Rajasthan: రాజస్థాన్‌లో ముసలం.. కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులే.. ప్రగతిశీల కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు దిశగా సచిన్ పైలెట్
తెగేవరకూ లాగితే ఏమవుతుందో.. ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్‌లో అదే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తే ఇక తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని.. సచిన్ పైలెట్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ముఖ్యమంత్రి గెహ్లాట్‌తో ఉన్న రాజకీయ పంచాయితీని పరిష్కరించడంలో గానీ, తన డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంలో గానీ పార్టీ హైకమాండ్ విఫలమైందని భావిస్తున్న సచిన్ పైలెట్.. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుబోతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చేందుకు సచిన్ పైలెట్ వర్గం సిద్ధమవుతుంది. వేరు కుంపటి పెట్టుకుని కాంగ్రెస్‌తో ఢీకొట్టేందుకు సచిన్ పైలెట్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
జూన్ 11..సచిన్ పైలెట్ కొత్త పార్టీ ?
రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్‌పై యుద్ధం చేసి పంతం నెగ్గించుకోలేకపోయిన సచిన్ పైలెట్ మరో పార్టీ రూపంలో గెహ్లాట్‌కు ప్రత్యర్థి కాబోతున్నారు. ప్రగతిశీల కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆయన కొత్త రాజకీయ దుకాణం తెరవబోతున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ఇప్పటి వరకు నేరుగా ఎలాంటి ప్రకటన చేయని సచిన్ పైలెట్.. గ్రౌండ్ లెవల్‌లో గుట్టుచప్పుడు కాకుండా పార్టీ నిర్మాణాన్ని చేపట్టారు. తండ్రి రాజేష్ పైలెట్ నుంచి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న సచిన్ పైలెట్… ఈ నెల 11న తండ్రి వర్ధంతి రోజునే పార్టీ పేరు ప్రకటించాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మీడియాకు దూరంగా ఉంటున్న ఆయన , రాజ్యసభ సభ్యుడు వివేక్ తంకాతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానికంగా ఉన్న నేతల పల్స్ తీసుకోవడంతో పాటు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఎలాంటి మద్దతు వస్తుందన్న విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 11న రాష్ట్ర రాజధాని జైపూర్‌లో భారీ ర్యాలీని నిర్వహించడం ద్వారా తన బలాన్ని ప్రదర్శించి పార్టీ పేరును ప్రకటించే ఆలోచనలో ఉన్నారు సచిన్ పైలెట్.
సచిన్ పైలెట్‌తో కలిసి వచ్చేది ఎవరు ?
రాజస్థాన్ కాంగ్రెస్‌లో గెహ్లాట్, సచిన్ పైలెట్ ఇద్దరూ ఉద్ధండులే. రాజకీయాల్లో తలపండిన నేతగా అశోక్ గెహ్లాట్‌కు పార్టీపై పట్టు ఉంటే… మాజీ డీప్యూటీ సీఎంగా, మాజీ పీసీసీ చీఫ్‌గా సచిన్ పైలెట్ కూడా తనకంటూ ఓవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీని కాదని… సచిన్ పైలెట్‌తో ఎంత మంది చేతులు కలుపుతారన్నది చెప్పలేని పరిస్థితి.2020లో సచిన్ పైలెట్.. గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసినప్పుడు తనకు30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని.. వారితో కలిసి తిరుగుబాటు చేస్తానని సచిన్ పైలెట్ బెదిరించారు. అయితే గెహ్లాట్ తన రాజకీయ చతురతను ప్రదర్శించి హైకమాండ్‌ను రంగంలోకి దింపి.. వారిలో కొందర్ని తన వైపు తిప్పుకున్నారు. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో 125 మంది గెహ్లాట్‌కు మద్దతివ్వడంతో ఆయన ప్రభుత్వం నాడు సంక్షోభం నుంచి బయటపడింది. 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కూడా అప్పుడు సచిన్ వైపు నిలబడలేదు.
ఎన్నికల సమయంలో సచిన్‌ను తక్కువ అంచనా వేస్తే ?
డీకే శివకమార్, సిద్ధరామయ్య జాయింట్ పొలిటికల్ ఆపరేషన్‌తో కర్ణాటకలో గెలిచి మళ్లీ కొత్త ఊపు వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రాజస్థాన్ ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకుంటే.. అంతకు మించిన పరాభవం మరొకటి ఉండదు. 2020లో సచిన్ పైలెట్ తిరుగుబాటు చేసినప్పటి కంటే.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేకతో పాటు గెహ్లాట్ తీరుపైనా అసంతృప్తి పెరిగింది. వసుంధరరాజే ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ ఏప్రిల్ 11న రోజంతా నిరసన దీక్ష నిర్వహించారు సచిన్ పైలెట్. పేపర్ లీక్ వ్యవహారంతో పాటు అనేక అంశాలను ఎజెండాగా ఎత్తుకుని గత నెలలో అజ్మీర్ నుంచి జైపూర్ వరకూ పాదయాత్ర కూడా చేశారు. ఆ సమయంలో తనకు లభించిన మద్దతును అంచనా వేసుకున్న సచిన్ పైలెట్.. గెహ్లాట్‌కు అల్టిమేటం కూడా ఇచ్చారు. హైకమాండ్‌పై ఎంత ఒత్తిడి తెచ్చినా…తన మాట చెల్లుబాటు కావడం లేదని గ్రహించిన సచిన్ పైలెట్.. కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నారు. కొత్త పార్టీయే ఏకైక మార్గమని డిసైడ్ అయిపోయారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పే
రాజస్థాన్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ చేయాల్సిన ముఖ్యమైన పనులు మూడున్నాయి. ఒకటి ఎన్నికలు జరిగే వరకు గెహ్లాట్ ప్రభుత్వం కూలిపోకుండా చూసుకోవడం. రెండు..వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలిచేలా చేయడం..ఇక మూడు..ఎన్నికల సమయంలో గెహ్లాట్- పైలెట్ మధ్య ఐక్యత సాధించడం..ఈ మూడు సాధ్యం కాకపోతే కర్ణాటక గెలుపు ఇచ్చిన జోష్ కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్ రూపంలో అడుగంటిపోతుంది. గెహ్లాట్ – పైలెట్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఖర్గేతో సహా హైకమాండ్ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
ఖర్గే ముందు ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ?
మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాజస్థాన్‌లోనూ అధికారానాన్ని నిలబెట్టుకునేలా చేయడం ఖర్గేకు వ్యక్తిగతంగా కూడా చాలా అవసరం. రాజస్థాన్ సంక్షోభానికి ఆయన ముగింపు పలకలేకపోతే.. ఓటమి భారాన్ని ఆయన కూడా మోయాలి. గెహ్లాట్ స్థానంలో సచిన్ పైలెట్‌ను సీఎంను చేసేందుకు లేదా.. పైలెట్‌కు పీసీసీ బాధ్యతలు అప్పగించేందుకు హైకమాండ్ సిద్ధంగా లేదు. పోనీ వీళ్లిద్దరినీ పక్కన పెట్టి మరో నేతను కూర్చోపెట్టే పరిస్థితులు కూడా లేవు. ఇలాంటి రాజకీయ సంక్షోభాలు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాకపోయినా… సచిన్ పైలెట్ తీసుకోబోయే నిర్ణయం… రాజస్థాన్‌లో కచ్చితంగా పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.