REVANTH REDDY-BABU: బాస్‌తో మీటింగ్‌.. చంద్రబాబుతో సీఎం రేవంత్‌ రహస్య భేటీ..?

ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కడంకంటే ముందు వీళ్లిద్దరూ బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌లో రహస్యంగా భేటీ అయ్యారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారు. దాదాపు 2 గంటలు వీళ్లద్దరూ రహస్య మంతనాలు నడిపారంటూ చెప్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2024 | 04:26 PMLast Updated on: Mar 09, 2024 | 4:26 PM

Revanth Reddy Met Chandrababu Naidu Secretely Brs Criticising

REVANTH REDDY-BABU: టీడీపీ అధినేత చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారా..? రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాల గురించి చర్చించుకున్నారా..? కనీసం ఫొటోలు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు అంటే.. ఆ మీటింగ్‌ దేనికోసం..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై ఎక్కుపెడుతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు గురించి చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఎంపీ అభ్యర్థుల ఎన్నిక గురించి కాంగ్రెస్‌ హైకమాండ్‌తో చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లివచ్చారు.

Errabelli Dayakar Rao: మాజీ మంత్రి ఎర్రబెల్లికి షాక్‌.. కాంగ్రెస్‌లోకి ప్రధాన అనుచరుడు..!

అయితే ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కడంకంటే ముందు వీళ్లిద్దరూ బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌లో రహస్యంగా భేటీ అయ్యారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారు. దాదాపు 2 గంటలు వీళ్లద్దరూ రహస్య మంతనాలు నడిపారంటూ చెప్తున్నారు. కాంగ్రెస్‌లో జాయిన్‌ అవ్వకముందు రేవంత్ రెడ్డి కూడా టీడీపీలోనే ఉన్నారు. అలాంటి రేవంత్‌ రెడ్డి చంద్రబాబును కలిస్తే తప్పు లేదు. కానీ ఇప్పుడు ఆయన తెలంగాణ సీఎం పదవిలో ఉన్నారు. మరోపక్క చంద్రబాబు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో ఇప్పుడు రేవంత్‌ భేటీ కావడం.. అది కూడా ఎవరినీ అనుమతించకుండా రహస్యంగా మాట్లాడుకోవడం బీఆర్‌ఎస్‌ నేతలకు ఆయుధంగా మారింది. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలు రేవంత్‌.. చంద్రబాబుతో చర్చించారని.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్‌ పని చేస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి పోరాటం చేసి సాదించుకున్న ప్రత్యేక తెలంగాణను మళ్లీ ఆంధ్రాపాలకు చేతుల్లో పెట్టేందుకే రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటూ విమర్శిస్తున్నారు.

కానీ ఈ విషయంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. ఇద్దరూ ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి యాదృచ్ఛికంగా ఎయిర్‌పోర్ట్‌లో కలిశారా.. లేక కలిసేందుకే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అనుకోకుండా కలిస్తే ఓకే కానీ.. నిజంగానే చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్‌ పని చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి చిక్కులు తప్పవు అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో కాంగ్రెస్‌ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి మరి.