దేశవాళీ క్రికెట్ లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీనే... ఇప్పుడంటే ఐపీఎల్ ప్రదర్శనతో యువ ఆటగాళ్ళు నేరుగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు కానీ ఒకప్పుడు టీమిండియాలో ప్లేస్ దక్కించుకోవాలంటే రంజీ ట్రోఫీలో ప్రదర్శనే ప్రామాణికం...దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించిన ఆటగాళ్ళనే జాతీయ జట్టులోకి ఎంపిక చేసేవారు.. అందుకే కపిల్,గవాస్కర్ వాళ్ళ కెరీర్ లో దేశవాళీ మ్యాచ్ లు కూడా ఎక్కువగానే ఉండేవి... చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ బీసీసీఐ ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన రోజే దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. గాయం నుంచి కోలుకున్న సీనియర్, జూనియర్ ప్లేయర్స్ ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడితేనే టీమిండియా ఎంపికలో పరిగణలోకి తీసుకుంటామని తేల్చి చెప్పాడు. బీసీసీఐ కూడా ఆదేశాలివ్వడంతో పలువురు క్రికెటర్లు దేశవాళీ టోర్నీలు ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రంజీ సీజన్ పలువురు స్టార్ ప్లేయర్స్ తో కళకళలాడనుంది. ఆస్ట్రేలియా టూర్ లో నిరాశపరిచిన రిషబ్ పంత్, శుభమన్ గిల్,కెెఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ వంటి యువ క్రికెటర్లందరూ వచ్చే రంజీ సీజన్ లో ఆడనున్నారు. మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు రంజీ మ్యాచ్ లే వారందరికీ గొప్ప అవకాశం. మరికొందరు ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ కారణంగా రంజీలకు దూరమవగా.. కొందరు సీనియర్ ప్లేయర్స్ విషయంలో క్లారిటీ లేదు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా రంజీలు ఆడాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే రోహిత్ ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో అతను రంజీలు ఆడే అవకాశముందని తెలుస్తోంది. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దిల్లీ ప్రాబబుల్స్ లో పంత్ తో పాటు కోహ్లీకి కూడా చోటు ఇచ్చింది. కానీ విరాట్ ఆడతాడా లేదా అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫామ్ లోకి వచ్చేందుకు రంజీలు మంచి అవకాశమని అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ గత కొన్నేళ్ళుగా సీనియర్ ప్లేయర్స్ కు మినహాయింపులివ్వడమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు ఆటగాళ్ళను ఒకలా, మరికొందరిని మరోలా చూడడం మానేయాలని కోరుతున్నారు. టీమిండియాలో స్టార్ కల్చర్ కు ముగింపు పలికితే మంచి ఫలితాలు వస్తాయని ఇటీవల హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ రంజీలు ఆడకపోవడానికి బలమైన కారణాలు ఏమీ కనిపించడం లేదని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. కనీసం ఒకటిరెండు మ్యాచ్ లు ఆడితే మంచిదే కదా అంటూ అభిప్రాయపడుతున్నాయి. బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం జాతీయ జట్టుకు మ్యాచ్ లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. మరి కోహ్లీకి ఏం ప్రత్యేక వెసులుబాటు ఉందో..దీనిని ఎందుకు పాటించడం లేదోనని పలువురు మాజీలు ప్రశ్నిస్తున్నారు. గాయాలు, ఫిట్ నెస్ సమస్యలు ఉంటే తప్ప దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండాలని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. ఇప్పుడు రోహిత్ కూడా ఆడడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న వేళ విరాట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. కోహ్లీ చివరిసారిగా 2012లో రంజీ మ్యాచ్ లు ఆడాడు. రోహిత్ 2015లో చివరిసారిగా రంజీల్లో కనిపించాడు. మిగిలిన ఆటగాళ్ళలో చాలా మంది కూడా దేశవాళీ క్రికెట్ ఆడి కనీసం ఎనిమిదేళ్ళు దాటిపోయింది.[embed]https://www.youtube.com/watch?v=Ef3Cfrpm1P4[/embed]