వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయినట్టు సమాచారం. సిడ్నీ టెస్టుతో రెడ్ బాల్ కెరీర్ ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లతో రోహిత్ మాట్లాడినట్టు కథనాలు వస్తున్నాయి. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరకుంటే.. సిడ్నీ టెస్ట్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్టు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఒకవేళ భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరితే మాత్రం అప్పటి వరకూ కొనసాగుతాడని చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా రోహిత్ పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. టెస్టుల్లో అయితే హిట్ మ్యాన్ ఆటతీరు అత్యంత దారుణంగా ఉంది. గత 15 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. తాజా ఆసీస్ పర్యటనలోనూ దారుణంగా విఫలమయ్యాడు. పేలవ బ్యాటింగ్‌తో అతను జట్టుకు భారమయ్యాడు. కెప్టెన్‌గానూ తడబడుతున్నాడు. కెప్టెన్ కాకుంటే రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు కూడా దక్కేది కాదని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్, ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అటు కెప్టెన్సీ పరంగానూ హిట్ మ్యాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెటప్ వంటి విషయాల్లో రోహిత్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అలాగే సొంతగడ్డపై కివీస్ చేతిలో వైట్ వాష్ పరాభవం కూడా అతనిపై మరింత ఒత్తిడి పెంచింది. కాగా ఆసీస్ టూర్ లో బాక్సింగ్ డే టెస్టుకు ముందు చీఫ్ సెలక్టర్ అగార్కర్ సైతం రిటైర్మెంట్ పై రోహిత్ తో మాట్లాడినట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-2తో వెనుకబడింది. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. సిడ్నీ టెస్ట్ గెలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2-2తో టీమిండియా సమం చేయాలి. అప్పుడు శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్ డ్రా అయినా.. ఒక మ్యాచ్‌లో ఆసీస్ ఓడినా.. భారత్ ఫైనల్ చేరుతోంది. కాగా ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో స్థానం కోసం ఆసీస్, భారత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్రీలంక పర్యటనలో స్పిన్ వికెట్‌పై ఆసీస్ గెలవడం కష్టమే. కాబట్టి సిడ్నీ టెస్ట్‌లో టీమిండియా గెలవాలి. ఈ మ్యాచ్ ఓడితే.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే 2013లో విండీస్ పై టెస్ట్ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటి వరకూ 67 మ్యాచ్ లు ఆడాడు. 40.58 యావరేజ్ తో 4302 పరుగులు చేయగా... దీనిలో 12 సెంచరీలు, 1 డబుల్ సెంచరీతో పాటు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటిస్తే భారత టెస్ట్ జట్టు సారథిగా పేస్ బౌలర్ బుమ్రాను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.