REVANTH REDDY: హరీష్ రావు వల్లే రైతు బంధు ఆగింది.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15వేలు ఇస్తాం

హరీష్ రావు వ్యాఖ్యలు, కేసీఆర్ అతి తెలివి వల్ల రైతు బంధు ఆగింది. రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5 వేల కోట్లు ఆగిపోయాయి. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. రైతు బంధు రాకపోవడానికి కారణమైన బీఆరెస్ నేతలను తరిమికొట్టండి. బీఆరెస్ కుట్ర వల్లే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు ఆగిపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2023 | 07:29 PMLast Updated on: Nov 27, 2023 | 7:29 PM

Revanth Reddy Accused Harish Rao About Ec Halt Rythu Bandhu

REVANTH REDDY: బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు వల్లే రైతు బంధు ఆగిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15 వేలు రైతుల ఖాతాల్లో వేస్తాం అని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్‌, డోర్నకల్‌లో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. “రైతుబంధు రైతుల ఖాతాలో వేయాలని ఈసీకి మేం విజ్ఞప్తి చేసాం. ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే, హరీష్ రావు వ్యాఖ్యలు, కేసీఆర్ అతి తెలివి వల్ల రైతు బంధు ఆగింది.

రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ.5 వేల కోట్లు ఆగిపోయాయి. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. రైతు బంధు రాకపోవడానికి కారణమైన బీఆరెస్ నేతలను తరిమికొట్టండి. బీఆరెస్ కుట్ర వల్లే రైతుల ఖాతాలో పడాల్సిన నిధులు ఆగిపోయాయి. అల్లుడు హరీష్ వల్లే రూ.5 వేల కోట్లు ఆగిపోయినాయ్. ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఏటా ప్రతీ ఎకరాకు రూ.15 వేలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రెడ్యా నాయక్‌కు, ఆయన కూతురుకు కాంగ్రెస్ అవకాశం ఇస్తే.. కార్యకర్తల గుండెలపై తన్ని పార్టీ ఫిరాయించారు. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురాకుండా బీఆరెస్ అన్యాయం చేసింది. ఈ ప్రాంతంలోని లంబాడా బిడ్డలను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోంది.
దొరల పాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలి
రాష్ట్రంలో దొరల, గడీల పాలన పోవాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి. కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది. పోరాటాన్ని నేర్పింది. 20 ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడే ధైర్యాన్ని ఇచ్చింది. తల తెగి కింద పడ్డా.. ఎవరి ముందు లొంగకుండా ఉండేలా ఈ కొడంగల్ గడ్డ నాకు నేర్పింది. మీరు అండగా ఉంటే.. అది నరేంద్ర మోడీ అయినా, కేసీఆర్ అయినా కొట్లాడి వాళ్ల మెడలు వంచే బాధ్యత నాది. ఈ కొడంగల్ గడ్డ.. నా అడ్డా.. మీ బిడ్డ.. మీరు నాటిన మొక్క.. రాష్ట్రానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. మీరు పెంచిన ఈ చెట్టును నరికెందుకు కేసీఆర్, మోదీ భుజాన గొడ్డలి వేసేందుకు బయలుదేరిండ్రు. నేను మీరు నాటిన వృక్షాన్ని. ఆ వృక్షాన్ని కల్వకుట్ల తారకరామారావు నరకాలని చూస్తున్నాడు.

తండ్రికొడుకులు కలిసి.. మీరు పెంచిన వృక్షాన్ని నరికేస్తామంటున్నరు. నరకనిస్తరా.. ఎవరొచ్చినా పాతాళానికి తొక్కుతరా..? సిరిసిల్ల నుంచి వచ్చిన దద్దమ్మ కేటీఆర్. కొడంగల్‌ను దత్తత తీసుకుంటా అన్నడు. నేను చెబుతున్నా.. కొడంగల్ నియోజకవర్గమే తెలంగాణను దత్తత తీసుకుంటుంది. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇస్తుంది. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరను ఇస్తుంది. మనందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్ చెప్పిండు. కానీ ఎవరికీ ఇవ్వలేదు. కొడంగల్ సాక్షిగా చెబుతున్నా.. లక్ష కోట్ల రూపాయలు.. పది వేల ఎకరాలు భూమి దోచుకున్న కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయం.