Sudan Conflict: సూడాన్ సంక్షోభం వెనుక పుతిన్ కిరాయి సైన్యం.. ఆఫ్రికాను కబళిస్తున్న రష్యా.. అసలేం జరుగుతోంది?

యుక్రెయిన్-రష్యా-సూడాన్.. ఈ మూడు దేశాల్లో యుక్రెయిన్, సూడాన్‌లో యుద్ధం సాగుతోంది. దీనికి కర్త, కర్మ, క్రియ రష్యానే. ఇంకా చెప్పాలంటే పుతిన్‌తో నిత్యం అంటకాగుతూ కిరాయి సైన్యాన్ని నడిపిస్తున్న ఓ వ్యాపారసంస్థే దీనికి కారణం. దానిపేరే.. వ్యాగ్నర్ గ్రూప్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2023 | 07:23 PMLast Updated on: Apr 28, 2023 | 7:23 PM

Russias Wagner Group Could Fuel Conflict In Sudan

Sudan Conflict: 14 నెలల క్రితం.. రష్యా యుక్రెయిన్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్న రోజులు. ఏదో ఒక రోజు రష్యా యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించడం ఖాయమని ప్రపంచ దేశాలు భయపడుతున్న సమయం. సరిగ్గా అప్పుడే ఆఫ్రికా ఖండం నుంచి ఒక మిలిటరీ జనరల్ మాస్కోలో పర్యటించారు. కొంతమంది రష్యా ప్రముఖులతో చర్చలు జరిపారు. రెండు వారాల క్రితం.. సూడాన్ మిలిటరీ జనరల్స్ మధ్య అంతర్యుద్ధం మొదలైంది. సీన్ కట్ చేస్తే..
సరిగ్గా అదే సమయంలో సూడాన్ రాజధాని కార్టోమ్‌కు 200 కి.మీ దూరంలో ఉన్న ఎయిర్‌పోర్టులో రష్యా నుంచి వచ్చిన కమర్షియల్ విమానం ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నాయి. సూడాన్ అంతర్యుద్ధంలో పాల్గొంటున్న ఓ వర్గం ఆ ఆయుధాలను తాము చేర్చాలనుకున్న ప్రాంతానికి చేర్చింది. ఈ రెండు సందర్భాలను లోతుగా విశ్లేషిస్తే సూడాన్‌లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న మిలిటరీ పోరాటానికి, రష్యాకు ఏదో సంబంధం ఉందని అర్థమవుతోంది. ఇది సూడాన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు జరుగుతున్న ప్రయత్నంగా అనుకుంటే మనం పొరపాటే. సూడాన్ మిలిటరీ జనరల్ మాస్కో వెళ్లి వచ్చిన మరుసటి రోజే రష్యా యుక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టింది. అలాగే సూడాన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజులకే రష్యా నుంచి ఆయుధాలు సరఫరా అయ్యాయి. యుక్రెయిన్-రష్యా-సూడాన్.. ఈ మూడు దేశాల్లో యుక్రెయిన్, సూడాన్‌లో యుద్ధం సాగుతోంది. దీనికి కర్త, కర్మ, క్రియ రష్యానే. ఇంకా చెప్పాలంటే పుతిన్‌తో నిత్యం అంటకాగుతూ కిరాయి సైన్యాన్ని నడిపిస్తున్న ఓ వ్యాపారసంస్థే దీనికి కారణం. దానిపేరే.. వ్యాగ్నర్ గ్రూప్.

పుతిన్ షాడో ఆర్మీ.. వ్యాగ్నర్ గ్రూప్
మనదేశంలో ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఒక ఆరోపణ చేస్తూ ఉంటాయి. మిత్రుడు గౌతమ్ అదానీ ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా మోదీ ఆయనకు దేశాన్ని దోచిపెడుతున్నారని విమర్శలు గుప్పిస్తూ ఉంటాయి. పీఎంపై ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రధాన అస్త్రం మోదీ-అదానీ బంధమే. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కూడా అలాంటి స్నేహితుడే ఉన్నాడు. ఆయన పేరు యవజని ప్రిగోషిన్. 2014లో ఆయన ఏర్పాటు చేసిన కంపెనీ పేరే వ్యాగ్నర్ గ్రూప్. క్లుప్తంగా దీని గురించి చెప్పుకోవాలంటే ఇది రష్యాకు చెందిన ప్రైవేట్ పారామిలిటరీ కంపెనీ. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ వ్యక్తులు, సంస్థలకు ప్రైవేటుగా భద్రతను కల్పించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. కౌంటర్ మిలిటరీ ఆపరేషన్స్‌లో కూడా ఈ సంస్థ పాల్గొంటుంది. ఇదంతా బయటకు చెప్పుకోవడానికే. కానీ, ఈ సంస్థ మనుగడ వెనుక అసలు ఎజెండా వేరే ఉంది. అదే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేయడం. పుతిన్ అడుగులకు మడుగులు వొత్తే యవజని ప్రిగోషిన్.. రష్యా వెలుపల కూడా పుతిన్ ప్రయోజనాలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.


సూడాన్ సంక్షోభంలో వ్యాగ్నర్ పాత్ర
సంక్షోభం ఎలాంటిదైనా, దాని తీవ్రత ఎంతున్నా.. దాని నుంచి ప్రయోజనం పొందే వ్యక్తులు, వ్యవస్థలు కచ్చితంగా ఉంటాయి. దేశంపై ఆధిపత్యం కోసం ఇద్దరు మిలిటరీ జనరల్స్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంగా సూడాన్ సంక్షోభం పైకి కనిపిస్తున్నా.. దీని వెనుక వ్యాగ్నర్ గ్రూప్‌ను అడ్డం పెట్టుకుని పుతిన్ సాధిస్తున్న ప్రయోజనాలు వేరే ఉన్నాయి. సూడాన్‌లో ప్రధాన మిలిటరీకి.. పారామిలిటరీ దళం రాపిడ్ సపోర్ట్ ఫోర్సుకు మధ్య యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధంలో రాపిడ్ సపోర్టు ఫోర్సుకు మద్దతుగా నిలిచింది రష్యాకు చెందిన వ్యాగ్నర్ గ్రూప్. ఆర్ఎస్ఎఫ్‌కు నాయకత్వం వహిస్తున్న జనరల్ మహ్మద్ హమ్దన్ దగాలోకు వ్యాగ్నర్ గ్రూప్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపిన వ్యాగ్నర్ గ్రూప్.. పుతిన్ ఆదేశాలతో సూడాన్‌లో ఆర్ఎస్ఎఫ్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. మిలిటరీ జనరల్స్ మధ్య అగ్గి రాజుకుంటే దానిని చల్లార్చే ప్రయత్నం చేయకుండా ఒక వర్గానికి ఆయుధాలు సరఫరా చేస్తూ సంక్షోభం మరింత రగిలేలా చేస్తోంది రష్యా.
వ్యాగ్నర్‌కు రష్యాలో పనేంటి?
ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు వ్యాగ్నర్ గ్రూప్ ఆయుధాలు ఎందుకు సరఫరా చేయాలి? ఎక్కడో రష్యాలో పనిచేసుకోవాల్సిన వ్యాగ్నర్ గ్రూప్ సూడాన్‍లో అసలు అడుగెందుకు పెట్టింది? పారామిలిటరీ గ్రూప్‌నకు మద్దతివ్వడం ద్వారా రష్యాకు, పుతిన్‌కు కలిగే ప్రయోజనాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కొన్నేళ్లుగా ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న పరిణామాలను లోతుగా అర్థం చేసుకోవాలి. రష్యా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఆఫ్రికా దేశాల వ్యవహారాల్లో తలదూర్చడానికి ప్రధాన కారణం.. అక్కడి సహజ సంపద, ప్రకృతి ప్రసాదించిన వనరులు. సూడాన్‌నే తీసుకుంటే ఆ దేశం నిండా ఎన్నో బంగారు గనులు ఉన్నాయి. ముడి బంగారాన్ని తవ్వితీయడం నుంచి దానిని ప్రాసెస్ చేసి, దేశం దాటించడం వరకు అంతా రష్యా కనుసన్నల్లోనే జరుగుతుంది.
సహజ వనరులను దోచుకుంటుంటే సూడాన్ ఏం చేస్తోంది?
ఇక్కడే అసలు రాజకీయం, మిలిటరీ పాలకుల ప్రయోజనాలు ముడి పడి ఉన్నాయి. సూడాన్‌లో ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి డెమొక్రటిక్ సిస్టమ్‌ను సర్వనాశనం చేసిన ఇద్దరు మిలిటరీ జనరల్స్ దేశాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం అన్నది సూడాన్‌లో ఎప్పటికీ ఉండకూడదని, దేశాన్ని తామే పరిపాలించాలన్నది వీళ్ల అభిమతం. అందులో భాగంగా తమకు మద్దతిచ్చే విదేశీ శక్తులతో కూడా చేతులు కలిపేందుకు వెనుకాడరు. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అధినేత జనరల్ మహ్మద్ హమ్దన్ దగాలో ఈ విషయంలో ముందున్నారు. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించబోతుందన్న విషయాన్ని తెలుసుకున్న దగాలో ప్రత్యేక విమానంలో మాస్కో వెళ్లి పుతిన్‌ను కలిశారు. ఆయనతో పాటు టన్నుల కొద్దీ బంగారాన్ని కూడా తీసుకెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి ఆరోపిస్తోంది. దానికి ప్రతిగానే ప్రధాన మిలిటరీపై పోరాటం చేయడానికి పుతిన్.. వ్యాగ్నర్ గ్రూప్ ద్వారా ఆర్ఎస్ఎఫ్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నారన్నది ప్రధాన అభియోగం.

Wagner Group
ఆఫ్రికాను దోచేస్తున్న వ్యాగ్నర్ గ్రూప్
ప్రభుత్వాలకు సాయం అందించే పేరుతో ఆయా దేశాల్లో అడుగుపెట్టడం, అక్కడ రాజకీయ-మిలిటరీ సంక్షోభాలు తలెత్తితే ఓ వర్గానికి మద్దతివ్వడం, వారికి ఆర్థికంగా అండగా ఉండి ఆయుధాలు సరఫరా చేయడం, అందుకు ప్రతిగా ఆయా దేశాల్లో బంగారంతో పాటు ఇతర ఖనిజ సంపదను దోచుకుని రష్యాకు తరలించడం.. ఇవీ వ్యాగ్నర్ గ్రూప్ ఆఫ్రికా ఖండంలో చేస్తున్న పనులు. సూడాన్‌తో పాటు సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, లిబియా.. ఇలా అనేక దేశాల్లో వ్యాగ్నర్ విస్తరించింది. 2017లో అప్పటి సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్ బహీర్ పిలుపుతో ఆ దేశంలో అడుగుపెట్టిన వ్యాగ్నర్ కూడా చివరకు అక్కడి రాజకీయ పరిస్థితులను శాసించే స్థాయికి చేరుకుంది. సూడాన్‌లో వ్యాగ్నర్ గ్రూప్‌ కార్యకలాపాలకు తిరుగే ఉండదు. దేశ సంపదను దోచేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వ్యాగ్నర్‌కు మద్దతుగా రంగంలోకి దిగే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ వెంటనే వాళ్ల గొంతు నొక్కేస్తుంది. వ్యాగ్నర్, ఆర్ఎస్ఎఫ్ తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎంతటి రక్తపాతాన్ని సృష్టించడానికైనా వెనుకాడవు.
ఖజానాకు చేరకుండా పక్కదారి పడుతున్న బంగారం
సూడాన్‌లో బంగారం గనులపై పూర్తి స్థాయి పట్టు సాధించిన వ్యాగ్నర్ గ్రూప్.. దాన్ని ప్రభుత్వ ఖజానాకు చేర్చకుండా, లెక్కా పత్రం లేకుండా దొంగచాటున రష్యా తరలిస్తూ ఉంటుంది. ఒక్క 2021లోనే 1.9 బిలియన్ డాలర్ల విలువైన 32.7 టన్నుల బంగారాన్ని వ్యాగ్నర్ గ్రూప్ అక్రమంగా రష్యా చేర్చినట్టు అమెరికా ఆరోపిస్తోంది. సూడాన్ మిలిటరీ జుంటాలతో నేరుగా సంబంధాలు పెట్టుకున్న వ్యాగ్నర్ గ్రూప్.. ఆ దేశ ట్రెజరీకి చేరాల్సిన బిలియన్ డాలర్ల బంగారాన్ని బైపాస్ చేసి మాస్కోకు తరలించినట్టు అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి.
పుతిన్ పొందుతున్న ప్రయోజనాలు ఏంటి ?
సూడాన్‌కు, అక్కడి ప్రజలకు చెందాల్సిన సహజ సంపదను రష్యాకు తరలించడం ద్వారా ఆర్థికంగా ఆ దేశం లబ్దిపొందుతోంది. యుక్రెయిన్‌తో యుద్ధం కారణంగా అమెరికా సహా పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల సతమతమవుతున్న పుతిన్‌కు సూడాన్ నుంచి వివిధ రూపాల్లో అందుతున్న సాయం ఉపయోగపడుతోంది. ఆఫ్రికాకు చెందిన సహజ సందపను తన గుప్పెట్లో పెట్టుకోవడం ద్వారా రష్యా తన అవసరాలను తీర్చుకుంటోంది. దీనికి తోడు వ్యాగ్నర్ గ్రూప్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయంగానూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోంది. సూడాన్ సహా ఆఫ్రికా దేశాల్లో ఆపరేషన్స్ చేపట్టడానికి రష్యా చేస్తున్న ఖర్చుతో పోల్చితే రాజకీయంగా పొందుతున్న ప్రయోజనాలే చాలా ఎక్కువ. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేస్తే రష్యాకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆఫ్రికాకు చెందిన 15 దేశాలు గైర్హాజరయ్యాయి. ఎరిట్రా , మాలి దేశాలు నేరుగా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. దీన్ని బట్టి ఆఫ్రికా దేశాలను రష్యా ఏ స్థాయిలో గుప్పిట్లో పెట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
వ్యాగ్నర్ గ్రూప్‌తో పొంచి ఉన్న ప్రమాదం
రష్యా స్వార్థ ప్రయోజనాల కోసం ఆఫ్రికా దేశాల్లో వ్యాపారం చేస్తూ అక్కడి తిరుగుబాటు నేతలకు అన్నిరకాలుగా మద్దతిస్తున్న వ్యాగ్నర్ గ్రూప్.. భవిష్యత్తులో ఆఫ్రికా దేశాలను పూర్తిగా కబళించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఆఫ్రికా దేశాల సంపదను దోచుకోవడమే కాదు.. మానవ హక్కుల ఉల్లంఘనలకు కూడా పాల్పడుతున్నట్టు వ్యాగ్నర్ గ్రూప్ అభియోగాలు ఎదుర్కొంటోంది. మారణహోమం సృష్టించైనా సరే వ్యవస్థలను, వ్యక్తులను తన గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా ఆయా దేశాల మనుగడకే ఇబ్బందిగా మారింది వ్యాగ్నర్ గ్రూప్. ఆఫ్రికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు కూడా వ్యాగ్నర్ నుంచి ఎప్పటికీ ముప్పు పొంచే ఉంటుంది.