రోహిత్ , గిల్ ఔట్, ఓపెనర్ గా జైస్వాల్ కు జోడీ ఎవరు ?
ఆస్ట్రేలియా టూర్ లో మరోసారి ఆధిపత్యం కనబరచాలనుకుంటున్న టీమిండియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందే సమస్యలు వెంటాడుతున్నాయి. రెండో సారి తండ్రి అయిన కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ వేదికగా జరిగే టెస్టుకు దూరం కానున్నాడు.
ఆస్ట్రేలియా టూర్ లో మరోసారి ఆధిపత్యం కనబరచాలనుకుంటున్న టీమిండియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందే సమస్యలు వెంటాడుతున్నాయి. రెండో సారి తండ్రి అయిన కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ వేదికగా జరిగే టెస్టుకు దూరం కానున్నాడు. మరికొన్ని రోజులు కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు. అయితే రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. మ్యాచ్ సిమ్యులేషన్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటనవేలుకు గాయమైంది. స్కానింగ్‌లో ఫ్రాక్చర్ అయినట్లుగా తెలిసిందని సమాచారం. టాప్ ఆర్డర్‌లో రోహిత్, గిల్ లేకపోవడం టీమిండియాకు కోలుకోలేని ఎదురుదెబ్బగానే చెప్పాలి. వీరిద్దరూ లేకపోవడంతో టాపార్డర్ కాంబినేషన్ క్లిష్టంగా మారింది.
ఈ సిరీస్ కోసం బ్యాకప్ ఓపెనర్ గా తీసుకున్న అభిమన్యు ఈశ్వరన్ కంగారూల గడ్డపై తేలిపోవడం భారత జట్టును మరింత కలవరపెడుతోంది. మరో బ్యాటర్‌ను తొలి టెస్టుకు ఎంపికచేయాలని బీసీసీఐ భావిస్తోంది. దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్‌లలో ఒకరిని జట్టులోకి తీసుకొవాలని చూస్తోంది. భారత్-ఏ జట్టు తరఫున పడిక్కల్ ఫర్వాలేదనిపించాడు. . మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన చేశాడు. స్వల్పంగా గాయపడిన కే ఎల్ రాహుల్ ను ఓపెనర్ గా పంపే అవకాశం కూడా ఉంది.రాహుల్ ఓపెనర్‌గా వెళ్తే, అభిమన్యు వన్‌డౌన్‌లో రానున్నాడు. ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి కొనసాగనున్నాడు. పెర్త్ పిచ్ ఈ యువ ఆటగాళ్లకు పరీక్షగానే చెప్పాలి. ఆసీస్ ప్రధాన పేస్ ఎటాక్ అంతా బరిలోకి దిగుతుండగా…వారి బుల్లెట్స్ లాంటి బంతులను వీరంతా ఎలా కాచుకుంటారనేది చూడాలి. పుజారా, రహానే లాంటి టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్లు లేకపోవడం మన జట్టుకు మైనస్ పాయింట్. ఆ లోటును ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు కూడా ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్‌తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. దీంతో ఆ జట్టును కూడా వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ ఊరిస్తోంది.