Rohith Sharma: నడిమిట్ల నువ్వేందిరా కెమెరామెన్ మీద గరం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి కెమెరా మెన్‌పై చికాకు పడ్డాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి కెమెరా మెన్‌పై చికాకు పడ్డాడు. గతంలో ఒకసారి ఇలాగే తనను రికార్డు చేస్తున్న కెమెరామెన్‌పై రోహిత్ చికాకు పడిన సంగతి తెలిసిందే. భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ మొదలవడానికి ముందు కూడా వర్షం పడింది. ఆ తర్వాత భారత బ్యాటింగ్ చేస్తుండగా ఐదో ఓవర్ వద్ద కూడా వర్షం పడింది. దీంతో మ్యాచ్‌ను మధ్యలో అంపైర్లు ఆపారు.
ఈ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ డగౌట్‌కు వెళ్లాడు. అక్కడి వరకు అతన్ని ఫాలో అయిన కెమెరామెన్.. డగౌట్‌లో కూడా రోహిత్‌ను రికార్డు చేస్తూనే ఉన్నాడు. ఇది చూసిన రోహిత్.. ‘ఇంకా ఎందుకయ్యా? ఇక కెమెరా ఆపు’ అంటూ సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. సాధారణంగా ఇలా ఆటగాళ్లు డగౌట్ చేరినా కూడా కెమెరామెన్లు వాళ్లను ఫాలో అవుతారు. కాసేపు రికార్డు చేసిన తర్వాత మిగతా విషయాలపై ఫోకస్ పెడతారు. అదే అలవాటులో రోహిత్‌ను సదరు కెమెరామెన్ ఫాలో అయ్యాడు. కానీ రోహిత్‌కు ఇది పెద్దగా నచ్చలేదు అనుకుంటా. అందుకే కెమెరా ఆపేయాలని అడిగాడు. కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి షహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
షహీన్ వేసిన ఇన్‌స్వింగర్‌ను అంచనా వేయలేకపోయిన అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలాగే కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ కూడా తేలిపోయారు. ఇలాంటి సమయంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుతమైన పోరాటంతో జట్టును ఆదుకున్నారు. కానీ వర్షం వల్ల ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ పూర్తిగా రద్దయింది. దీంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.