Anju Yadav: సీఐ అంజూ యాదవ్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వబోతోందా ?
జనసేన కార్యకర్తపై.. శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న ఘటన.. ఇప్పుడు రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఓ కార్యకర్తకు ఎదురైన అనుభవంపై.. పార్టీ అధినేతే రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ తిరుపతి వెళ్లి.. అంజూ యాదవ్ మీద ఫిర్యాదు చేశారు. కార్యకర్త మీద చేయి చేసుకోవడం అంటే.. ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్లే అని పవన్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంలో మంటలు రేపుతున్నాయ్.

Rumors of Srikalahasti Circle Inspector Anjuyadav getting into politics are doing the rounds
పవన్ కంప్లైంట్ మీద మంత్రులు, వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. సీఐ వ్యవహారంలో ఇప్పుడు జనసేన వర్సెస్ వైసీపీ జరుగుతున్న యుద్ధం అంతా ఇంతా కాదు. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడో ప్రచారం ఏపీ రాజకీయవర్గాల్లో జోరు మీద సాగుతోంది. జనసేన కార్యకర్త చెంప చెల్లుమనిపించిన అంజు యాదవ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఈ సందేహాలు రావడం వెనక కూడా రకరకాల కారణాలు ఉన్నాయ్. సరిగ్గా నాలుగున్నరేళ్ల కింద.. ఇలా ఓ సీఐ రాజకీయనేతలను నిలదీసి ఎంపీ అయ్యారు. ఆయనే అనంతపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్. అప్పట్లో తాడిపత్రి సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఖాకీ వర్సెస్ ఖద్దర్ పోరు.. పాలిటిక్స్‌లో హీట్ పుట్టించాయ్.
మీసం తప్పి మరీ.. జేసీకి సవాల్ విసిరిన గోరంట్ల మాధవ్‌కు వైసీపీకి అండగా నిలబడింది. కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఇప్పుడు అంజూ యాదవ్ విషయంలోనూ అదే జరగబోతోందా అంటే.. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. జనసేన దూకుడుకు బ్రేక్ వేసే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వైసీపీ వదులుకోవాలని అనుకోవడం లేదు. ఇలాంటి సమయంలో అంజూ యాదవ్ ఇష్యూ.. వైసీపీకి ఆయుధంగా మారింది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలో ఫాలో అయిన స్ట్రాటజీనే ఇప్పుడు అంజూయాదవ్ విషయంలోనూ అమలు చేయాలని ఫ్యాన్ పార్టీ నేతలు భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఓ కార్యకర్తపై చేయిచేసుకున్న వ్యవహారంలో.. మంత్రుల నుంచి పార్టీలో కింది స్థాయి నేతల వరకు రియాక్ట్ కావడం చూస్తే అదే నిజం అనిపిస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ అభ్యర్థులను మార్చాలని జగన్ భావిస్తున్నారు. ఆ మార్పులో భాగంగా అంజూ యాదవ్‌ను అదృష్టం వరిస్తుందా అంటే.. ఏమో మరి ప్రస్తుతానికి అయితే చెప్పలేం !