఉన్నాయి. అప్పుడు ఇప్పుడున్నంత వాటా విలును ఈ ఫార్మా కంపెనీ కోల్పోవల్సి వస్తుంది.
ఇక ఈ వాల్ గ్రీన్స్ తో రిలయన్స్ ఒప్పందం విజయవంతం అయితే ఈ యూకే కంపెనీని మన భారత్లోకి తీసుకుని వచ్చి ఆన్ లైన్ డ్రగ్ స్టోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అంబానీ. ఇలా తన మార్కెట్ సేవలను అందిస్తూ లాభాలు గణించే యోచన చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ఆన్లైన్ డ్రగ్ ఫార్ములను అమలు చేస్తూ టాటా 1ఎంజీ, అపోలోలు ముందువరుసలో దూసుకుపోతున్నాయి. వీరికి పోటీగా సరికొత్తగా రిలయన్స్ ఆన్లైన్లో మందుల విక్రయాలు జరిపితే ఏదైనా ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించాల్సి ఉంటుంది. అలా కస్టమర్ల నాడి పట్టుకోగలిగితే ఫార్మా రంగంలో కూడా రిలయన్స్ కు తిరుగు ఉండదని చెప్పక తప్పదు. గతంలో ఉన్న టాటా, అపోలోలకు గట్టిపోటీ నెలకొంటుంది.
T.V.SRIKAR