REVANTH Vs HARISH: పోతిరెడ్డిపాడుపై అసెంబ్లీలో రచ్చ.. హరీష్ వర్సెస్ రేవంత్.. మాటల యుద్ధం
పోతిరెడ్డిపాడు విషయంలో నిజంగా పోరాడింది అప్పటి పీసీసీ పి.జనార్దన్ రెడ్డి. అప్పుడు అధికార పక్షమైనప్పటికీ ఆయన రాజకీయ అంశాలు పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల హక్కుల కోసం తిరగబడ్డారు.
REVANTH Vs HARISH: తెలంగాణలో తొలిసారి ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో బదులిస్తోంది. తాజాగా శనివారం అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్, రేవంత్ వర్సెస్ హరీష్ రావుగా మాటల యుద్ధం నడిచింది. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర విమర్శుల చేసుకున్నాయి. బీఆర్ఎస్ తరఫున హరీష్ రావు మాట్లాడారు. “పోతిరెడ్డిపాడు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అన్యాయం చేస్తుంటే అడగాల్సిన తెలంగాణ నేతలు సత్కారాలు చేశారు. అలాంటి వాళ్లను ఇక్కడ సభలో కీర్తిస్తూ, బానిసలకు బానిసలుగా మిగులుతున్నారు” అంటూ కేటీఆర్ విమర్శించారు.
KTR Vs REVANTH REDDY: అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్.. విరుచుకుపడ్డ సీఎం
దీనికి రేవంత్ రిప్లై ఇచ్చారు. “పోతిరెడ్డిపాడు విషయంలో నిజంగా పోరాడింది అప్పటి పీసీసీ పి.జనార్దన్ రెడ్డి. అప్పుడు అధికార పక్షమైనప్పటికీ ఆయన రాజకీయ అంశాలు పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల హక్కుల కోసం తిరగబడ్డారు. పోతిరెడ్డిపాడు విషయంలో అన్యాయం చేయొద్దని కొట్లాడిన క్రెడిట్ పీజేఆర్‌కే దక్కుతుంది. పోతిరెడ్డిపాడు విషయంలో పీజేఆర్ మినహా పోరాటం చేసిన వాళ్లు ఎవరూ లేరు” అని రేవంత్ అన్నారు. అయితే, సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. “పోతిరెడ్డిపాడు విషయంలో సభకు సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ విషయంలో రికార్డులను సరిచేయాలి. మా నాయకులే కొట్లాడారని ఆ రోజు రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో ఉన్న మంత్రులు మాట్లాడలేదని చెప్పడం సరికాదు. దీనిపై ప్రత్యేకంగా చర్చ పెడితే అన్నింటినీ చర్చించడానికి మేం సిద్ధం. రికార్డులు, వీడియో ఫుటేజ్ కూడా ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో ఉన్న ఆరుగురు మంత్రులం 14 నెలలకే రిజైన్ చేశాం. రాజీనామాకు ఆరు కారణాలు చెబితే.. అందులో మొదటి కారణం పోతిరెడ్డిపాడు అంశమే.
పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీళ్లు ఎత్తుకుపోతున్నారని చెప్పాం. తెలంగాణకు రావాల్సిన నీళ్లను సీమకు తరలించుకుపోతున్నందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు చెప్పాం. తెలంగాణను ముంచి పులిచింతల ప్రాజెక్టు కడుతున్నందుకు రాజీనామా చేస్తున్నాం అని వివరించాం. 610 జీవో అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసినందుకు, నక్సల్స్‌ను ఫేక్ ఎన్‌కౌంటర్ చేస్తున్నందుకు రాజీనామా చేస్తున్నామని ఆనాడు వెల్లడించాం. 2004లో అసలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందే టీఆర్‌ఎస్ పార్టీ. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తేనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం” అని హరీష్ రావు అన్నారు.