ఎంత పెద్ద క్రికెటర్ అయినా కొన్నిసార్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటాడు... కపిల్ దేవ్ , కుంబ్లే, సచిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్ళు కూడా పేలవమైన ఫామ్ తో నిరాశపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి... ఫామ్ కోసం తంటాలు పడి మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చిన పరిస్థితులూ ఉన్నాయి... ప్రస్తుతం ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఉన్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ... దాదాపు ఏడాదిన్నర నుంచి హిట్ మ్యాన్ మెరుపులు కనిపించడం లేదు. ఏ ఫార్మాట్ లోనూ తనదైన ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన హిట్ మ్యాన్ ఇప్పుడు పరుగుల కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయితే రోహిత్ కంటే బుమ్రా, ఆకాశ్ దీప్ ఎక్కువ రన్స్ చేయడం వైరల్ గా మారింది. రిటైర్మెంట్ నిర్ణయం దాదాపుగా తీసుకుని మళ్ళీ వెనకడుగు వేసిన రోహిత్ శర్మ ఇప్పుడు ఫామ్ అందుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు. దీని కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్ అందిపుచ్చుకునే క్రమంలో రంజీ ట్రోఫీ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఈ నెల 23వ తేదీ నుంచి ఆరంభం కాబోయే రంజీ మ్యాచ్‌లల్లో రోహిత్ ముంబైకి ఆడే అవకాశముంది. దీనిలో భాగంగానే రంజీ క్యాంపులో రోహిత్ కనిపించాడు. ముంబై జట్టుతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆ జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు రోహిత్ హాజరయ్యాడు. పేలవ ఫామ్ కారణంగా హిట్ మ్యాన్ ను జట్టు నుంచి తప్పించే పరిస్థితులు వచ్చేశాయి. కెప్టెన్ కాబట్టే కొనసాగిస్తున్నారన్న విమర్శలు కూడా ఎక్కువైన నేపథ్యంలో ఫామ్ లోకి వచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. రంజీ ట్రోఫీ బరిలో దిగేందుకు.. వాంఖడేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేడియాల్లో వారం రోజుల పాటు ముంబయి జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. ఆ జట్టుతోనే కలిసి హిట్ మ్యాన్ ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటానని అధికారికంగా తమకు ముందే సమాచారం ఇచ్చినట్లు ఎంసీఎ వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగానే తొలిరోజు వాంఖడే స్టేడియంలో నెట్స్‌సెషన్ కు హిట్ మ్యాన్ హాజరయ్యాడు . ఇంకా ఈ ప్రాక్టీస్ సెషన్ లో అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ వంటి సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. దీంతో పదేళ్ళ తర్వాత రోహిత్ రంజీల్లో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. 2015 తర్వాత రోహిత్ రంజీలకు దూరమయ్యాడు. రంజీ కెరీర్ లో రోహిత్ 42 మ్యాచ్ లు ఆడి 3892 పరుగులు చేశాడు. దీనిలో 14 సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు ఫామ్ కోసం మళ్ళీ దశాబ్దం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ముంబై జట్టు జమ్మూ కాశ్మీర్ తో తలపడబోతోంది. రంజీల్లో ఫామ్ అందుకుంటే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు రోహిత్ మరింత బలం అనడంలో ఎటువంటి డౌట్ లేదు.[embed]https://www.youtube.com/watch?v=PsuiFMd4A-s[/embed]