కెప్టెన్ గా రోహిత్@50, హిట్ మ్యాన్ అరుదైన రికార్డ్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో అరుదైన మైలురాయి అందుకున్నాడు. సారథిగా 50 మ్యాచ్ లు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ తో జరుగుతోన్న రెండో వన్డేతో రోహిత్ ఈ ఘనత సాధించాడు.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో అరుదైన మైలురాయి అందుకున్నాడు. సారథిగా 50 మ్యాచ్ లు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ తో జరుగుతోన్న రెండో వన్డేతో రోహిత్ ఈ ఘనత సాధించాడు. కెప్టెన్ గా రోహిత్ కు ఇది 50వ మ్యాచ్. తద్వారా వన్డేల్లో 50కు పైగా మ్యాచ్ లకు సారథ్యం వహించిన 8వ క్రికెటర్ గా నిలిచాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 200 మ్యాచులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ తర్వాత మహ్మద్ అజారుద్దీన్ 174, సౌరవ్ గంగూలీ 146, విరాట్ కోహ్లీ 95, రాహుల్ ద్రవిడ్ 79, కపిల్ దేవ్ 74, సచిన్ తెందుల్కర్ 73 ఉన్నారు. కాగా, వన్డేల్లో రోహిత్ శర్మ తొలి సారి 2017లో సారథ్యం వహించాడు. దాదాపు 8 ఏళ్ళ నుంచీ సారథిగా హిట్ మ్యాన్ తనదైన ముద్రవేశాడు. గత ఏడాది రోహిత్ సారథ్యంలోనే టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది.
కాగా బెస్ట్ విన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. 72.9 శాతంతో భారత్ తరఫున మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 69.8 శాతంతోనూ, ధోనీ 58.2 శాతంతోనూ, రాహుల్ ద్రవిడ్ 56 శాతంతోనూ ఉన్నారు.
వన్డే క్రికెట్ లో రోహిత్ కెప్టెన్ గా ఇప్పటివరకు 35 విజయాలను అందించాడు. మరో 12 వన్డేల్లో ఓటమిని అందుకోగా, ఒక మ్యాట్ టై అయింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 2018 వన్డే ఆసియా కప్ ను టీమిండియా గెలిచింది. ఈ టోర్నీ ఫైనల్ లో బంగ్లాదేశ్ ను ఓడించి విజయం సాధించింది. అలాగే వన్డేల్లో భారత్ తరఫున కెప్టెన్ గా 2 వేలకుపైగా పరుగులు చేసిన ఏడో క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు 2206 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ ఖాతాలో 20కుపైగా హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే కొంత కాలంగా రోహిత్ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమవుతున్నాడు. ఇటీవల న్యూ జిలాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టు సిరీస్‌లలో విఫలమయ్యాడు. అంతకుముందు జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ తేలిపోయాడు. ఫామ్‌ను అందిపుచ్చుకునేందుకు ముంబై తరఫున రంజీల్లో సయితం ఆడాడు. అయితే రంజీలో కూడా విఫలమయ్యాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో తొలి వన్డేలో కూడా తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ కూడా అతనితో మాట్లాడినట్టు తెలుస్తోంది.