రోహిత్, కోహ్లీ, రాహుల్ పని అయిపోయింది… టీమిండియాకు సీనియర్స్ కావలెను
భారత క్రికెట్ కు ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ అవసరం ఉంది... అదేంటి జట్టులో సీనియర్లు చాలా మందే ఉన్నారు కదా అనుకుంటున్నారా... నిలకడగా ఆడే సీనియర్లు కావాలి... ఫార్మాట్ కు తగ్గట్టు ఆడే సీనియర్లు కావాలి... టెస్టుల్లో సుధీర్ఘంగా బ్యాటింగ్ చేసే సీనియర్లు కావాలి...
భారత క్రికెట్ కు ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ అవసరం ఉంది… అదేంటి జట్టులో సీనియర్లు చాలా మందే ఉన్నారు కదా అనుకుంటున్నారా… నిలకడగా ఆడే సీనియర్లు కావాలి… ఫార్మాట్ కు తగ్గట్టు ఆడే సీనియర్లు కావాలి… టెస్టుల్లో సుధీర్ఘంగా బ్యాటింగ్ చేసే సీనియర్లు కావాలి… ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్ లు ముగిసిన తర్వాత సగటు అభిమాని కోరుకుంటోంది ఇదే… గత దశాబ్దానికి పైగా భారత క్రికెట్ ను నడిపిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల శకానికి త్వరలోనే తెరపడబోతోంది… ఆసీస్ టూర్ లో వీరిద్దరి ఫ్లాప్ షో తర్వాత అందరి అభిప్రాయం ఇదే…ఒకవిధంగా చెప్పాలంటే రిటైర్మెంట్లపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందన్న అభిప్రాయానికి వచ్చేశారు. మెల్ బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ , కోహ్లీ ఔటైన తర్వాత వీరి టైమ్ అయిపోయిందని చాలా మంది తేల్చేస్తున్నారు.
ఈ సిరీస్ లో ఏమాత్రం స్థాయికి తగినట్టు ఆడని రోహిత్ , కోహ్లీ నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో 340 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు అండగా నిలవాల్సిన సీనియర్ బ్యాటర్లు పేలవ బ్యాటింగ్‌తో చేతులెత్తేశారు.ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ 9 రన్స్కే స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేరితే…. విరాట్ కోహ్లీ మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకే ఔటయ్యాడు. స్టార్ బౌలింగ్‌లో ఐదో స్టంప్ లైన్ బంతిని వెంటాడి పెవిలియన్ చేరాడు. దీంతో ఈ ఇద్దరి స్టార్ ప్లేయర్స్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ టైమ్ అయిపోయిందని, రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఇదేనంటూ కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ అయితే అటు కెప్టెన్‌గా కూడా తడబడుతున్నాడు.
గత 15 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అది కూడా న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేశాడు. ఆసీస్ పర్యటనలో తొలి టెస్ట్‌కు రోహిత్ దూరంగా ఉండగా.. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. రెండో మ్యాచ్‌కు అతను అందుబాటులోకి రాగా.. భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ 3, 6 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. మూడో టెస్ట్‌లో 10 పరుగులే చేసిన రోహిత్.. తాజా మ్యాచ్‌లో3, 9 రన్సే చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు రికార్డుల రారాజుగా పేరున్నవిరాట్ కోహ్లీ సైతం ఆసీస్ టూర్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. గత 17 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. తన బ్యాటింగ్ శైలికి సెట్ అయ్యే టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ తడబడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.. ముఖ్యంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ డెలివరీ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఈ పర్యటనను ఘనంగా ప్రారంభించిన కోహ్లీ.. ఆ జోరును కొనసాగించలేకపోయాడు. పింక్ బాట్ టెస్ట్‌లో 7, 11 పరుగులే చేసిన కోహ్లీ.. గబ్బాలో 3 పరుగులకే వెనుదిరిగాడు. తాజా మ్యాచ్‌లో 36, 5 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే కోహ్లీ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసి కుర్రాళ్ళకు అవకాశమివ్వాలని పలువురు కోరుతున్నారు. అటు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా కుర్రాళ్ళను అన్ని ఫార్మాట్లకు తగ్గట్టు రెడీ చేయాలని కూడా సూచిస్తున్నారు. ఫార్మాట్ కో టీమ్ పైనా ఫోకస్ పెట్టాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ , టీ ట్వంటీ మాయ నుంచి బయటపడి ఏ ఫార్మాట్ లోనైనా నిలకడగా రాణించే యువ క్రికెటర్లకు అవకాశమివ్వాలని సూచిస్తున్నారు.