Revanth Reddy : కామారెడ్డిలో భూకబ్జాల కోసమే కేసీఆర్ పోటీ : రేవంత్ రెడ్డి
పచ్చని పంట పొలాలతో ఉన్న కామారెడ్డిలో భూములు కబ్జా పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మీ భూములను కాపాడటానికే ఇక్కడ పోటీకి దిగాను అన్నారు.
Revanth fire on KCR : సిద్దిపేట, సిరిసిల్ల కాదని కేసీఆర్ కామారెడ్డిలో పోటీకి దిగడానికి కారణం… ఇక్కడి రైతుల భూములు గుంజుకునేందుకే అని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దోమకొండలో రోడ్ షోలో పాల్గొన్నారు రేవంత్. ఎన్నికలున్నాయనే మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా రద్దు చేసిండు. ఎన్నికల తరువాత మళ్ళీ మీ భూములను గుంజుకుంటాడని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ ను నమ్మడమంటే.. పాముకు పాలు పోసి పెంచినట్టే అన్నారు. కేసీఆర్ పాము లాంటి వాడు… ఓటు వేశారో.. మిమ్మల్ని కాటు వేస్తాడు… గుర్తుంచుకోండి అని అన్నారు రేవంత్. కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే తాను ఇక్కడ పోటీకి దిగినట్టు చెప్పారు. కేసీఆర్ గెలిచినా.. ఓడినా ఫామ్ హౌస్ లోనే పడుకుంటాడు.
పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్, ఇక్కడి ఎమ్మెల్యే ఇక్కడి జనాన్ని మోసం చేశారని ఆరోపించారు రేవంత్. పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలే, భూములకు పట్టాలు ఇవ్వలే… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడొచ్చి ఓటు వేయాలని కేసీఆర్ అడుగుతుండు. పదేళ్లలో గుర్తురాని అమ్మగారి ఊరు కోనాపూర్ ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు రేవంత్. ఏనాడూ గల్ఫ్ కార్మికులను, బీడీ కార్మికులను ఆదుకోలేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు.