ముంబైతోనే రోహిత్ శర్మ రిటెన్షన్ లిస్టులో నలుగురే
ఐపీఎల్ మెగా వేలం వచ్చే నెలలో జరగనుండగా... ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలువురు స్టార్ ప్లేయర్స్ ను కొన్ని ఫ్రాంచైజీలు వేలంలోకి వదిలేస్తుండగా... కొందరిని రిటైన్ చేసుకుంటున్నాయి.
ఐపీఎల్ మెగా వేలం వచ్చే నెలలో జరగనుండగా… ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలువురు స్టార్ ప్లేయర్స్ ను కొన్ని ఫ్రాంచైజీలు వేలంలోకి వదిలేస్తుండగా… కొందరిని రిటైన్ చేసుకుంటున్నాయి. అనూహ్యంగా ముంబై ఇండియన్స్ రిటెన్షన్ జాబితాలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరున్నట్టు సమాచారం. కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాకు అప్పగించడంపై అసంతృప్తితో ఉన్న రోహిత్ శర్మ జట్టును వీడుతాడని జోరుగా ప్రచారం జరిగింది. వేలంలో కొన్ని ఫ్రాంచైజీలు కూడా హిట్ మ్యాన్ ను కొనేందుకు ఎదురుచూస్తున్నాయి. ఇక వీడటమే మిగిలిందని అంతా అనుకున్నారు. కానీ ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగేందుకు రోహిత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీకి మించిన ఆఫర్ ఏదో రోహిత్‌కు ఇచ్చినట్లు సమాచారం.
రోహిత్ శర్మ ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపాడు. జట్టును అత్యంత సక్సెస్ ఫుల్ గా లీడ్ చేసిన హిట్ మ్యాన్ సారథ్యంలోనే ముంబై 2013, 2015, 2017, 2019, 2020లలో టైటిల్ గెలుచుకుంది. అయితే గత సీజన్ కు ముందు గుజరాత్ సారథిగా ఉన్న హార్థిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకొచ్చిన ముంబై యాజమాన్యం రోహిత్ పై వేటు వేసి అతనికి పగ్గాలు అప్పగించింది. దీనిపై రోహిత్ పైకి చెప్పకున్నా కాస్త అసంతృప్తిగానే కనిపించాడు. అదే సమయంలో రోహిత్ ఫ్యాన్స్ స్టేడియంలో హార్థిక్ ను టీజ్ చేయడం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. దీనికి తగ్గట్టే గత సీజన్ ముంబై పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రాలను రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాండ్యా ఆల్ రౌండర్ గా కీలకం కానున్నాడు. ఇక మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ ను ముంబై వదులుకునే అవకాశాలు లేవు. అలాగే స్టార్ పేసర్ బూమ్రాను కూడా ముంబై రిటైన్ చేసుకోవడం ఖాయం. అయితే వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్ ను రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా తీసుకునే అవకాశాలున్నాయి, అలాగే హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మను సైతం ఆర్టీఎం ఆప్షన్ ద్వారానే దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తుంది. వరుసగా ముగ్గురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలనుకుంటే 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగో , ఐదో ఆటగాడు కావాలనుకుంటే మళ్లీ 18 కోట్లు, 14 కోట్లు కేటాయించాలి. రిటెన్షన్ జాబితాను ప్రకటించడానికి అక్టోబర్ 31ని బీసీసీఐ డెడ్ లైన్ గా విధించింది.