రూ.450 కోట్ల స్కామ్, స్టార్ క్రికెటర్లకు సీఐడీ సమన్లు
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ చిక్కుల్లో పడ్డాడు.. ఓ ఫైనాన్షియల్ స్కామ్ లో గిల్ కు గుజరాత్ సీఐడీ సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో మరో ముగ్గురు క్రికెటర్లకు కూడా సమన్లు ఇచ్చింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ చిక్కుల్లో పడ్డాడు.. ఓ ఫైనాన్షియల్ స్కామ్ లో గిల్ కు గుజరాత్ సీఐడీ సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో మరో ముగ్గురు క్రికెటర్లకు కూడా సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. గుజరాత్ కు చెందిన బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలో గిల్ తో పాటు సాయిసుదర్శన్, రాహుల్ తెవాటియా, మొహిత్ శర్మ పెట్టుబడులు పెట్టారు. వీరంతా ఐపీఎల్ లో గుజరాత్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గిల్ కోటి పైనే పెట్టుబడి పెట్టగా… మిగిలిన ముగ్గురు క్రికెటర్లు 10 లక్షల నుంచి కోటి వరకూ ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సదరు కంపెనీ భారీ వడ్డీ ఆశచూపి ప్రజల దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్టు గుర్తించారు. అధిక వడ్డీకి ఆశపడిన చాలా మంది ఈ కంపెనీకి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టారు. లక్షల్లో మొత్తం కట్టిన చాలా మందికి ఖరీదైన వాచీలు, ఎల్ఈడీ టీవీ., ఫ్రిజ్ వంటి వాటిని గిఫ్టులుగా ఇచ్చారు. దీంతో మరింతమంది దీనికి ఆకర్షితులై భారీ మొత్తాలు చెల్లించారు.
అయితే గత కొన్నినెలలుగా పేమెంట్లు నిలిచిపోవడం, చెల్లింపుల చేయకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 450 కోట్ల వరకూ స్కామ్ జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో గుజరాత్ సీఐడీ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా సంస్థ ఛైర్మన్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ విచారణలో భాగంగానే గిల్ తో పాటు మిగిలిన ఆటగాళ్ళకు సమన్లు జారీ చేసింది. అయితే కంపెనీతో వీరంతా నేరుగా సంబంధాలు కలిగి ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అందరి లానే పెట్టుబడులు పెట్టారా… లేక స్కామ్ లో ఇన్వాల్వ్ మెంట్ ఉందా అన్న కోణంలోనూ సీఐడీ విచారిస్తోంది. గిల్ ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడుతూ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతను విచారణకు హాజరయ్యే ఛాన్సుంది. మిగిలిన క్రికెటర్లు భారత్ లోనే ఉండడంతో ఈ లోపే విచారణకు హాజరవుతారని భావిస్తున్నారు.