Revanth Reddy: ప్రగతిభవన్‌ను పేల్చేయండి.. కేసీఆర్ ఓ భూతం..! రేవంత్ మాటల వెనక అంత వ్యూహం ఉందా?
నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. అప్పుడే సలసలమంటోంది తెలంగాణ రాజకీయం. మాటలు, తూటాల్లా లేపడం కాదు.. బాంబుల్లా పేలుతున్నాయ్ ఇప్పుడు ! కొంపలో కుంపట్లతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడిన కాంగ్రెస్.. ఇప్పుడిప్పుడే కాస్త సెట్ అవుతోంది. రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టారు. సీనియర్లు కూడా మరో దారిలో నడక ప్రారంభించారు. కాంగ్రెస్‌లో అంతా కూల్ అనుకున్నట్లే ఉన్నాయ్ పరిస్థితులు. దీంతో బీఆర్ఎస్ టార్గెట్‌గా రేవంత్ మాటలకు పదును పెంచారు. ఇప్పుడు ప్రగతి భవన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత మంటలు పుట్టిస్తున్నాయ్.
భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా.. హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టిన రేవంత్.. ఇందులో భాగంగా ములుగు జిల్లాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ను పేల్చేయాలంటూ ఘాటు మాటలు వదిలారు. నక్సలైట్లు ప్రగతిభవన్ పేల్చేసినా ఎవరికీ అభ్యంతరం లేదని వివాదస్పద కామెంట్లు చేశారు. రేవంత్ మాటలు రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయ్. ఆయన మాటలపై బీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, అల్లర్లు సృష్టించేలా ప్రసంగించిన రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు కూడా!
ఇంత జరిగాక అయినా రేవంత్ తగ్గారా అంటే.. కేసీఆర్ భూతం అని ఆయనను బంధించి సీసాలో పెట్టాలంటూ మరింత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. రేవంత్ వ్యాఖ్యలను డీకోడ్ చేస్తే పక్కా వ్యూహం ఉంది అన్నది క్లియర్‌గా అర్థం అవుతోంది. జనాన్ని చూసిన ఊపులో రేవంత్ ఇలా మాట్లాడారు అని అనుకోవడానికి లేదు. అదే నిజం అయితే.. మళ్లీ కేసీఆర్‌ను భూతం అంటూ కామెంట్ చేసి ఉండరు బహుశా ! వరుస ఘటనలతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహంలో పడిపోయాయ్. గాంధీభవన్‌లో నాయకుల కొట్లాటతో.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అమాయకంగా గాల్లో దిక్కులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాదయాత్ర మొదలుపెట్టారు రేవంత్. రాహుల్ యాత్రకు ఇది కొనసాగింపు అని పైకి చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పార్టీలో జోష్ నింపడమే అసలు లక్ష్యం. అందులో భాగంగానే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్, బీజేపీతో కంపేర్ చేస్తే.. ఎన్నికల దూకుడు విషయంలో కాంగ్రెస్ స్లో ఉంది అనే మాటను బ్రేక్ చేసేలా రేవంత్ మాటలు వినిపించాయ్. పార్టీకి పొలిటికల్ అటెన్షన్ తీసుకురావడానికే ఈ మాటలు అన్నట్లు అనిపించాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఐతే కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద.. ప్రత్యర్థి రాజకీయ నేతగా ఎలాంటి విమర్శలు అయినా చేయొచ్చు.. ఐతే ప్రగతిభవన్ అనేది అధికార నివాసం, అంటే ప్రజల ఆస్తి.. దాన్ని కూల్చాలని.. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనే వాళ్లూ ఉన్నారు. ఏమైనా రాజకీయం ఇలానే చేయాలని ఏమీ లేదు. ప్రతీ యుద్ధంలో రాజకీయం ఉంటుంది.. రాజకీయం ఎప్పుడూ యుద్ధంలానే ఉంటుంది. ఆ యుద్ధం ఇకపై ఎలా ఉండబోతుందో రేవంత్ మాటలతో అర్థం అవుతోంది అనే చర్చ కూడా నడుస్తోంది..