తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. తాను ఆటకు వీడ్కోలు పలకడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశాడు. అదే సమయంలో తనపై కొందరు చేస్తున్న విమర్శకులకు సైతం గట్టిగా ఇచ్చిపడేశాడు. నా రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకునే తెలివి తనకు ఉందంటూ చురకలు అంటించాడు. నిజానికి ఈ సిరీస్ ఆరంభమైనప్పటి నుంచి రోహిత్ బ్యాటింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. వరుస వైఫల్యాలతో టెస్టు క్రికెట్‍కు ఇక గుడ్‍బై చెబుతాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆస్ట్రేలియాతో కీలకమైన ఐదో టెస్టు తుదిజట్టులో రోహిత్ శర్మ లేడు. అతడే తప్పుకున్నాడని కెప్టెన్‍గా బాధ్యతలు తీసుకున్న స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా చెప్పాడు. ఫామ్‍లో లేని కారణంగా హిట్‍మ్యాన్‍పై మేనేజ్‍మెంట్ వేటువేసిందని, అతడు రిటైర్మెంట్ పలికినట్టేనంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఐదో టెస్టు రెండో రోజు లంచ్ బ్రేక్ లో కామెంటేటర్లతో రోహిత్ శర్మ మాట్లాడాడు. తన రిటైర్మెంట్‍పై వస్తున్న రూమర్ల గురించి స్పందించాడు. తాను సరైన ఫామ్‍లో లేనందునే ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు ఆడడం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. పరిస్థితులు మారతాయని తాను కచ్చితంగా నమ్ముతున్నట్టు వ్యాఖ్యానించాడు. తాను ఇప్పట్లో రిటైర్ అవనని స్పష్టంగా చెప్పేశాడు. జట్టు నుంచి తప్పించారా, విశ్రాంతి ఇచ్చారా అనే ప్రశ్నకు కూడా రోహిత్ జవాబిచ్చాడు. ఎవ్వరూ తప్పించలేదని, తానే తప్పుకుంటానని సెలెక్టర్లు, కోచ్‍కు చెప్పినట్టు వెల్లడించాడు. ఇదిలా ఉంటే తన రిటైర్మెంట్‍పై వస్తున్న రూమర్లపై రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ల్యాప్‍టాప్ తీసుకొని, పెన్ను పేపర్ పెట్టుకొని బయటకూర్చునే వారు.. తన రిటైర్మెంట్ ను నిర్ణయించలేరన్నాడు. ఆ నిర్ణయం తానే తీసుకోవాలన్నాడు. తాను ఇప్పట్లో టీమిండియాకు వీడ్కోలు చెప్పనని, ఈ మ్యాచ్ నుంచి మాత్రమే తప్పుకున్నానని రోహిత్ చెప్పేశాడు. తాను మళ్లీ సత్తాచాటగలననే నమ్మకం ఉందన్నాడు. అలాగే మైక్ పట్టుకుని మాట్లాడడం ఈజీగానే ఉంటుందని, గ్రౌండ్ లో ఉన్న ఆటగాడికే ఎలా ఆడాలో తెలుస్తుందంటూ మాజీ క్రికెటర్లకు సైతం కౌంటర్ ఇచ్చాడు. మొత్తం మీద రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వడం లేదంటూ స్పష్టం చేయడంతో అతని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.[embed]https://www.youtube.com/watch?v=ubb_4qXdjbM[/embed]