ఒక్క సిరీస్ లో ఫెయిలైతే రిటైర్మెంటా ? కోహ్లీ,రోహిత్ లపై విమర్శలకు డీకే కౌంటర్

టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లో లేరు. బంగ్లాదేశ్ తోనూ, ఇటీవలే ముగిసిన కివీస్ తో సిరీస్ లోనూ కూడా వీరిద్దరూ నిరాశపరిచారు. దీంతో సుధీర్ఘ ఫార్మాట్ నుంచి వీరిద్దరూ తప్పుకోవాలంటూ విమర్శలు వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2024 | 01:40 PMLast Updated on: Nov 09, 2024 | 1:40 PM

Retirement If You Fail In One Series Dk Counters Criticism Of Kohli And Rohit

టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లో లేరు. బంగ్లాదేశ్ తోనూ, ఇటీవలే ముగిసిన కివీస్ తో సిరీస్ లోనూ కూడా వీరిద్దరూ నిరాశపరిచారు. దీంతో సుధీర్ఘ ఫార్మాట్ నుంచి వీరిద్దరూ తప్పుకోవాలంటూ విమర్శలు వచ్చాయి. కివీస్ పై 0-3తో వైట్ వాష్ పరాభవం తర్వాత ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా కోహ్లీ, రోహిత్ లపై వస్తున్న విమర్శలకు మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కౌంటర్ ఇచ్చాడు. ఒకటిరెండు సిరీస్ లతో ఫెయిలయితే రిటైర్మెంట్ ఇచ్చేస్తారా అని ప్రశ్నించాడు. కోహ్లీ, రోహిత్ లాంటి స్టార్ ప్లేయర్స్ కు కూడా ఒక్కోసారి బ్యాడ్ ఫేజ్ ఉంటుందన్నాడు. ఒకవేళ ఆసీస్ తో సిరీస్ నుంచి మరో 10-12 టెస్టుల్లో ఫెయిలయితే మాత్రం రిటైర్మెంట్ విషయంలో వాళ్ళే ఆలోచిస్తారన్నాడు.

దేశవాళీ సీజన్ లో బరిలోకి దిగితే కోహ్లీ, రోహిత్ ఫామ్ అందుకోవడం ఖాయమన్నాడు. దేశవాళీ క్రికెట్ లో ప్రదర్శన కాన్ఫిడెన్స్ ఇస్తుందన్న దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ విషయంలో వాళ్ళిద్దరికీ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. కివీస్ తో సిరీస్ లో రోహిత్ 15 యావరేజ్ తో కేవలం 91 పరుగులే చేశాడు. అటు కోహ్లీ కూడా 15.5 యావరేజ్ తో 93 పరుగులకే పరిమితమవ్వడం కివీస్ చేతిలో వైట్ వాష్ పరాభవానికి కారణమైంది. స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడడమే కొంపముంచిందని దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కీలక సలహా ఇచ్చాడు. టెస్ట్ ఫార్మాట్‌లో దూకుడు పనికి రాదని, ఓపికగా ఆడాలని సూచించాడు.

రోహిత్ అటాకింగ్ బ్యాటింగ్‌పై స్పందించిన దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అటాకింగ్ గేమ్ వైట్‌బాల్ ఫార్మాట్‌లో ఫలితాలిచ్చినా.. టెస్ట్ ఫార్మాట్‌కు పనికి రాదన్నాడు. టెస్ట్‌ల్లో రోహిత్ తన బ్యాటింగ్ వైఖరిని మార్చుకోవాలని సూచించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రోహిత్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని విశ్లేషించాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో ఆడిన అప్రోచ్ టెస్ట్ క్రికెట్‌కు పనిచేయదని అభిప్రాయపడ్డాడు. రోహిత్ భారీ షాట్లు ఆడకుండా ఓపికగా ఆడాలన్నాడు. ఆసీస్ తో సిరీస్ లో రోహిత్ , కోహ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశముందని దినేశ్ కార్తీక్ అంచనా వేశాడు. పేస్ పిచ్ లపై రోహిత్ తన బలహీనతను అధిగమించాల్సి ఉందని, కోహ్లీ మాత్రం ఆసీస్ బౌలర్లకు సవాల్ గా ఉంటాడని డీకే చెప్పాడు. కాగా న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమి నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించకుంటే ఈ ఇద్దరి కెరీర్‌కు ముగింపు పడినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకుంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.