REVANTH REDDY: పదేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదు: రేవంత్ రెడ్డి

శ్రీహరి సంగతి రాజయ్య చెప్పిండు.. రాజయ్య సంగతి శ్రీహరి చెప్పిండు. ఇద్దరూ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నోల్లే. ఇద్దరి జాతకాలు తెలుసు కాబట్టే ఉద్యోగం ఇచ్చి మధ్యలోనే ఊడగొట్టిండు. కేసీఆర్‌కే వీళ్లపై నమ్మకం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2023 | 03:16 PMLast Updated on: Nov 14, 2023 | 3:16 PM

Revanth Reddy Criticised Cm Kcr And Kadiam Srihari Rajaiah

REVANTH REDDY: అధికారంలో ఉన్న పదేళ్లలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. “ఒక ఆడబిడ్డ ఇక్కడ పోటీ చేస్తుంటే రాజయ్య, శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజయ్య, శ్రీహరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీహరి సంగతి రాజయ్య చెప్పిండు.. రాజయ్య సంగతి శ్రీహరి చెప్పిండు. ఇద్దరూ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నోల్లే. ఇద్దరి జాతకాలు తెలుసు కాబట్టే ఉద్యోగం ఇచ్చి మధ్యలోనే ఊడగొట్టిండు. కేసీఆర్‌కే వీళ్లపై నమ్మకం లేదు.

Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై చార్జిషీట్.. అఫిడవిట్‌లో తప్పులు.. మూడు కాలేజీల్లో ఇంటర్..

అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారు. స్టేషన్ ఘనపూర్‌కు వంద పడలకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ తెచ్చే బాధ్యత నాది. పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. బీఆరెస్ ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే.. కాంగ్రెస్ 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసిందేం లేదు. తన కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకుండు. దద్దమ్మ దయాకర్ రావును మంత్రిని చేసిండు. సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుంటుంటే.. ఈ దద్దమ్మ దయాకర్ రావు వాళ్లను ఖాళీ సీసాలు అమ్ముకోమంటారా? రాష్ట్రంలో ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి కేసీఆర్ పాలనలో దాపురించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది. లేకపోతే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు అడవి బాట పట్టే పరిస్థితి వస్తుంది. నిరుద్యోగ యువతి ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంటే.. ఈ ప్రభుత్వం ఆ కుటుంబం పరువును బజారుకీడ్చింది. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాక శిరచ్ఛేదనం జరిగింది. పాపాల భైరవుడు కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో శిరచ్ఛేదనం జరగాల్సిందే. బీఆరెస్ ప్రభుత్వం నేల కూలాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 అందిస్తాం.

రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తాం. రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. ఆనాడు 9గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. స్టేషన్ ఘనపూర్‌లో ఇందిరమ్మను 25వేల మెజారిటీతో గెలిపించండి. ఇక్కడ ఇందిరమ్మను గెలిపిస్తే అక్కడ సోనియమ్మను గెలిపించినట్లే” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.