Renuka Chowdary: రేణుకా చౌదరి ‘దూత’ రాజకీయాలు ఎవరినుద్దేశించినవి..! షర్మిల, జగన్ అంటే ఎందుకు ఫైర్ అవుతున్నారు.?
తెలంగాణలో ఖమ్మం రాజకీయం రోజు రోజుకూ హద్దులే కాదు రాష్ట్రాలు కూడా దాటుతోంది.

Renuka Chaudhary made sensational comments on Jagan and Sharmila as part of Khammam politics
తెలంగాణలో రాజకీయం రోజు రోజుకూ అగ్గి రాజేస్తోంది. ఈనేపథ్యంలో ఖమ్మం జిల్లాలో నాయకుల పట్ల అసమ్మతి లోలోపల రగిలిపోతున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. తాజాగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఖమ్మం కాంగ్రెస్ లో కొందరికి కొందరు మాత్రమే పడరా.. లేక అందరికీ కొందరంటే సరిపోదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సెగ ఏపీ నాయకుల వరకూ పాకింది. అది కడుపు మంటా.. లేకుంటా తన పదవికి ఎసురు పెడతారన్న భయమో అర్థం కావడం లేదు. అయితే మాట్లాడే మాటల్లో మాత్రం పదును ఎక్కడా తగ్గడం లేదు. దీంతో కొందరికి కొందరు పడరు అని స్పష్టమౌతోంది.
షర్మిల సీటు పై వ్యంగాస్త్రం..
ఒకప్పుడు ఖమ్మంలో రేణుకా చౌదరి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో కీలక మహిళా నేతగా కొనసాగుతున్నారు. అయితే మన్న లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఖమ్మం పై పూర్తి పట్టుసాధించాలని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో పాలేరు నుంచి పోటీ చేయాలని టికెట్ ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఈమధ్య కాలంలో ఆమె మాట్లాడుతున్నారు. గతంలో షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని స్వాగతించారు రేణుకా చౌదరి. అయితే ఆమె పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న వార్తలు విని ‘ఆ ఇంక ఎవరూ లేరా పాలేరు నుంచి పోటీకి’ అని వ్యంగంగా స్పందించారు. అయితే ఇది పెద్దగా రాజకీయ చర్చకు దారి చూపలేదు. సాఫీగా సాగిపోయింది.
చంద్రబాబు అరెస్ట్ పై స్పందన..
చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై తాజాగా రేణుకా చౌదరి స్పందించారు. ఈమె రాజకీయ ప్రస్తానం ఈ పార్టీ నుంచే ప్రారంభమైంది. ఆయనపై స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరిట అభాండాలు మోపారన్నారు. సరైన సాక్ష్యాధారాలు లేకుండా మాజీ ముఖ్యమంత్రిని హింసించి, వేధించడం న్యాయమా? అని ప్రశ్నించారు. న్యాయం, ధర్మం పేరు చెప్పే షర్మిల, విజయమ్మ ఇంతవరకు ఈ విషయంపై ఎందుకు స్పందించలేదని విమర్శించారు.
దూతల ద్వారా రాజకీయం ఏంటి..
‘జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయి అన్న విధంగా ఉందని మండిపడ్డారు. జగన్ బెయిల్ ను వెంటనే రద్దు చేయాలన్నారు. సుప్రీం కోర్ట్, హై కోర్ట్ ఆయన కేసును సుమోటోగా తీసుకొని విచారణ జరిపి తిరిగి జైలుకు పంపాలని కోరారు. దూతల ద్వారా రాజకీయం చేయాని చూస్తున్నట్లు తెలిపారు. తన సామాజిక వర్గం వారిని ఖమ్మం రాజకీయాలకు పంపించి తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్నట్లు’ ఆరోపించారు. ఇక్కడ దూత అనే పేరును.. అదే సామాజిక వర్గం అని ఊటంకించడం వెనుక చాలా బలమైన అర్థం ఉందంటున్నారు రాజకీయ పండితులు. గతంలో జగన్ పార్టీలో ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని దూత అని అభివర్ణించినట్లు కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పొంగులేటిని ఎందుకు టార్గెట్ చేశారు..
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రజల్లో బలం ఉన్న నాయకుడు. అయితే ఆయనను సరైన విధంగా వాడుకోవడంలో ప్రతి రాజకీయ పార్టీ విఫలం అయిందని చెప్పాలి. కేవలం రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈయనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇంతటి ప్రజాధారణ కలిగి నాయకుడు కాంగ్రెస్లో చేరారు. దీంతో ఖమ్మంలో కాంగ్రెస్ బలం మరింత పుంజుకుంది అని భావించారు. దీంతో పొంగులేటి అంటే ఈమెకు పడదా అన్న చర్చ మొదలైంది. దీనికి కారణం ఆయన ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. తాజాగా పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈయనను కూడా ఇలా పరోక్షంగా విమర్శస్తున్నారని అంటున్నారు ఖమ్మం రాజకీయం దగ్గర నుంచి చూస్తున్న పరిశీలకులు.
T.V.SRIKAR